అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అనే పేరు మీద మూడు రాజధానులు ఏర్పాటు చేయనబోతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ వాటాల్లో భాగంగా రాయలసీమ ప్రాంతానికి న్యాయరాజధాన్ని కర్నూలులో చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టు ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు. కానీ తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాన్ని గమనిస్తే.. రాయలసీమకు హైకోర్టు రావడం అంత ఈజీ కాదని.. అది పూర్తిగా జగన్ చేతుల్లో ఉన్న వ్యవహారం కానే కాదని కూడా అర్థమవుతోంది.
ఉత్తరప్రదేశ్ తో పాటు దేశంలో మరెక్కడైనా హైకోర్ట్ బెంచ్ లు ఏర్పాటుచేసే ఉద్దేశం ఉందా అని.. ఆ రాష్ట్ర ఎంపీ రాజేంద్ర అగర్వాల్ సోమవారం నాడు లోక్ సభలో అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సుదీర్ఘమైన ఇచ్చారు.
మంత్రి చెప్పిన సమాచారం ప్రకారం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలతో పాటు వాటికి గవర్నర్, రాష్ట్ర చీఫ్ జస్టిస్ అనుమతి కూడా తప్పనిసరి. హైకోర్టుకు మౌలిక వసతుల కల్పన, ఇతర వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వం చూసినప్పటికీ.. అడ్మినిస్ట్రేషన్ పరంగా బాధ్యత మొత్తం హైకోర్టు చీఫ్ జస్టిస్ దే కాబట్టి.. ఆయన అనుమతి కూడా తప్పనిసరి అని న్యాయశాఖ మంత్రి ప్రకటించారు.
ఇప్పటిదాకా దేశంలో ఏ రాష్ట్రం నుంచి కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం పూర్తిస్థాయి ప్రతిపాదనలు రాలేదని న్యాయశాఖ మంత్రి వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు 2019 జనవరి 1వ తేదీ నుంచి అమరావతి కేంద్రంగా పనిచేస్తోంది. అలాగే దేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉండగా, ఎనిమిదింటికి మాత్రమే ఒకటి కంటే ఎక్కువ బెంచ్ ఉన్నాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే
ఇక్కడ న్యాయ రాజధాని కర్నూలు ఏర్పాటు చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. మూడు రాజధానులు ఏర్పాటు ప్రక్రియలో భాగం. దీనికి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయం హై కోర్టు విచారణలో ఉంది. ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు విచారణ నుంచి విముక్తి లభించిన తర్వాత గానీ.. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను పరిశీలించే అవకాశం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ చేయాల్సి ఉంటుంది. మంత్రిమండలి తీర్మానం చేసి పంపితే, గవర్నర్ సంతకం చేయడం కష్టం కాకపోవచ్చు. కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అనుభవించాల్సిందే అనే నిబంధన ఉంటే గనుక.. అది అంత ఈజీ కాకపోవచ్చు.
గతంలోనూ ఏపీ హైకోర్టు హైదరాబాదులో ఉన్న సందర్భంలో.. చంద్రబాబు నాయుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అనుమతితోనే, అమరావతిలో సిద్ధమైన భవనాలను వారికి చూపించిన తర్వాతనే అక్కడ హైకోర్టు ఏర్పాటు అయింది. రెండేళ్లు గడవకుండానే.. హైకోర్టును మళ్లీ కర్నూలుకు మారుస్తాం అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంకల్పిస్తే గనుక, అందుకు బలమయిన కారణాలు హైకోర్టు చీఫ్ జస్టిస్ కు నివేదించాల్సి ఉంటుంది. ఆ కారణాలు ఆయన ఆమోదం కూడా అవసరం.
జగన్మోహన్ రెడ్డి చిన్న పొరపాటు చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తాను అని చెప్పి ఉంటే వ్యవహారం చాలా సింపుల్ గా తేలిపోయి ఉండేది. ప్రజల అవసరాల దృష్ట్యా అవసరం అని ఆయన సమర్థించుకోవచ్చు. కానీ.. ఆయన కాస్త అతిశయానికి పోయి.. మూడు ప్రాంతాలు మూడు రాజధానులు అని ప్రకటించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని అని, అమరావతిని శాసన రాజధాని అని, కర్నూలు న్యాయరాజధాని అని అన్నారు. అలా అన్న పాపానికి.. కర్నూలులో ఏర్పాటు అయ్యే హైకోర్టు బెంచ్ అనేది చీఫ్ జస్టిస్ తో కూడి ఉంటుందని కూడా జగన్ తనకు తాను హామీ ఇచ్చేశారు. చీఫ్ జస్టిస్ లేకుండా హైకోర్టు ఏర్పాటు అయితే.. అది హైకోర్టు బెంచ్ అవుతుందే తప్ప.. కర్నూలు న్యాయరాజధాని అని అనడానికి వీలుండదు.
కేవలం ప్రజల అవసరాల కోసమే అనేట్లయితే గనుక.. చీఫ్ జస్టిస్ అక్కడ లేకపోతే మాత్రం ఏమిటి? ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మాత్రం అంగీకరిస్తాం అనే వాదన.. వస్తే గనుక.. దానికి జగన్ ప్రభుత్వం వద్ద సమాధానం ఉందో లేదో తెలియదు. నేను మాట ఇచ్చాను గనుక.. చీఫ్ జస్టిస్ తట్టా బుట్టా సర్దుకుని అమరావతి నుంచి కర్నూలుకు వెళ్లాలి అని జగన్ ఏ రకంగా శాసించగలరు? ఇదంతా చాలా చిక్కు ప్రశ్న అవుతుంది.
ఈ చిక్కుముడి ప్రశ్నలను పరిశీలించినప్పుడు ఏపీ ప్రభుత్వం ఏ రకంగా చీఫ్ జస్టిస్ ఒప్పుకోలును సాధిస్తుంది? అనేది కీలకం. ప్రభుత్వం- గవర్నర్ రెండు వ్యవస్థలూ సంకల్పించినంత మాత్రాన కార్యం నెరవేరదు. చీఫ్ జస్టిస్ కూడా ఒప్పుకోవాల్సిందే అన్నప్పుడు.. అది అంత ఈజీగా కుదురుతుందా? ఆ వైపు నుంచి బ్రేకులు పడవచ్చు. అదే జరిగితే గనుక.. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తాను తలచిందే తడవుగా.. పరిపాలన రాజధానిని సమస్తంగా.. అమరావతి నుంచి తరలించుకుపోయి విశాఖలో పెట్టుకోగలరేమో గానీ.. హైకోర్టును కర్నూలుకు పంపలేరు. ఆ రకంగా.. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ కేపిటల్ లుగా విశాఖ, అమరావతి ప్రాంతాలు ఉంటాయి. లీగల్ కేపిటల్ అనే పదాన్ని నమ్ముకున్న రాయలసీమకు, కర్నూలు నగరానికి అన్యాయం జరుగుతుంది. చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టును తరలించడం అనేది, పూర్తిగా జగన్ అధికారం పరిధిలో లేనప్పుడు.. అమల్లోకి రావడం దైవాధీనంగానే ఉంటుంది. రాయలసీమకు ఎదురుచూపులు తప్ప ఇంకేమీ మిగలకపోవచ్చు.
..సురేష్ పిళ్లె











