దుబాయి వేదికగా జరిగిన మూడవ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఓ మాదిరి లక్ష్యాన్ని కూడా ఛేదించడంలో తడబడిన హైదరాబాద్ టోర్నీని ఓటమితో స్టార్ట్ చేసింది. స్టార్ ఆటగాడు విలియమ్సన్ ను పక్కనపెట్టి ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ను జట్టులోకి తీసుకోవడం హైదరాబాద్ విజయావకాశాలను గట్టిదెబ్బ కొట్టింది. బౌలింగ్ రనప్ లో మడిమకు గాయం కావడంతో కేవలం 4 బాల్స్ మాత్రమే బౌలింగ్ వేయగలిగాడు. గాయం కావడం దురదృష్టవశాత్తు జరిగినా విలియమ్సన్ లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ బలహీన పడింది.
విదేశీ ప్లేయర్లను నలుగురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ లో వార్నర్, బెయిర్ స్టో, రషీద్ ఖాన్, మిచెల్ మార్ష్ లను తీసుకున్నారు. వార్నర్, బెయిర్ స్టోలు ఓపెనర్లుగా రావడంతో మనీష్ పాండే, విజయ్ శంకర్, గార్గ్, అభిషేక్ శర్మలు మిడిల్ ఆర్డర్ లో ఆడారు. వార్నర్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా బెయిర్ స్టో ఒంటరిపోరు చేయవలసి వచ్చింది. మనీష్ పాండే పర్వాలేదనిపించినా మిగిలిన ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. 15 ఓవర్లలలోనే హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. ఈ దశలో హైదరాబాద్ విజేతగా నిలుస్తుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు.
61 పరుగులు చేసి బెయిర్ స్టో అవుట్ కావడంతో అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ 153 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా మాజీ ఆటగాడు విజయ్ శంకర్ బాధ్యతారాహిత్యమైన షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. ఇదే సమయంలో ఒత్తిడి తట్టుకోలేని గార్గ్, అభినవ్ శర్మ రాణించలేకపోయారు. టాప్ ఆర్డర్ రాణించనప్పుడు టెయిల్ ఎండర్స్ పై నమ్మకం పెట్టుకోవడం మన తప్పు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సత్తా చాటడంలో విఫలమైన హైదరాబాద్ విఫలమైంది. హైదరాబాద్ తదుపరి మ్యాచ్ కైనా తమ జట్టు ఎంపికలో లోపాలు సరిద్దుకోకపోతే ఈ సీజన్ పై ఆశలు వదులుకోవలసిందే. భువనేశ్వర్, రషీద్ ఖాన్ లాంటి స్ట్రైక్ బౌలర్లు తప్పా ఒక్కరంటే ఒక్కరు ఛేజ్ బౌలర్ లేకపోవడంపై క్రీడా వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ లోపాలు సరిద్దుకోకపోతే సన్ ‘షట్’ కావడం ఖాయమంటూ హైదరాబాద్ అభిమానులు కూడా వాపోతున్నారు.











