ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. తన పార్టీకి చెందిన ఎంపీలను వెంటేసుకుని వెళ్లిన సాయిరెడ్డి.. ఈసీకి ఫిర్యాదు చేశారు గానీ.. టీడీపీ గుర్తింపును రద్దు చేయడానికి గల కారణాలేమిటన్న విషయాన్ని మాత్రం అంతగా ప్రస్తావించలేదు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. ఏపీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పరుష పదజాలాన్ని వినియోగించారని, ఆ మాత్రం కారణానికే టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని సాయిరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ టీడీపీ ఎంపీలు అదే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ గుర్తింపును రద్దు చేయడానికి గల కారణాలేమిటన్న విషయంపై టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప నేతృత్వంలోని ప్రతినిధి బృందం చాలా ఆధారాలనే ఈసీకి అందజేసింది. ఈ రెండు ఫిర్యాదులపైనా ఈసీ అంతగా దృష్టి సారించే అవకాశాలు లేకున్నా.. వైసీపీ చేసిన ఫిర్యాదు కంటే టీడీపీ చేసిన ఫిర్యాదుకు ఒకింత విలువ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపీ రద్దుకు కారణాలివే
ఏపీలో అధికార పార్టీగా కొనసాగుతున్న వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని విపక్ష టీడీపీ చేసిన ఫిర్యాదు రాజకీయ కోణంలో చూస్తే పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. అయితే ఈసీకి అందజేసిన ఫిర్యాదులో టీడీపీ ప్రస్తావించిన అంశాలను చూస్తే మాత్రం గుర్తింపు రద్దు కావడానికి వైసీపీ ముమ్మాటికీ అర్హురాలేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు వైసీపీ గుర్తింపును రద్దు చేయడానికి గల కారణాలంటూ టీడీపీ ఏఏ అంశాలను ప్రస్తావించిందన్న విషయానికి వస్తే.. ఏపీలో న్యాయమూర్తులపై.. ప్రత్యేకించి హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు స్వైర విహారం చేస్తున్నాయి. తాము చేసిందే కరెక్టు అన్నట్లుగా సాగుతున్న వైసీపీ.. తాను తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కోర్టు తప్పుబడితే మాత్రం సహించలేకపోతోంది. తన సోషల్ మీడియా యాక్టివిస్టులతో తిట్టిస్తోంది. ఇక పోలీసు వ్యవస్థను అయితే తమ పార్టీకి చెందిన సెక్యూరిటీ వింగ్ గా మార్చేసుకుంది. తప్పు చేసిన వైసీపీ నేతలపై కేసులు ఉండవు. తప్పు చేయకున్నా వైసీపీ టార్గెట్ చేసిన నేతలపై మాత్రం కేసులు నమోదు అయిపోతున్నాయి. గ్రామాల్లో ప్రజా సేవకుల పేరిట నియమించుకున్న వలంటీర్ వ్యవస్థను పార్టీకి ప్రచార విభాగంగా వినియోగిస్తోంది. లెక్కకు మించి సలహాదారులను నియమించుకుంటూ ప్రజా ధనాన్ని వృథా చేస్తోంది. ఇలా చాంతాడంత జాబితాను టీడీపీ ప్రతినిధి బృందం ఈసీకి అందించింది.