బెజవాడ దుర్గగుడి వంతెన పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరతాయని అందరూ భావించారు. కానీ దుర్గగుడి వంతెన వల్లే ట్రాఫిక్ కష్టాలు మరింత పెరిగాయి. రూ.500 కోట్లతో దుర్గగుడి ఫ్లైఓవర్ ను ఆరు వరుసలుగా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే అప్రోచ్ రోడ్డు నిర్మించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. దాదాపు రెండు కిలోమీటర్ల పొడువు, ఆరు వరుసల పై వంతెన నిర్మాణానికి విజయవాడ వాసులు పెద్ద ఉద్యమాలే చేయాల్సి వచ్చింది. ఎంపీ కేశినేని నాని చొరవతో కేంద్రం నిధులు విడుదల చేసింది. ఎట్టకేలకు దుర్గగుడి పైవంతెన నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు. బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తగ్గుతాయని అందరూ భావించారు. అయితే ట్రాఫిక్ కష్టాలకు దుర్గగుడి పైవంతెనే కారణం అవుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు.
25 కోట్లు ఇవ్వలేరా?
రూ.500 కోట్లు ఖర్చుపెట్టి దుర్గగుడి వంతెన నిర్మించి రెండు వైపులా అప్రోచ్ రోడ్డు విస్తరణ మాత్రం గాలికొదిలేశారు. కుమ్మరిపాలెం వైపు దుర్గగుడి పైవంతెన అప్రోచ్ రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో ఇక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనికితోడు వంతెన ఆరువరుసల్లో ఉండటం, రోడ్డు ఇరుగ్గా తయారుకావడంతో అక్కడ ప్రమాదాలు చోటు చేసుకంటున్నాయి. ఇక నెహ్రూ బస్టాండ్ వైపు కూడా అప్రోచ్ రోడ్డు విస్తరణ చేపట్టలేదు. అప్రోచ్ రోడ్డు విస్తరణకు భూసేకరణ చేయాల్సి ఉంది. అందుకుగాను రూ.25 కోట్లు ఖర్చవుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వానికి ఫైల్ పంపించారు.
అయితే ఆ ఫైల్ ను పక్కన పడేశారని తెలుస్తోంది. వందల కోట్లు ఖర్చుచేసి, రూ.25 కోట్లు దగ్గర రాజీ పడితే పైవంతెన మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇరుకైన అప్రోచ్ రోడ్డు వల్ల పైవంతెనపై భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి. ఒక్కసారిగా వంతెనపై ఆరువరుసల్లో వాహనాలు నిలిచిపోతే వంతెన మనుగడకు కూడా ప్రమాదమని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు.
ఎందుకీ నిర్లక్ష్యం
వంతెన పనులతోపాటే అప్రోచ్ రోడ్డు విస్తరణ కూడా పూర్తి చేస్తే కొంతమేర కేంద్రం భరించేంది. అయితే హడావుడిగా వంతెన ప్రారంభించారనే విమర్శలు వస్తున్నాయి. ఇటు విజయవాడ నగరాభివృద్ధి సంస్థ కూడా నిధులు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు కార్పొరేషన్ రూ.25 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ట్రాఫిక్ కష్టాలను ఒకచోటు నుంచి మరో చోటుకి మార్చినట్టయిందని స్థానికులు విమర్శిస్తున్నారు.











