తమిళనాడు చిన్నమ్మ సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించింది. దీని వెనక కమలదళం ఉందని వేరే చెప్పనక్కర్లేదు. జయలలితతో ఉన్నప్పుడు ఎంత అనుభవించిందో తెలియదు గాని.. పాపం ఫ్రెండ్ చనిపోయిన దగ్గర నుంచి అన్నీ కష్టాలే శశికళకు. అంతా రెడీ అయి.. ఇక ప్రమాణస్వీకారమే అన్న టైములో.. బీజేపీ తెలివిగా జైలుకు పంపించేసింది. ఇప్పుడు కమలనాథులు చెప్పినట్లు వింటున్న చిన్నమ్మ.. అప్పుడు కూడా వినుంటే బహుశా సీఎం అయి ఉండేదేమో. కాని టైమ్ బ్యాడ్.. అంతే.. అప్పుడు బ్యాడ్ టైములో బ్రెయిన్ బ్యాడ్‌గానే పని చేస్తుంది. శశికళ అలా జైలుకెళ్లగానే పన్నీరు సెల్వం తర్వాత పళనిస్వామి ద్రోహం చేయడమే కాక.. ఒకరికొకరు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. సౌండ్ పార్టీ అయిన పళనిస్వామి పంతమే నెగ్గింది.
అన్నాడీఎంకే అధికారం పేరుకే..
అప్పటి నుంచి అన్నాడీఎంకే అధికారం పేరుకే.. అంతా బీజేపీయే పై నుంచి చక్రం తిప్పుతూ ఉంది. కింద అన్నాడీఎంకే సీఎం నుంచి మంత్రుల వరకు సంపాదించుకోవడానికి మాత్రం ఫ్రీడమ్ ఇచ్చినట్లుంది. రజనీకాంత్‌ను దించినట్లే దించి వెనక్కి పంపేసిన బీజేపీ.. ఏ కారణంతో ఆ పని చేసిందో .. ఇప్పుడు అదే కారణంతో శశికళను రిటైర్మెంట్ చేయించేసింది. అదేంటంటే డీఎంకె బలం. డీఎంకె బలం రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. వాస్తవానికి అన్నాడీఎంకె అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంగా ఉన్న డీఎంకెనే అత్యంత బలంగా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటింది.
డీఎంకెకే లాభం జరుగుతుందనే..
ఇప్పుడు రజనీకాంత్ పార్టీ పెట్టి పోటీ చేసినా.. అన్నాడీఎంకె శశికళ, పళని స్వామి వర్గాలుగా చీలి పోటీ చేసినా.. డీఎంకెకే లాభం జరుగుతుందనేది కమలనాథుల అంచనా. అందుకే శశికళను రాజీ చేసుకోవాలని .. కలిసిపోవాలని గట్టిగా ఒత్తిడి తెచ్చారు. చివరకు మధ్యేమార్గంగా శశికళ రాజకీయ రిటైర్మెంట్ను ప్రకటించింది. దాదాపు 45 స్థానాల్లో ప్రభావం చూపించే శశికళ అన్నాడీఎంకెను గెలిపించాలని పిలుపు ఇవ్వడంతో బీజేపి దాని నీడలో ఉన్న అన్నాడీఎంకే నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
చిన్నమ్మ రీఎంట్రీ ఇచ్చినా..
రేపు పరిస్ధితులు తిరగబడ్డాక.. సిట్యయేషన్ డిమాండ్స్ అంటూ చిన్నమ్మ రీఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇంత చేసినా.. డీఎంకెను ఓడించడం ఎవరి వల్ల కాదని అక్కడి పరిస్ధితి చూస్తుంటేనే అర్ధమైపోతుంది. స్టాలిన్ సీఎం కావడం ఖాయమే అనిపిస్తోంది. అదే జరిగితే.. బీజేపీ నీడలో ఏదో అలా గోడలా ఉన్న అన్నాడీఎంకె మరుక్షణమే ఇటుక పెళ్లల్లా చీలిపోతుంది. అప్పుడు పళనిస్వామి, పన్నీరు సెల్వం అందరూ సైలెంట్ అయిపోతారు. ఆ టైమ్‌లో శశికళ తానే దిక్కన్నట్లు చెప్పుకుని ఎంట్రీ ఇచ్చేసి.. ప్రతిపక్ష నాయకురాలి పాత్ర పోషిస్తుందనేది ఒక అంచనా.
ఏమైనా ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరి దక్షిణాదిన బీజేపీ ఎత్తులు పారటం లేదు. అమిత్ షా ఎంత మంత్రగాడు, తంత్రగాడు అయినా.. సౌత్‌లో మాత్రం చెల్లని నాణెమే. ఎన్ని ఈక్వేషన్లు మార్చినా.. ఎన్నిసార్లు లెక్కలేసుకున్నా సీఎం అయ్యేది స్టాలినే అని సర్వేలు చెబుతున్నాయి.