అమరావతి : కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. కొత్తగా ప్రేమలో పడ్డవాడు పొద్దస్తమానం తన ప్రియురాలికి ఫోన్లు చేస్తూనే ఉంటాడు. ఇదంతా వారి వారి అస్తిత్వ సమస్య. తనను ప్రియురాలు గుర్తుంచుకుంటుందో.. మరచిపోతుందో అని భయం. పొద్దెరగని కొత్త బిచ్చగాడికీ- ఇలాంటి కొత్త ప్రియుడికీ కొంత తేడా ఉంది. ఈ ఇద్దరిలో ఆంధ్రప్రదేశ్ భాజపా కొత్త చీఫ్ సోము వీర్రాజు ఏ కేటగిరీకి చెందుతారు. ఆయన మాత్రం తన అస్తిత్వాన్ని రాష్ట్రమంతా గుర్తించేలా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అసలే అసలే కనిష్టమైన ప్రజాదరణతో కనాగష్టంగా ఉన్న తమ పార్టీనుంచి ఉన్న నాయకుల్ని కూడా బయటకు గెంటుతున్నారు. వరుస సస్పెన్షన్‌లతో సోము వీర్రాజు తన ఉనికిని చాటుకోగలరేమో గానీ.. నలుసంత పార్టీ ఉనికిని, నామరూపాల్లేకుండా చేసేస్తారా? అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో కలుగుతోంది.
ఏపీ రాజధాని అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ.. ఇదివరకు అనుసరించిన వంచనాత్మకమైన బాటలోనే సాగుతోంది. అమరావతి అంటేనే పగబట్టినట్టుగా మోడీ సర్కారు చిన్న చూపు చూస్తూ వచ్చిందనే ఆరోపణలు తొలినుంచి ఉన్నాయి. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత.. అనుసరిస్తున్న అమరావతి విధ్వంసక విధానాలకు పరోక్షంగా భాజపా ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం కూడా వ్యాప్తిలో ఉంది. దానికి విరుగుడుగా ‘‘రాజధానిగా అమరావతినే సమర్థిస్తాం’’ అని పైకి మాట్లాడుతూ.. మూడు రాజధానుల యత్నానికి మోడీ సర్కారు ఆశీస్సులు అందించింది. రాజధానిని నిర్ణయించుకోవడం రాష్ట్రం వ్యవహారం అని, తమకు సంబంధం లేదని సెలవిచ్చింది. ఈ రెండు నాల్కల ధోరణిని ప్రశ్నించిన వారిపై ఎడా పెడా కత్తి దూస్తోంది.
భాజపా నాయకుడు ఓవి రమణ వ్యాఖ్యలు చాలా పరిమితమైనవి. ‘‘పాత అధ్యక్షుడు (కన్నా) అమరావతిలోనే రాజధాని ఉండాలన్నారు. కొత్త అధ్యక్షుడు (సోము వీర్రాజు) కేంద్రం జోక్యం చేసుకోదంటున్నారు. ఈ గందరగోళం పార్టీపై ప్రజలకు నమ్మకాన్ని సడలింపజేస్తుంది’’ అనేది ఆయన వ్యాఖ్య. ఆ మాటలు పార్టీ హితం కోరి చెప్పినట్టుగానే ఉన్నాయి. తమ లోపాన్ని దిద్దుకోకుండా.. సోము వీర్రాజు ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. ‘పార్టీ అమరావతి రైతులకు అండగా ఉండలేకపోతు’న్నదని అంటూ, తనని తాను చెప్పుతో కొట్టుకున్న భాజపా అధికార ప్రతినిధి వెలగపూడి రామకృష్ణను కూడా పార్టీనుంచి సస్పెండ్ చేశారు.
ఈ సస్పెన్షన్ నిర్ణయాలు పార్టీలో ఉలికిపాటుకు, భయానికి నిదర్శనాలు. గత ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు కూడా రాని తమ పార్టీని, ఇలాంటి నిర్మొగమాటపు వ్యాఖ్యలు మరింత అథోగతికి తీసుకువెళ్తాయని భయం. కానీ తప్పును ఎత్తిచూపే గొంతును నొక్కేయగానే.. సత్యం మరుగున పడిపోతుందని అనుకోవడం ఎంత అవివేకం. ఏపీ భాజపా అలాంటి దుస్థితిలోనే ఉంది.
‘అమరావతిలోనే రాజధాని ఉండాలనేదే మా డిమాండ్’ అని జీవీఎల్ లాంటి వాళ్లు ఒకవైపు మాట్లాడుతూ… మరో వైపు ‘కేంద్రం జోక్యం చేసుకోదు’ అనడం ద్వారా. ఎలాంటి ద్వంద్వ వైఖరులు ప్రదర్శిస్తున్నారో అందరికీ తెలుసు. టెక్నికల్‌గా పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు కావొచ్చు. కానీ వెలగపూడి రామకృష్ణ అడిగింది పార్టీనే. రాజధానిలో కేంద్రం జోక్యం చేసుకోకపోయినంత మాత్రాన.. రాజధాని రైతుల పోరాటానికి భాజపా అండగా ఉండడానికి అడ్డేమిటి? అలాంటి ప్రశ్న రావడం వల్ల .. మాయమాటలతో తాము కప్పుకున్న ముసుగు తొలగిపోతుందని భాజపా భయపడుతోంది. అందుకే కనీసం అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేకుండా గొంతు నులిమేస్తోంది.
ఇలాంటి పరిస్థితిని గమనించినప్పుడు.. భాజపా కంటె కాంగ్రెస్ మేలు అనిపించడంలో అతిశయోక్తి లేదు. ఆ పార్టీలో సాక్షాత్తూ అధినాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేసిన వారు కూడా, తదనంతరం పెద్దపదవులను అలంకరించిన తార్కాణాలున్నాయి. ఎవరు పడితే వారు, పార్టీలో ఎంతటి వారి మీదనైనా సరే.. ఎడాపెడా విమర్శలు చేసేస్తుంటారు. ఆ పోకడలకు వారు ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ అనే అర్థంకాని ముద్దు పేరు పెట్టుకుంటారు. భాజపా ఇప్పుడు ‘క్రమశిక్షణ’ అనే పదాన్ని అలాంటి ముసుగుగా మార్చుకుంటోంది.
ఏపీలో ఇప్పుడు భాజపా అందరికంటె వెనుకబడిన పార్టీగా ఉంది. ఆవేదన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరి మీదా.. ఇలా వేటు వేయడం కొనసాగిస్తూ పోతే.. కొమ్మలన్నీ తనంతట తానే నరుక్కున్న మోడుగా మారుతుంది. ఇప్పటిదాకా ఆ పార్టీని ఏపీలో ప్రజలు మాత్రమే అసహ్యించుకుంటూ వచ్చారు. ఇప్పుడు సోము వీర్రాజు నాయకత్వంలో.. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి పరులు కూడా అసహ్యించుకునే వాతావరణం ఏర్పడుతోంది.