వదల బొమ్మాళీ నిన్నొదల అంటూ అతడు ఓ పొలికేక పెట్టగానే.. చిన్న పిల్లలు జడుసుకున్నారు. జ్వరం తెచ్చుకున్నారు. కానీ అదే వ్యక్తి.. ఒక్కొక్క ట్వీట్ చేస్తోంటే జేజేలు కొడుతున్నారు. దేశంలో ఏ మూల ఉన్న వారైనా సరే.. ఆర్తిలో ఉంటే.. ఇబ్బందులు పడుతోంటే.. వారికి ఆపద్బాంధవుడిగా ఇప్పుడు ముంబాయిలో ఉండే అతనే కనిపిస్తున్నాడు.
ఇంత ఉపోద్ఘాతం చెప్పిన తరువాత.. అతనెవరో ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరమే లేదు. అతనే సోనూ సూద్.
వెండితెర.. వ్యక్తుల మీద వారి వ్యక్తిత్వాల మీద.. ప్రజల మనసుల్లో వేసే ముద్ర చాలా బలంగా ఉంటుంది. సినిమా హీరోలు అంటే ప్రజలు వారు నిజంగా దైవాంశ సంభూతులని, దివినుంచి భువికి దిగివచ్చిన వారని, అపరిమిత బలసంపన్నులని అనుకుంటూ ఉంటారు. విలన్ల విషయానికి వస్తే.. సాధారణ ప్రజలు కూడా వారి మీద అకారణ కక్షను పెంచుకుని ద్వేషిస్తుంటారు. పాత్ర ప్రజల మనసుల్లోకి ఇంకుతుందే గానీ.. వ్యక్తిని మర్చిపోతుంటారు. ఇప్పటి హీరో రాజశేఖర్, తలంబ్రాలు చిత్రంలో విలనీ పండించినప్పుడు.. విజయోత్సవాలకు ఏ ఊరు వెళ్లినా మహిళలంతా కొట్టడానికి ఆయన మీదికి వచ్చేవారట! ఇదేమీ జోక్ కాదు.
అయితే ఆ రకంగా వెండితెర ప్రజల దృష్టిలో క్రియేట్ చేసే ఇమేజికి అతీతంగా.. మేరు నగసమానంగా.. సేవా శిఖరంగా ఎదిగిన వ్యక్తి సోనూ సూద్. ‘సోనూ సూద్ హిందువా? ముస్లిమా?’ అని తెలుసుకోడానికి నెటిజన్లు విపరీతంగా గూగుల్ చేశారని తెలిసినప్పుడు.. ఆయన కులం ఏదో తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా విపరీతంగా ప్రయత్నించి.. చివరికి కులం తేల్చుకోలేక, తెలుసుకోలేక.. ఆయన పూర్వుల ఉపాధి మార్గమైన వృత్తిని బట్టి ఫలానా అని ఫిక్సయిపోయి.. ఆ కులం వాళ్లంతా ‘మా వాడే’ అని క్లెయిం చేసుకునే ప్రయత్నం చేశారని విన్నప్పుడు… ఆయన సేవా పరిమళాలు.. మతాల, కులాల అడ్డుగోడలను బద్దలు చేసేసుకుని.. ఎంతగా ప్రజల హృదయాలకు చేరువ అయ్యాయో మనకు అర్థమవుతుంది.
