సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూశారు. హీరోగా, నిర్మాతగా రమేష్ బాబు సుపరిచితుడు. కృష్ణ నటవారసుడిగా బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రమేష్ బాబు ఆ తర్వాత హీరోగా ఎదిగారు. కానీ ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. కాలేయ వ్యాధితో కొంత కాలంగా బాధపడుతున్నారు. శనివారం రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రొ ఎంటరాలజీకి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే కన్నుమూసినట్టు సమాచారం.

కృష్ణకు ఇద్దరు కుమారులు. రమేష్ హీరోగా రంగ ప్రవేశం చేసినా నిలదొక్కుకోలేకపోయారు. ఆ తర్వాత మహేశ్ బాబు కృష్ణ నట వారసత్వాన్ని నిలబెట్టి సూపర్ స్టార్ గా ఎదిగారు. రమేశ్ విషయానికి వస్తే నటుడిగా 17 సినిమాలకే పరిమితమయ్యారు. సమ్రాట్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. సూర్యవంశం, అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు చిత్రాలు నిర్మించారు. రమేశ్ మరణ వార్తను తెలుగు చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. 1970 లో అగ్నిపరీక్ష చిత్రంలో బాల నటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు. అప్పుడు ఆయన వయసు 15 ఏళ్లు.
ఆ తర్వాత 1977లో మనుషులు చేసిన దొొంగలు చేశారు. ఆ సినిమాలో కృష్ణ హీరో. కృష్ణ చిన్నప్పటి పాత్రలను పోషించేవారు. మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు చిత్రాల్లోనూ బాలనటుడిగా గుర్తింపు పొందారు. నీడ, పాలు – నీళ్లు తర్వాత సమ్రాట్ తో హీరోగా రంగ ప్రవేశం చేశారు. చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, ముగ్గురు కొడుకులు, నా ఇల్లే నా స్వర్గం, మామా కోడలు, అన్నాచెల్లెలు, పచ్చతోరణం, ఎన్ కౌంటర్ తదితర చిత్రాల్లో హీరోగా నటించారు.
ఆయన వయసు 56 సంవత్సరాలు. కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు 1965 అక్టోబరు 13న జన్మించారు. 1986 ఆగస్టు 29న హీరోగా తొలి మేకప్ వేసుకుని షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడు జనవరి 8న కన్నుమూశారు. నాన్న పేరు నిలబెట్టాలన్న తపన రమేశ్ కు చిన్నప్పటి నుంచే ఉండేది. కానీ ఎందుకోగాని హీరోగా నిలదొక్కకోలేకపోయారు. రమేశ్ మరణ వార్త తెలియగానే పలువురు చిత్ర ప్రముఖులు తమ సంతాపాలను ప్రకటించారు. తండ్రి కళ్ల ముందే కుమారుడు మరణించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.











