సుఖేష్.. పేరు వింటే సుఖం అనుభవించడానికే ఈ మనిషి పుట్టాడేమో అనిపిస్తుంది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఉన్న సుఖేష్ తో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెట్టపట్టాలేసుకు తిరగడం పెద్ద చర్చనీయాంశమవుతోంది.
వీరిద్దరూ ముద్దుల్లో మునిగిపోతున్న ఫొటోలు నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా సుఖేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ ను ముద్దు పెట్టుకునే ఫొటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. పింక్ విల్లా వెబ్ సైట్ ఈ ఫొటోతో వార్తను కూడా ప్రచురించింది. అతను ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను జాక్వెలిన్ తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత ఆమెను ముద్దు పెట్టుకునే ఫొటో కూడా బయటికి వచ్చింది. వీరిద్దరి ఫొటోలు ఇంటర్నెట్ లో కనిపించడం ఇదే మొదటి సారి కాదు.
అనేక సార్లు ఇలాంటి ఫొటోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్యా ప్రేమ ఉందన్న విషయాన్ని ఈ ఫొటోలే ధ్రువీకరించాయి. అతని నుంచి ఆమెకు కోట్ల విలువైన బహుమతులు కూడా అందాయని వార్తలు వచ్చాయి. వాటిలో పర్షియన్ కారుతో పాటు దాదాపు 10 కోట్ల విలువైన బహుమతులు అందాయి. అతను తీహార్ జైలులో ఉన్నప్పుడు కూడా జాక్వెలిన్ ను సంప్రదించేవాడన్న సమాచారం ఉంది. అతని కేసు విషయంలో కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ను ప్రశ్నించింది.
ఎవరీ సుఖేష్.. ఏమా కథ?
అతను 17 ఏట వయసులోనే నేర సామ్రాజ్యంలో అడుగుపెట్టాడు. సినీ తారలతో చెట్టపట్టాలేసుకు తిరిగాడు. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. మనీలాండరింగ్ కేసులో జైలుకు చేరినా కేవలం ఫోన్ల సాయంతో ఏడాదికి రూ. 200 కోట్లు మోసపూరితంగా సంపాదించాడు. ఇతడి బాధితుల్లో అనేక మంది వీవీఐపీలే. అతని క్రిమినల్ బ్రెయిన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మోసాలు చేసిన డబ్బుతోనే సినీ తారలకు గాలం వేసేవాడు. ఎంతో విలాసవంతమైన జీవితం గడిపేవాడు. ఇంకా వెనక్కి వెళితే అతను బెంగళూరులోని ఓ రబ్బర్ కాంట్రాక్టర్ కుమారుడు. చదువు సంధ్యలన్నీ బిషప్ కాటన్ బాయ్స్ హైస్కూలులోనే. అక్కడితోనే చదువుకు ఫుల్ స్టాప్ పడిపోయింది.
17 ఏటనే మోసాలకు శ్రీకారం చుట్టాడు. బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీలో పనులు చేయిస్తానని చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. తాను కర్ణాటక సీఎం కుమార స్వామి మిత్రుడినని చెప్పుకుని మోసాలు చేసేవాడు. మోసాలు చేసి సంపాదించిన డబ్బుతో ఓ విలాసవంతమైన ఇల్లు, బీఎండబ్ల్యూ, నిస్సాన్, టొయోటా, అకార్డ్ లాంటి కార్లు, ఖరీదైన వాచ్ లు కొని పార్టీలు ఇచ్చేవాడు.
ఆఖరికి పోలీసు కమీషనర్ సంతకం కూడా ఫోర్జరీ చేశాడు. కొన్న కొత్త కార్లతో బెంగళూరు డ్రాగ్ రేస్ సర్క్యూట్ కు వెళ్లేవాడట. దాదాపు 15 ఏళ్ల క్రితమే అతని నేర చరిత్ర ప్రారంభమైంది. డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కుమారుడిగానూ చెప్పుకుని మోసాలు చేశాడు. ఇలా ఎంతో మంది రాజకీయ నాయకుల పేర్లను తను చేసే మోసాలకు వాడుకున్నాడు. తన పేర్లను కూడా తరచూ మార్చుకునేవాడు. కర్ణాటకే కాదు తమిళనాడులోనూ అతని చేతిలో ఎందరో మోసపోయారు.
హీరోయిన్లతో ప్రేమాయణాలు
డబ్బుంటే అమ్మాయిలు బుట్టలో పడటం ఎంతసేపు. కేరళ నటి లీనా మారియా పౌలును అలాగే మోసం చేశాడు. ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. తమిళ నిర్మాతనని ఆమెకు చెప్పుకున్నాడు. ఆమెతో సినిమా తీస్తానని బుట్టలో వేసేశాడు. చివరికి ఆమె కూడా అతనితో కలిసిపోయింది. ఇద్దరూ కలిసి కెనరా బ్యాంకును మోసం చేసి 12 కోట్లు నొక్కేశారు. కొచ్చిలోని ఓ వస్త్ర దుకాణానికి కత్రినా కైఫ్ ను తీసుకొస్తానని రూ. 20 లక్షలు వసూలు చేశాడు. ఇది 2012 నాటి మాట. జయలలిత మరణం తర్వాత చక్రం తిప్పడానికి ప్రయత్నించాడు.
ఆ పార్టీకి చెందిన రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులోనూ ఇరుక్కున్నాడు. ఆ గుర్తును టీటీవీ దినకరన్ కు ఇస్తానని రూ. 50 కోట్లకు అతనితో ఒప్పందం చేసుకున్నాడు. ఈ వ్యవహారం బయటపడటంతో ఇద్దరూ కటకటాల పాలవ్వాల్సి వచ్చింది. ఈ కేసులోనే తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలులో మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యూలర్లు ఉపయోగిస్తూ దందా సాగించాడు. లా సెక్రటరీ నని చెప్పుకుని ర్యాన్ బాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అదితికి ఫోన్ చేసి ఆమె భర్తకు భెయిల్ ఇప్పిస్తానని చెప్పి రూ. 200 కోట్లు వసూలు చేశాడు. ఈ విషయంలో జైలు స్టాఫ్ కు కూడా నెలకు కోటి రూపాయలు లంచం ఇచ్చినట్టు తేలింది.
జాక్వెలిన్ ఎలా పడింది?
కరోనా ఓ పక్క కరాళ నృత్యం చేస్తుంటే ఈ కరోడా మాత్రం తన పని తను కానిచ్చేశాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను టార్గెట్ చేశాడు. గత ఏడాది జనవరిలో ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆమె పెద్దగా స్పందించకపోవడంతో కేంద్ర మంత్రి ఆఫీస్ నుంచి వచ్చినట్టుగా పరిచయం చేసుకున్నాడు. సన్ టీవీ ఓనర్ శేఖర రత్నవేలుగా చెప్పాడు. జయలలిత కుటుంబం వ్యక్తిగా చెప్పడంతో ఆమె నమ్మేసింది. అలా ఆమెతో స్నేహం ఏర్పడింది. చివరికి గత ఏడాది జూన్ లో బెయిల్ పై జైలు నుంచి బయటికి వచ్చాడు. అతను జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక్క జాక్వెలిన్ మాత్రమే కాకుండా నోరా ఫతేహితో పాటు 12 మంది హీరోయిన్లు, మోడళ్లు వచ్చే వారట. అతని చరిత్ర చూస్తే మంచి కమర్షియల్ సినిమా తీయవచ్చని అనిపిస్తోంది కదూ.