మన పశుపతి.. ఇప్పుడు ప్రజాపతి
శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ చిత్రంతో సోనూసూద్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆయన మేనత్త బాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరక్టర్. దక్షిణాది సినీ పరిశ్రమ అవసరాలకు కూడా ముంబాయి నుంచి నటులను రెఫర్ చేస్తుంటారు. ఆ రకంగా.. తమిళ దర్శకుడు భారతి చేతుల్లో పడ్డారు సోనూ సూద్. కళ్లలగర్ అనే ఆ తమిళ చిత్రం తర్వాత మాతృదేశం అనే పేరుతో తెలుగులోకి డబ్ అయింది కూడా. అదే ఏడాది రెండు తమిళ చిత్రాలు చేసిన సోనూసూద్ 2000లో తెలుగులోకి హ్యాండ్సప్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అడపా దడపా చిత్రాలు చేస్తూ వచ్చారు గానీ.. పూరీ జగన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ చిత్రంలో హీరో నాగార్జునతో దాదాపుగా సమాన ప్రాధాన్యం ఉన్న పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడు లాంటి చిత్రాల పాత్రలు ఆయనను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. అరుంధతి.. ఇమేజి టాప్ గేర్ కు వెళ్లిపోయింది. సోనూసూద్ తెలియనివారు తెలుగు ప్రజల్లో లేరు అనే స్థాయికి ఎదిగారు. అయితే ఈ ఇమేజి మొత్తం అత్యంత కర్కోటకుడు అయిన విలన్ గా మాత్రమే. తరువాత వరుసగా సినిమా అవకాశాలైతే వచ్చాయి గానీ.. పశుపతిని మరిపించేలా ఏవీ రూపొందలేదు.
పాత్రలు- వ్యక్తిత్వం వేర్వేరు..
కొవిడ్ గడ్డు రోజులు మొదలైన తర్వాత.. బయటకు వచ్చిన సోనూసూద్ స్వరూపం వేరు. కానీ.. దానికంటె ముందు రోజులను గుర్తు చేసుకున్నప్పటికీ.. సోనూ గురించి మంచి మాటలే మనకు వినిపిస్తాయి.
ఏవో చెప్పుకోడానికి ఒకటిరెండు తప్ప.. సోనూసూద్ కు దక్కినవన్నీ.. విలన్ పాత్రలే. కానీ.. అతని వ్యక్తిత్వం మాత్రం వేరు. సోనూసూద్ సాధుజీవి. మితభాషిగా పేరుంది. సోనూ సూద్. తెలుగు చిత్రాలలో నటుడిగా.. ఆయనతో పరిచయం, ఆయన పనితీరుతో అనుభవం ఉన్న ఎవ్వరూ కూడా సోనూ సూద్ గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా.. లోపంగా చెప్పలేరు.
విలన్ పాత్రలు వేసే నటులతో సినిమా మేకర్స్ కు రకరకాల అనుభవాలు ఉంటాయి. నటుడిగా ఎంత కీర్తిప్రతిష్టలు ఉన్నవారైనా.. షూటింగుకు సమయానికి రాకుండా, వచ్చినా సెట్లో సరిగా సహకరించకుండా ఏడిపించేవారు అనేకులు. అలాంటివన్నీ ఒక ఎత్తు కాగా.. ప్రత్యేకించి ముంబాయినుంచి విలన్ పాత్రలు పోషించడానికి దిగుమతి అయ్యే నటులతో మన నిర్మాతల అనుభవాలు చాలా చేదుగా ఉంటాయి. చాలా మంది కక్కుర్తిగా వ్యవహరిస్తుంటారనేది జనరల్‌గా వినిపించే మాట. ఒక సినిమా షూట్ లో కాసేపు, మరో సినిమా షూట్ లో కాసేపు నటించడం.. ఇక్కడ ఉన్నన్ని రోజులకూ.. రెండు చిత్రాల నిర్మాతల నుంచి కూడా హోటల్ గది అద్దెలు, ఖర్చులు నగదు రూపేణా పిండుకోవడం.. కాల్షీట్ లెక్కన నిర్మాతలకు కేటాయించి, గంటల లెక్కన ఒకేసారి రెండు మూడు చోట్ల పనులు చేసుకోవడం ఇలాంటి తీసికట్టు వేషాలు వేస్తుంటారని చెబుతుంటారు. కానీ నిన్నటివరకు ఆయన ప్రజాసేవకుడిగా సెలబ్రిటీ కాకపోయినప్పటికీ.. సోనూసూద్ తో ఇలాంటి చీప్ అనుభవాలు ఎవరికీ లేవు.
