ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం మధ్యాహ్నానికి విడుదల అయిపోతాయి. దేశవ్యాప్తంగా చాలా నియోజకవర్గాలకే ఉప ఎన్నికలు జరిగినా.. వాటిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాకు చెందిన బద్వేల్ నియోజకవర్గం ఉన్నా.. అందరి దృష్టి మాత్రం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఫలితంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఆ పార్టీని ధిక్కరించి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నిక ఫలితం ఏకంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రానే మార్చేయనుందని కూడా చెప్పాలి. టీఆర్ఎస్ గెలిస్తే.. తెలంగాణలో మునుపటి మాదిరిగానే ముందస్తు ఎన్నికలే జరగనున్నాయి. అలా కాకుండా బీజేపీ గెలిస్తే మాత్రం తెలంగాణ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా టీఆర్ఎస్ అధికారానికి ముగింపు తప్పదని కూడా చెప్పక తప్పదు. ఈ కారణంగానే అన్నింటి కంటే కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పక తప్పదు.
సర్వేలన్నింటా కమలం గుభాళింపే
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన వెంటనే చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ పేరిట ఫలితాలను ముందే చెప్పేశాయి. ఈ తరహా ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలోనూ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌దే గెలుపు అని తేల్చి చెప్పేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కంటే కూడా భారీ మార్జిన్‌తో ఈటల గెలుస్తారని ఆయా సర్వేలు చెప్పేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమవ్వాలని ఏమీ లేదు కదా. జనం మూడ్ ను బట్టి కొన్ని సంస్థలు.. ఆయా పార్టీలు చెప్పినట్లుగా మరికొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెలువరిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎగ్జిట్ పోల్స్ నిజమే అయితే.. ఈటల శిబిరంలో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తుంది. దుబ్బాక మాదిరే హుజూరాబాద్‌నూ గెలిచేశామని, త్వరలో అసెంబ్లీ ఎన్నికలను కూడా గెలిచేస్తామని కమలనాథులు మరింత గట్టిగా చెప్పే అవకాశాలున్నాయి. ఈ పరిణామం టీఆర్ఎస్‌ను సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేసే ప్రమాదం కూడా లేకపోలేదు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలంటేనే భయపడేలా టీఆర్ఎస్ వ్యవహరించడం కూడా ఖాయమేనని చెప్పాలి.
వివేక్ కింగ్ మేకర్ అయ్యేనా?
ఎగ్జిట్ పోల్స్ నిజం కాకపోతే పరిస్థితి ఏమిటి? అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు జనం మూడ్ తో పాటు ఇటు ఎగ్జిట్ పోల్స్‌ను చూసిన కమలనాథులు అప్పుడే ఊహల్లో తేలిపోతున్నారు. బీజేపీ తెలంగాణ శాఖలో కీలక నేతగానే కాకుండా.. మంత్రిగా బర్తరఫ్ అయిన తర్వాత టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి చేర్పించడంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అయితే ఏకంగా ఈటల గెలిచేశారన్న రీతిలో సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నేరుగా ఈటల వద్దకు వెళ్లిన వివేక్.. ఈటలకు ఏకంగా గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు. ఈటల వెంట ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎగ్జిట్ పోల్స్ నిజమే అయితే.. ఈటల కేవలం ఎమ్మెల్యేగానే గెలుస్తారేమో గానీ.. అదే జరిగితే బీజేపీలో వివేక్ ఇమేజీ ఓ రేంజికి చేరుకుంటుంది. అలా కాకుండా ఈటల పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోతే.. ఎప్పటిమాదిరే వివేక్ కూడా అలా అలా రాజకీయం చేసుకుంటూ పోతారు.