ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో అభివృద్ధికి ఆమడదూరంలో జీవచ్ఛవంలా కొట్టుమిట్టాడుతున్న శ్రీకాకుళం జిల్లాకు జిల్లాల పునర్విభజన ఆశనిపాతంలా మారనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులు ఉవ్వెత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక స్వపక్ష , విపక్ష రాజకీయనాయకులు , మేధావులు , ఉద్యోగులు , యువత కలసికట్టుగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాల విభజన జరిగితే శ్రీకాకుళం జిల్లా తల, కాళ్లు చేతులు పక్కజిల్లాల్లో కలసిపోయి మొండెం మాత్రమే మిగులుతుందనేది నిర్వివాదాంశం. ఇదే వాస్తవరూపం దాలిస్తే జిల్లా ప్రజలు ఏ మాత్రం సహించరని సిక్కోలు వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి , శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, బహిరంగంగా ఇప్పటికే వెల్లడించారు. అదికూడా ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాలు చూస్తున్న విజయసాయిరెడ్డి సమక్షంలో , వైసీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల బహిరంగ సభ సాక్షిగా జిల్లా ప్రజల అభిప్రాయంగా స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం , పలాస , పాతపట్నం , టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం , ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో శ్రీకాకుళం, నరసన్నపేట , టెక్కలి, పాతపట్నం, పలాస , ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లా విభజన జరిగితే ఈ జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో కలుస్తాయి. ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన పాలకొండ , గిరిజనోత్పత్తులకు మారుపేరైన సీతంపేట అరకు/పార్వతీపురం జిల్లాలో కలసిపోతాయి. అప్పుడు శ్రీకాకుళం జిల్లాకు ఇసుక , సముద్రపు నీరు తప్ప ఏమీ మిగలవనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే.. సిక్కోలు ప్రతిఘటన అణగదొక్కేందుకే- ముందస్తు జాగ్రత్తగా నిన్న కాక మొన్న రాజకీయ ఆరంగేట్రం చేసిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చి సామాజిక తురుపుముక్కను ఉపయోగించి మత్స్యకారుల నోరు మూయించే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి.
శ్రీకాకుళంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంలో మర్మం కూడా అదేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ గా టెక్కలికి చెందిన పేరాడ తిలక్ ,తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా శ్రీకాకుళం కు చెందిన మామిడి శ్రీకాంత్ , కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ గా శ్రీకాకుళం కు చెందిన అంధవరపు సూరిబాబు నియామకాలు జరిగాయి.
ఒకే జిల్లాకు మూడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇవ్వడంలో ఆంతర్యం చెప్పకుండానే తెలుస్తోంది. ఇదంతా నిశితంగా పరిశీలిస్తే ఏడుస్తున్న పిల్లలకు బెల్లం ఇచ్చే చందమేనని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రాతిపదికనే జిల్లా విభజనకు నిర్ణయిస్తే సహించేది లేదని జిల్లా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో ఏదోమూల ప్రతిరోజూ నిరసన ధ్వనులు వినిపిస్తునేవున్నారు.











