బీజేపీతో జట్టు కట్టినప్పటి నుంచీ జనసేన పరిస్థితి దిగజారిపోయింది. 2019 ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకున్నా, ఆ పార్టీ 6 శాతం ఓట్లు సాధించింది. బీజేపీకి కేవలం 0.5 శాతం మాత్రమే ఓట్లు దక్కాయి. అంటే బీజేపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతే దీనికి కారణం.
అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసినా కేంద్రం జోక్యం చేసుకోకపోవడంతో ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దిగజారింది. ఇక ఏపీలో బీజేపీ మెరుగుపడుతుందన్న ఆశ కూడా లేదు. ఇలాంటి సమయంలో జనసేన అధినేత బీజేపీతో కలసి నడవాలని నిర్ణయించడంతో జనసైనికులు ఆగ్రహంతో ఉన్నారు. అరశాతం ఓట్లు కూడా రాని పార్టీ ఆదేశిస్తే మనం పనిచేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్త ంచేస్తున్నారు.
జనసేన అధినేత ఏ పిలుపు ఇచ్చినా జనసైనికులు కదలి వస్తారు. కష్టపడి పనిచేస్తారనే పేరుంది. పోలీసులు కేసులు పెట్టినా వెనుకాడరు. బీజేపీతో జతకట్టినప్పటి నుంచీ బీజేపీతో కలసి ధర్నాలు, నిరసనలు చేయాల్సి వస్తోంది. దీంతో జనసైనికులకు ఇబ్బందిగా మారింది. బీజేపీకి ఎక్కడా పట్టుమని పది మంది క్యాడర్ లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కార్యక్రమాలు చేస్తుంటే బీజేపీ నాయకులు వచ్చి ముందు వరుసలో నిలబడి జెండాలు పెడుతున్నారని జనసైనికులు గుర్రుగా ఉన్నారు.
ఎవరికి ప్రయోజనం?
జనసేన బీజేపీతో కలసి నడిస్తే బీజేపీకే ప్రయోజనం కానీ జనసేనకు ఏ మాత్రం బెనిఫిట్ లేదు. ఎందుకంటే బీజేపీ ఓట్లతో జనసేన దండుకునేది ఏమీ లేదు. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి ఎవరైనా గెలిస్తే మావల్లే గెలిచారని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో జట్టుకట్టడంపై జనసేన అధినేత మరోసారి పునరాలోచించుకోవాలని క్యాడర్ కోరుతోంది.
ఎవరితో పొత్తు వద్దు ఒంటరిపోరాటం చేద్దాం…
జనసైనికులు ఒంటరి పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నారు. తమను పార్టీలు వాడుకుని వదిలేస్తున్నాయని జనసైనికులు భావిస్తున్నారు. 2014లో జనసేన ఓట్లతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, తరవాత తమను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక బీజేపీతో కలసినా జనసేనకు ఒరిగేదేమీ లేదు. అందుకే ఎలాంటి ఫలితాలు వచ్చినా ఫరవాలేదు. ఒంటరిగానే పోరాటాలు చేయాలని జనసైనికులు భావిస్తున్నారు. బీజేపీతో కలసి నడవాలని జనసేన అధినేతను ఎవరో తప్పుదారి పట్టించారని వారు అనుమానిస్తున్నారు. ఇన నైనా మతతత్వ బీజేపీని వీడి, అన్నీ కులాలు, మతాల వారికి ప్రాధాన్యం ఇస్తే పార్టీ బలపడుతుందని వారు సూచిస్తున్నారు.
ఓటింగ్ లేని పార్టీతో ఎందుకు జతకట్టినట్టు…
ఏపీలో నోటాతో సమానంగా కూడా ఓట్లు సంపాదించుకోలేకపోయిన బీజేపీతో జనసేన అధినేత ఎందుకు జట్టుకట్టారో ఎవరికీ అంతుపట్టడం లేదు. కేవలం ప్రధాని నరేంద్రమోడీపై ఉన్న అభిమానంతోనే ఇలా చేశారని భావిస్తున్నారు. ఒక వేళ ప్రధానిపై ప్రేమ ఉంటే, కేంద్రంలో కలసి పనిచేస్తే సరిపోయేది. ఏపీలో బీజేపీతో కలవడం వల్ల జనసేనకు మద్దతు పలికిన మైనార్టీలు ఆలోచనలో పడ్డారు. మొదటి నుంచీ ముస్లీం మైనారిటీలు బీజేపీకి దూరం. ఏపీలో అధికంగా ఉన్న ముస్లిం మైనారిటీలు జనసేనకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఎప్పుడైతే జనసేన, బీజేపీ పంచన చేరిందో అప్పటి నుంచీ పార్టీకి ముస్లింలు దూరం అయ్యారని సమాచారం.
ఇప్పటికైనా జనసైనికుల అభిప్రాయాలకు విలువనిచ్చి బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఒంటరి పోరాటాలకు జనసేనాని ముందుకు వస్తే ఆ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని జనసైనికులు భావిస్తున్నారు.