ఆ మాటకొస్తే.. తొలిరోజుల నుంచి ఇటీవలి వరకు సోనూసూద్ తన రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టుపట్టే వాడు కూడా కాదని కొందరు నిర్మాతలు చెప్పారు. సహజంగానే అరుంధతి చిత్రంలోని పశుపతి పాత్ర తర్వాత.. అతని రెమ్యునరేషన్లు పెరిగాయి. పైగా వేషాలకోసం తరచూ నిర్మాతలు, దర్శకుల చుట్టూ తిరిగే అలవాటున్నవ్యక్తి కూడా కాదు. కానీ, కొవిడ్ సేవల క్రేజ్‌తో దేశానికంతా తెలిసిపోయిన తర్వాత సోనూసూద్ కు సినిమా అవకాశాలు కూడా బాగా పెరిగాయి.
హీరో ఆఫ్ బ్యాడ్ డేస్..
ప్రపంచం అంతా సవ్యంగా గాడిన పడి నడుస్తున్నప్పుడు సేవా కార్యక్రమాలు చేసేవారు అనేకులు ఉంటారు. సాధారణంగా తమ సంపదతో తూకం వేసుకుని కొంత మొత్తాన్ని ఇతరులకు సాయం చేయడానికి వెచ్చిస్తుంటారు. కానీ ‘రైజ్ టూ ది అకేషన్’ అన్నట్టుగా.. సందర్భానికి తగ్గట్టుగా, సంక్షోభాలు వచ్చినప్పుడు స్పందించడం అందరికీ చేతనైన విద్య కాదు. అది కేవలం డబ్బుతో మాత్రం కొలవగలిగేది కూడా కాదు. అలాంటి సేవా తత్పరతను సోనూసూద్ నిరుపమానంగా నిరూపించుకున్నారు. ఈ కొవిడ్ సీజన్లో, దేశవ్యాప్తంగా ఒక్క సినిమా కూడా విడుదలకు నోచుకోని రోజుల్లో.. దేశంలోనే తిరుగులేని కథానాయకుడిగా సోనూసూద్ ఆవిర్భవించారు.
కరోనా గడ్డు రోజులు మొదలైన తర్వాత.. సోనూసూద్ చేసిన సేవాకార్యక్రమాలను గురించి జాబితా కట్టి ప్రస్తావించడం అనేది కొండను అద్దంలో చూపే సాహసం లాగా అవుతుంది. ఎక్కడికక్కడ ఇరుక్కుపోయిన వలసజీవితాలకు ఒక తెరువు చూపించడంలో గానీ.. వారిని స్వస్థలాలకు పంపడానికి ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయడం గానీ, విదేశాల్లో ఇరుక్కుపోయిన విద్యార్థులను స్వస్థలాలకు రప్పించడానికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడం గానీ.. అనూహ్యమైన రీతిలో సోనూసూద్ లోని మానవతామూర్తి ప్రపంచం ఎదుట ఆవిష్కృతమయ్యాడు.
నిజానికి సంఘసేవ పట్ల అనురక్తి ఉండే చాలా మంది వ్యక్తులు కొవిడ్ సీజన్లో క్రియాశీలంగా పనిచేశారు.
తమ తమ పరిధిలో ఆర్తులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. వారందరికీ ప్రణమిల్లవలసిందే. కానీ.. తన పరిధి, శక్తిసంపత్తులు ఇవేమీ పట్టించుకోకుండా.. లార్జర్ దేన్ లైఫ్ సైజులో.. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని తీర్చేయడమే తన ప్రధాన వృత్తి, వ్యాపకం అయినట్టుగా ప్రవర్తించిన వారిని మనం ఎరుగం. అందుకే సోనూసూద్ కు హేట్సాఫ్ చెప్పాలి.
ఎక్కడి ముంబాయి.. ఎక్కడ మదనపల్లి? ఆ పక్కన ఉండే కుగ్రామంలో టమోటా చేనులో ఓ తండ్రి, ఇద్దరు కూతుళ్లను కాడికి కట్టి మడక దున్నిన దృశ్యం చూసిన ఎవరికైనా గుండె కలుక్కుమంటుంది. కానీ కలుక్కుమనడానికి తర్వాతి భాగం ఏమిటో.. ఒక్క సోనూ సూద్ విషయంలోనే మనం చూడగలిగాం.
