దాదాపు పద్నాలుగేళ్ళక్రితం.. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ…. ఇప్పటికీ సౌత్ లో నెం. 1 హీరోయిన్ గా చెలామణి అవుతోంది. అయితే అమ్మడు మిగతా వారితో పోల్చితే అంతగా.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించలేదు. పుష్కరానికి పైగానే హీరోయిన్ వేషాలు వేశాకా.. రెండేళ్ళ క్రితం ‘సీత’ అనే సినిమాలో నటించగలిగింది. కానీ ఆ సినిమా ఆశించిన రీతిలో అలరించకపోవడంతో ఆమె మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ జోలికి పోదు అనుకున్నారు.
ఐతే ఇటీవల కాజల్ .. లైవ్ టెలీకాస్ట్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ కాజల్ మరో మహిళా ప్రాధాన్యం కలిగిన సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. లైవ్ టెలీకాస్ట్ తరహాలోనే ఇది కూడా హారర్ జానర్ లో రూపొందనుందట. సంతోష్ శోభన్ తో పేపర్ బాయ్ తెరకెక్కించిన దర్శకుడు జయశంకర్ దీనికి దర్శకుడు. ఇతగాడు ఇంతకు ముందు ‘విటమిన్ షీ’ అనే వెరైటీ మూవీ తీశాడు. ఓటీటీలో స్ట్రీమ్ అయిన దీనికి మంచి పేరొచ్చింది. దీని తర్వాత కాజల్ కు ఓ హారర్ స్టోరీ చెప్పి కమిట్ మెంట్ తీసుకున్నాడట.
లాక్ డౌన్ తర్వాత కాజల్ చేయబోయే హారర్ మూవీ సెట్స్ మీదకు వెళ్ళబోతోందని తెలుస్తోంది. కాజల్ పుట్టిన రోజైన జూన్ 19న ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుందట. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, కమల్ ఇండియన్ 2 లోనూ నటిస్తోన్న కాజల్ .. నాగార్జున, ప్రవీణ్ సత్తారు మూవీలో కూడా నటించబోతోంది. అలాగే మరికొన్ని సినిమాలకు కాజల్ సైన్ చేసింది. మొత్తం మీద పెళ్లయ్యాకా కాజల్ కెరీర్ ఊపు మీదుండడం విశేషం. మరి చందమామ .. ఏ రేంజ్ లో ఈ సినిమాతో భయపెడుతుందో చూడాలి.