ఏపీలో ఏటా నాలుగోవంతు షాపులను తగ్గించడం ద్వారా మద్యం అమ్మకాలు తగ్గించుకుంటూ పోతామని, మద్య నిషేధంలో ఇది ఒక భాగమని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ మద్యం షాపుల సమయాలను కూడా కుదించారు. దీంతో ప్రభుత్వం మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తోందనే భ్రమను కల్పించారు. అయితే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గతంలో రోజుకు ఏపీలో రూ.50 కోట్ల విలువైన మద్యం అమ్మగా నేడు అది రోజుకు రూ.70 కోట్లకు చేరింది. షాపులు తగ్గించుకుంటూ మద్యం సేల్స్ అమాంతం పెంచుకుంటున్నారు. మద్యనిషేధం దిశగా అడుగులు వేయడం అంటే ఇదేనా అని ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.
మరో గంట అమ్మండి
ప్రభుత్వ దుకాణాలు ఉదయం 11 గంటలకు తెరచి, రాత్రి 8 గంటలకు అమ్మకాలు నిలిపి వేయాలని, గంటపాటు లెక్కలు చూసుకుని 9 గంటల కల్లా మూసివేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. తాజాగా అబ్కారీ శాఖ అధికారులపై మద్యం సేల్స్ పెంచాలని ఒత్తిడి తీసుకువస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే అబ్కారీ అధికారులు, మేనేజర్లు మద్యం షాపుల సూపర్‌వైజర్లకు మెసేజ్‌లు పెట్టారు. ఈ సంక్షిప్త సమాచారం ఉద్దేశం మద్యం అమ్మకాలు పెంచాలని. రాత్రి 9 గంటల వరకు కూడా మందు అమ్మాలని ఆ మెసేజ్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. మద్యం ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే మద్యం షాపుల్లో అమ్మకాలను రాత్రి 9 గంటల వరకు పెంచాలని అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. నెలవారీ సేల్స్‌పై కూడా టార్గెట్లు పెడుతున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఇదే నెలలో కంటే 30 శాతం రెవెన్యూ పెంచాలని అధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వారు కూడా రాత్రి 9 వరకూ మద్యం అమ్మకాలు చేయాలని ఆదేశించారు. దీంతో రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్లకు మద్యం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది.
Must Read ;- జగన్.. మద్యం పై మాట తప్పలే.. కాని తిప్పారు..
అమ్మఒడి వేయక ముందే అబ్కారీ శాఖ అలర్ట్
ఓ వైపు ప్రభుత్వం అమ్మఒడి కోసం రూ.6,500 కోట్లు అప్పులు తీసుకువచ్చి తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఇంతలోనే అబ్కారీ శాఖ రాత్రికి రాత్రి సేల్స్ పెంచాలంటూ మెసేజ్‌లు పంపారు. అంటే జనం దగ్గర డబ్బు ఉండగానే పిండేయాలని అబ్కారీ శాఖను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. అటు జనం ఖాతాలో డబ్బు వేయగానే వెంటనే మద్యం అమ్మకాల ద్వారా రాబట్టాలనే ఆలోచన దారుణమని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. ఓ వైపు అమ్మఒడి అంటూనే నాన్నబుడ్డి ద్వారా మరలా లాక్కుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదేనని విపక్షాలు మండిపడుతున్నాయి.
షాపులు తగ్గిస్తాం… సేల్స్ పెంచుతాం..
ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులను తగ్గించుకుంటూ పోతామని, దీని ద్వారా 2024 నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి తీసుకువస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు దఫాలు మద్యం షాపుల సంఖ్యను కుదించారు. అయితే, ప్రభుత్వ షాపుల సంఖ్యను తగ్గిస్తూ బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏపీలో మద్యం షాపుల సంఖ్య 3200 నుంచి 2800 కు తగ్గినా మద్యం ఆదాయం మాత్రం రూ.16000 కోట్ల నుంచి రూ.21000 కోట్లకు పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మద్యం సేల్స్ పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెంచుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మద్యపాన నిషేధం అని చెబుతూనే పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
త్వరలో అన్నీ బ్రాండ్లు అందుబాటులోకి
వైసీపీ అధికారంలోకి రాగానే మద్యం షాపులను ప్రభుత్వమే నడిపేలా ఏర్పాట్లు చేశారు. అయితే పేరున్న బ్రాండ్లను ఏపీలో లేకుండా చేశారు. దీంతో ఊరూపేరు లేని బ్రాండ్లను రెట్టింపు ధరలకు అమ్మడంతో తెలంగాణతోపాటు, పొరుగు రాష్ట్రాల నుంచి బ్రాండెడ్ మద్యం స్మగ్లింగ్ పెరిగిపోయింది. ఇలా మొదటి ఏడాది ఏపీ ప్రభుత్వం రూ.6000 కోట్లు నష్టపోయింది. దీంతో కళ్లు తెరిచిన ప్రభుత్వ పెద్దలు చిన్నగా బార్లలో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ప్రభుత్వ మద్యం షాపుల్లోనూ బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తీసుకువస్తోంది. మొత్తం ఒకేసారి కాకుండా తాజాగా రెండు బ్రాండ్లకు అనుమతించారు. మరికొద్ది రోజుల్లో అన్నీ బ్రాండ్లు ఏపీ మద్యం షాపుల్లో దొరికే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా మద్యనిషేధం హామీకి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
Also Read ;- కోడి పందాలపై పోలీసుల ఉక్కుపాదం.. రాజు గారిపై కోపమే కారణమా?