ఆ కుటుంబానికి తాను ఓ ట్రాక్టరు తీసిస్తానని అనడం.. కేవలం ఒకే ఒక్క రోజు వ్యవధిలో ఆ కుటుంబం చెంతకు ట్రాక్టరు చేరిపోవడం ఎంత చిత్రం. పద్ధతిగా చేతి డబ్బు చెల్లించి ట్రాక్టరు కొనాలనుకున్నా.. కూడా అంత త్వరగా జరగదేమో కొన్ని సందర్భాల్లో! మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. స్వయంగా ఫోను చేసి.. సోనూ సూద్‌కు కృతజ్ఞతలు చెప్పారంటే.. అతని సేవానిరతిని మనం అర్థం చేసుకోవచ్చు.
కొవిడ్ కాలంలో వందల వేల జీవితాలలో వ్యాపించిన సోనూసూద్ సేవా పరిమళాలు ఎన్ని ఉన్నప్పటికీ.. ఈ ఒక్క ఘటనను ప్రస్తావించడం ఎందుకంటే.. మన తెలుగు ప్రాంతానికి పూర్తిగా తెలిసిన ఘటన గనుక!
సంకల్పశుద్ధి అనన్యం
సోనూ సూద్ సంకల్ప శుద్ధి గొప్పది. అందుకే.. ఇలా అనుకున్నాడో లేదో.. మరురోజే వారికి సాయం అందింది. ఆయన చేసిన ప్రతిపనీ ఇలాగే జరిగింది. ప్రభుత్వాల పరంగా అనుమతులు లాంటివి ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చాయి. ఆయన సేవా స్ఫూర్తికి తమ వంతుగా సహకరించాయి.
సాయం చేసేవాళ్లు చాలా మంది మనకు కనిపించారు. కానీ.. ఆయా సందర్భాల్లో.. తమలోని సేవాగుణాన్ని ప్రదర్శించుకోవడానికి ముచ్చటపడ్డ వాళ్లు కూడా మనకు తెలుసు. చిన్ని సాయాలకు పెద్ద ప్రచారాలు కోరుకున్న వాళ్లనూ మనం చూశాం. కానీ సోనూ సూద్ విషయం వేరు.
చేసిన సాయం ఎంతెంత పెద్దవైనా.. ఏనాడూ కించిత్ ప్రచారాన్ని ఆశించిన వ్యక్తి కాదు. చిన్న ప్రెస్ మీట్ లేదు. మీడియాకు తాను ఏం చేశాడో చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రవచించిన నిష్కామకర్మకు నిలువెత్తురూపంలా సోనూసూద్ కనిపించాడు.
నాణేనికి రెండోవైపున- ఎలాంటి ఔద్ధత్యం లేని అతని ప్రవర్తన! వలసకూలీలకు బస్సులు, రైళ్లు ఏర్పాటుచేసినప్పుడు కూడా.. వారిని సాగనంపడానికి అక్కడకు వచ్చిన సందర్భాల్లోనూ.. ఎలాంటి స్వాతిశయం లేకుండా, వినయంగా ఉండడం సోనూ కే చెల్లింది.
ఎక్కడిది ఈ సాయం, సాయగుణం?
ప్రపంచంలో ప్రతి మతమూ.. పేదలకు అండగా ఉండమనే నీతిని చెబుతుంది. మానవ సేవే మాధవసేవ అని.. దేవుడికి సమర్పించుకోవడం కంటె అవసరంలో ఉన్నవాడికి చేయూత ఇవ్వమని హిందూత్వం అంటుంది. ఆదాయంలో కొంత భాగాన్ని తన చుట్టూ ఉన్న పేదలకోసం ఖర్చుచేసి.. ఆదాయాన్ని శుద్ధి చేసుకోవాలనేది మహ్మద్ ప్రవక్త చెప్పిన జీవనసూత్రం! ఆదాయంలో కొంత- కాదు, ఆదాయాన్ని మించి.. కోట్లకు కోట్ల రూపాయల సాయం సోనూసూద్ అనే రూపంలో దేశప్రజలకు అందింది.
