అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే ఏకైక డిమాండ్ తో ‘‘న్యాయస్థానం టూ దేవస్థానం’’ పేరిట చేపట్టిన మహా పాదయాత్రను తుళ్లూరు శివాలయం నుండి రైతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తుళ్లూరులో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మహా పాదయాత్రను 9 మంది ముత్తైదువలు ప్రారంభించారు. ఈ పాదయాత్ర తుళ్లూరు నుండి తిరుపతి వరకు 45 రోజుల పాటు, 400 కిలో మీటర్ల మేర కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి మహిళలు అగ్రభాగాన నడవగా. వేలాది యువకులు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి రాజధాని అమరావతి మద్దతుదారులు పాల్గొన్నారు. పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. 45 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర .డిసెంబర్ 15న తిరుపతికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు.
చంద్రబాబు, లోకేశ్ సంఘీభావం
రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. ఇది. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని తెలిపారు. అవమానాలెదురైనా ఆశయ సాధన కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. అమరావతి ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. మహాపాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రతీకారాలు, కూల్చివేతలపై జగన్ సర్కారుకు ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రకు నారా లోకేశ్ తన సంఘీభావం తెలిపారు. 685 రోజులనుండి ఎన్ని అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా ఉద్యమం చేస్తున్న యువకులకు, మహిళలకు, రైతులకు ఉద్యమాభివందనాలు తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతం అవ్వాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. శ్రీవారి దయతో పాలకుల ఆలోచనలో మార్పు వచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగేలా నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించారు.
రేణుకా చౌదరి మద్దతు
తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు రేణుకా చౌదరి అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొని రైతులకు తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఎన్ని ఆటంకాలు, అవమానాలు ఎదురైనా అమరావతి రైతులు, మహిళలు అమరావతి రాజధాని లక్షంగా కొనసాగిస్తున్న ఉద్యమం ఇది. ఇది ప్రజా ఉద్యమం. జగన్ అధికార మదం, అహంకారంతో అమరావతి రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి నుండి జగన్ ఏమి నేర్చుకోలేదు. అమరావతి మహిళ ఉద్యమకారులకు చేతికి ఉండేవి గాజులు కాదు, విష్ణు చక్రాలు. అమరావతి రైతుల ఉద్యమానికి ఉత్తర భారతదేశంలో సాగు నల్ల చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమ నాయకులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది అంతం కాదు, ఆరంభం’’ అని ఆమె హెచ్చరించారు.
సీపీఐ, జనసేన, బీజేపీ సంఘీభావం
అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రలో సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొని సంఘీభావం తెలిపారు. బీజేపీ నాయకుడు నాగ భూషణ్ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్ మాట తప్పను, మడమ తిప్పను అని మూడు రాజధానులు ప్రకటించి ప్రజలను, అమరావతి రైతులను మోసం చేశారన్నారు. పిచ్చి తుగ్లక్ వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాదయాత్రకు వేంకటేశ్వరుడి స్వామి ఆశీస్సులు తప్పక ఉంటాయన్నారు. జనసేన నాయకుడు రావెల కిషోర్ బాబు ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజధాని లేకపోవడం వల్లనే రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం కొరవడి అప్పులాంధ్రగా మారుతోందన్నారు. ఇప్పటికైనా పాలకులకు కనువిప్పు కలిగి అమరావతినే రాజధానిగా ప్రకటించాలని కోరారు.
Must Read ;- రావణ కాష్టంలా ఏపీ.. కారణమెవరు?