హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమవుతున్న వేళ.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హుజూరాబాద్ పరిధిలో టీఆర్ఎస్, బీజేపీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆయా పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌పై అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీలు విరుచుకుపడుతూ ఉంటే.. ఈ రెండు పార్టీలు కూడా గులాబీ దళంపై ఓ రేంజిలో విమర్శలు సంధిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25న నిర్వహించనున్న పార్టీ ప్లీనరీని ఉద్దేశించి మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌లను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను కలకలమే రేపనున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గోల్కొండ రిసార్ట్స్‌లో రహస్య భేటీ
హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఓ రహస్య భేటీ జరిగిందని, ఈ భేటీలో హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేదో గాలివాటంగా తాను చేస్తున్న విమర్శ కాదని, ఈ భేటీకి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలున్నాయని కూడా కేటీఆర్ తెలిపారు. ఈ భేటీ ద్వారా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ చీకటి ఒప్పందం ద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి మాత్రమే కాదని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని కూడా కేటీఆర్ సరికొత్త ఈక్వేషన్‌ను ఆపాదించారు. ఈ తరహా చీకటి ఒప్పందాలను హుజూరాబాద్ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తారని కూడా కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో గాడ్సేలు దూరారని మరింత ఘాటు కామెంట్ చేసిన కేటీఆర్.. టీ పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఖర్చు పెట్టి కొంటే.. అదే రూ.50 కోట్లను తీసుకుని మాణిక్యం ఠాకూర్ ఆ పదవిని రేవంత్‌కు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలా చెబితే అలా ఆడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పరిధి దాటి వ్యవహరిస్తోందని కేటీఆర్ మరో సంచలన వ్యాఖ్య చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై వీరేమంటారో?
అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా తులనాడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హుజూరాబాద్ ఉప ఎన్నిక హాట్ హాట్‌గా మార్చేశాయి. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చీకటి ఒప్పందం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీలను ఇరుకున పెట్టేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యల ప్రభావం బీజేపీపై కంటే కూడా కాంగ్రెస్‌పైనే అధికంగా పడనున్నాయన్న వాదనలూ లేకపోలేదు. ఎందుకంటే.. హుజూరాబాద్ బరిలో కొండా సురేఖ లాంటి బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతున్నామంటూ కలరింగ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. చివరాఖరుకు బల్మూరి వెంకట్ రూపంలో బలహీన అభ్యర్థిని రంగంలోకి దించింది కదా. బీజేపీకి సహకరించే ఉద్దేశ్యంతోనే ఈ తరహాలో కాంగ్రెస్ పార్టీ బలహీన అభ్యర్థిని బరిలోకి దించిందని ఇప్పటికే పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ కూడా సరిగ్గా అదే భావన వచ్చేలా ఇప్పుడు ఆరోపణలు గుప్పించడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడిపోయిందని చెప్పాలి. మరి కేటీఆర్ ఆరోపణలను అటు బీజేపీ గానీ, ఇటు కాంగ్రెస్ గానీ ఎలా తిప్పికొడతాయోనన్నది ఆసక్తికరంగా మారింది.