ఇప్పటిదాకా మహా అయితే యాభై చిత్రాలు చేసిన ఒక నటుడు.. ఇంతింత భారీ సహాయాలు ఎలా చేయగలిగాడు.. అంత వనరులు ఎక్కడివి అనే సందేహం కూడా చాలా మందికి ఉంది. అయితే ముందే అనుకున్నట్టు సోనూసూద్ సంకల్ప శుద్ధి గొప్పది. అందుకే అతని సంకల్పానికి ఆప్తులు, హితుల నుంచి కూడా మద్దతు లభించింది. పైగా సోనూసూద్ కేవలం సినిమాల్లో నటించడమే జీవనాధారంగా బతుకు వెళ్లదీస్తున్న వ్యక్తి కాదు. అతనికి గార్మెంట్స్ వంటి కొన్ని వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది.
సంపద ఉండడం వేరు.. వితరణ శీలత జీవలక్షణంగా ఉండడం వేరు. అలాంటి ధన్యజీవి సోనూ సూద్. ఈ కొవిడ్ సీజన్ ముగిసే సరికి.. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవారికైనా సరే.. ఆర్తిలో ఉన్నవారికి, దీనులకు మెసయ్యగా అవతరించాడు. ‘బ్రూస్ ఆల్మైటీ’ చిత్రంలో దేవుడికి ప్రజలందరూ తమ తమ విన్నపాలను ఈమెయిల్ పెట్టుకున్నట్టుగా.. దేశంలో ఉన్న అనేకులు, వేల సంఖ్యలో.. తమ తమ కష్టాలు తీర్చడానికి సోనూ కు మెయిళ్లు, ట్వీట్ల ద్వారా విన్నవించుకున్నారు. భగవంతుడి అవతారంగా సోనూ సూద్ ను పరిగణించి.. దేవుడి పటాల మధ్యలో అతని ఫోటోను పెట్టుకుని పూజించిన వారున్నారు. సేవాతత్పరతలో సోనూ సూద్ ప్రదర్శించినట్లుగానే భక్తిలో, ప్రేమలో ఎవరి అతిశయం వారిది.
కానీ ఒక్క విషయం మాత్రం నిజం.
ఒక వ్యక్తి.. అత్యంత సాధారణంగా కనిపించే, ప్రవర్తించే ఒక వ్యక్తి. ఒక సంస్థకు, వ్యవస్థకు సాధ్యం కానీ స్థాయిలో సేవ చేయడం అనేది అద్భుతం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో.. లక్షలు, కోట్ల మంది ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, ఏర్పడిన ప్రభుత్వాలు వారికి కనిపించలేదు. చాలా మందికి సోనూసూద్ ఒక్కడే దిక్కయ్యాడు.
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ
సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।
మయ్యర్పితమనోబుద్ధిర్యో మధ్భక్తః స మే ప్రియాః
‘‘ద్వేషం అనేది తెలియకుండా, అందరి పట్ల స్నేహభావంతో, దయతో ఉండేవాడు.. విషయ లాలసత సంపదల పట్ల మమకారం లేకుండా, అహంకారం లేకుండా, క్షమాగుణంతో ఉంటూ సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు.. నిత్యం తృప్తిగా, భక్తిగా, నిగ్రహంగా.. నాలో మనసు లగ్నం చేస్తారో.. వారే నాకు అత్యంత ఇష్టులు’’ అంటాడు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో.
పరమాత్ముడు ప్రవచించిన అలాంటి లక్షణాలు మూర్తీభవించిన సోనూసూద్ వంటి ఇష్టులు.. సేవాగరిష్టులు.. భగవంతుడికి కొద్దిమందే దొరుకుతారు.
.. సురేష్ పిళ్లె