సిసింద్రీ – ఎవరైనా పిల్లలు చురుకుగా ఉంటే అలాంటి వాళ్లను సిసింద్రీలు అనటం మనకు అలవాటు. సిసింద్రీ లాంటి పిల్లలను చూసి మురిసిపోయే తల్లదండ్రులు కూడా ఎక్కువే. అలాంటి ‘సిసింద్రీ’ వెండి తెరమీదకు వస్తే… 25 ఏళ్ల కిత్రం అలాంటి ప్రయత్నమే జరిగింది. అక్కినేని వారసుడు అఖల్ అక్కినేని బుడిబుడి నడకల వయసులోనే హీరో అయిపోయాడు. ఆ బుల్లి హీరో అఖిల్ కాస్తా ఇప్పుడు యువహీరో అఖిల్ గా మారిపోయాడు. కానీ అఖిల్ కెరీర్ లో మంచి సక్సెస్ అంటే చెప్పుకోడానికి మాత్రం ఆ ఒక్క ‘సిసింద్రీ’నే మిగిలింది.
గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగార్జున అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సెప్టెంబరు 14వ తేదీకి ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలైంది. నిజానికి ఈ సినిమా తెరకెక్కిన విధానం తమాషాగానే ఉంటుంది. దీనికి ఓ ఏడాది క్రితం హాలీవుడ్ లో ఓ సినిమా విడుదలైంది. దాని పేరు ‘బేబీస్ డే అవుట్’.ఆ సినిమాలో ఓ బుల్లి హీరో చేసిన విన్యాసాలు జనాన్ని విపరీతంగా ఆకర్షించాయి. కడుపుబ్బ నవ్వించాయి. అది హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాని తెలుగులో నిర్మిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ‘సిసింద్రీ’గా మారింది.

దర్శకుడు శివనాగేశ్వరరావు తనకొచ్చిన ఈ ఆలోచనను నాగార్జునతో పంచుకోవడం, సిసింద్రీ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం జరిగిపోయింది. ఒక విధంగా అతిచిన్నవయసులో తెరంగేట్రం చేసిన అక్కినేని వారసుల్లో అఖిల్ కూడా చేరిపోయారు. సుడిగుండాలు సినిమా నాగార్జున కూడా చిన్ప వయసులోనే వెండి తెరపై కనిపించినా లీడ్ రోల్ కాదు. అతిచిన్న వయసులో సినీరంగ ప్రవేశం చేసిన బుల్లి హీరో ఘనత మాత్రం అఖిల్ అక్కినేనికే దక్కుతుంది. సిసింద్రీగా అఖిల్ చేసిన మాయ ఇంతా అంతా కాదు. ఇందులో అఖిల్ తల్లి దండ్రులుగా శరత్ బాబు, ఆమని నటించారు. శరత్ బాబు తమ్ముడిగా శివాజీ రాజా నెగిటివ్ రోల్‌లో కనిపించారు.
కథేంటి: ఓ పిల్లాడు ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి తగిన కారణం కూడా కావాలి కాబట్టి అలాంటి కారణం ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. శరత్ బాబు, ఆమని దంపతుల చక్కటి కుటుంబంలో శివాజీరాజా విలన్ గా కనిపిస్తాడు. అన్నయ్య మీద కోపంతో అతను సిసింద్రీని కిడ్నాప్ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తాడు. ఇందుకు అక్కన్న, మాదన్న, జక్కన్న (తనికెళ్ల భరణి, సుధాకర్, గిరిబాబు)ల సహకారాన్ని తీసుకుంటాడు. అలా అపహరించిన ఆ గ్యాంగ్‌ను సిసింద్రీ ఎలా బురిడీ కొట్టించాడు అన్నదే ప్రధాన కథ. శరత్ బాబు, ఆమనిలకు నాగార్జున తోడై సిసింద్రీని ఆ ముఠా నుంచి రక్షించి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ ముగుస్తుంది.

దర్శకుడు శివ నాగేశ్వరరావు తన సినిమాల్లో కామెడీకి పెద్దపీట వేస్తారు. ఇందులో కూడా ఆ కామెడీ పండింది. రాజ్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకి ఆకర్షణగా నిలిచింది. ‘చిన్ని తండ్రీ నిను చూడగా’ అనే పాట హైలైట్ అనే చెప్పాలి. బ్రహ్మానందం, ఎ.వి.ఎస్ లు మంచి హాస్యాన్ని పండించారు. కాకపోతే ఈ కామెడీ సన్నివేశాలు బేబీస్ డే అవుట్ లో బాగా రక్తికట్టాయి. మొత్తానికి ‘సిసింద్రీ’ మాత్రం అక్కినేని అఖిల్ కెరీర్ లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది.
ఒక విధంగా అఖిల్ కు ఈ కాంబినేషన్ ఓ సెంటిమంట్ గా భావించాల్సి ఉంటుందేమో. హీరోగా మళ్లీ సక్సెస్ రావాలంటే అఖిల్ కు ఇందులోని ఎవరో ఒకరు తోడు అవసరమవుతున్నట్లే ఉంది. అందుకేనేమో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో అఖిల్ తల్లిగా మళ్లీ ఆమనినే తీసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత అఖిల్ ఈ సినిమాలో మళ్లీ ఆమనితో కలిసి నటించడం విశేషం. ఇక ఉన్న కొరత ఏమిటంటే శివనాగేశ్వరరావు కాంబినేషన్లో మళ్లీ సినిమా చేయడం. అది ఇప్పట్లో సాధ్యమవుతుందో లేదో చెప్పలేం.











