సుబ్రమణియన్ స్వామి ఆది నుంచి వివాదాలతోనే సావాసం చేస్తుంటారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా గాంధీ కుటుంబాన్ని ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో కోర్ట్ కు ఈడ్చిన ఘనత ఆయనది. ప్రభుత్వ విధానాలనే తప్పుబట్టి కేంద్ర మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. తాజాగా కేంద్రం తీసుకున్న రెండు నిర్ణయాలను ఆయన తప్పు పట్టారు. కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో జేఈఈ-నీట్ జరపాలంటూ కేంద్రం తీసుకున్న వైఖరి సరికాదంటూ విమర్శించారు.
కరోనా లాంటి కష్టకాలంలో పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామి చేసిన కామెంట్స్ విపక్షాలకు ఊతమిచ్చాయి. ఇదే సమయంలో ‘గల్వాన్’ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలపై సుబ్రమణియన్ స్వామి చేస్తున్న వరుస విమర్శలతో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
దీంతో గత కొన్ని రోజులుగా స్వామిపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. తనపై జరుగుతున్న నెగటివ్ ప్రచారంతో ఆయన బీజేపీ ఐటీ సెల్ పై నిప్పులు చెరిగారు. బీజేపీ ఐటీ సెల్ లో వెధవలు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా అందుకు బాధ్యుడు అంటూ విమర్శలు చేశారు. ఫేక్ అకౌంట్ లు క్రియేట్ చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎంపీపై తప్పుడు ప్రచారం చేయిస్తున్న వారిపై పార్టీ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ మర్యాద రామన్నలదే కానీ రాక్షసులది కాదని స్వామి ప్రశ్నించారు.
తనపై వెధవలు చేస్తున్న ప్రచారానికి బీజేపీ ఎలా బాధ్యత వహించడం లేదో తన అభిమానులు దాడికి దిగితే, దానికి కూడా తాను బాధ్యత వహించనని స్వామి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా ఆయన బీజేపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. తనకు పార్టీలో సరైన గౌరవాన్ని ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నారనే చర్చ బీజేపీ వర్గాలలో జరుగుతోంది. బీజేపీని ఇబ్బంది పెట్టే ఏ అవకాశం దొరికినా దానిని స్వామి వదులుకోవడం లేదు. ఇలాంటి చర్యలను సహించని మోడీ-షా-నడ్డా త్రయం ఈ అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..!