నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా చంద్రబాబు సర్కారు ఎంపిక చేసిన అమరావతి అంటేనే.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఎక్కడ లేని వ్యతిరేకత. అమరావతి మొత్తం చంద్రబాబు సామాజిక వర్గమే ఉందని, రైతులకు అతి తక్కువ మొత్తాలను చెల్లించి చంద్రబాబు సామాజిక వర్గం మొత్తం భూములను తమ చేతుల్లోకి తీసుకుందని జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు.. ఇటు హైకోర్టుతో పాటు అటు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ అక్షింతలు వేయించుకుంది. ఆపై ఇక అమరావతి గురించిన మాటే జగన్ మాట్లాడటం కూడా లేదు. ఇదే అదనుగా అమరావతి పరిధిలో రాజధాని కోసం చంద్రబాబు సర్కారు ఆహ్వానం మేరకు రైతులు అందించిన భూములపై వైసీపీ నేతలు వాలిపోయారన్న వాదనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
ఆరోపణలేంటంటే..?
అమరావతి పరిధిలో అత్యంత విలువ కలిగిన తుళ్లూరు పరిధికి చెందిన ఓ 50 ఎకరాలపై వైసీపీ నేతలు కన్నేశారట. తుళ్లూరు తహశీల్దార్‌ను తమ వైపునకు తిప్పేసుకుని ఆ 50 ఎకరాల భూములను తమ అనుచరుల పేరిట రాయించేసుకున్నారట. ఇలా భూములు ఆయా వ్యక్తుల పేరిట నమోదు అయిన వెంటనే.. ఆయా వివరాలు ఆన్‌లైన్‌లోనూ నమోదు అవుతాయి కదా. అలా ఆన్‌లైన్‌లో నమోదు అయితేనే కదా.. ఆయా భూములు వాటి యజమానులకు చెందినవిగా గుర్తిస్తారు. ఇదే తంతు మొత్తం ఇప్పటికే పూర్తి అయిపోయిందట. అమరావతి పరిధిలోని ఈ 50 ఎకరాల భూముల యజమానులుగా వైసీపీకి చెందిన కీలక నేతల అనుచరుల పేర్లు ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయట. ఈ వ్యవహారం ఆ నోటా, ఈ నోటా బయటపడటంతో వైసీపీ నేతలకు సహకరించిన తుళ్లూరు తహశీల్దార్ లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్లిపోయారట. ఈ మేరకు కొన్ని మీడియా ఛానెళ్లలో ప్రసారమవుతున్న ఈ వార్తలు ఏపీలో కలకలం రేపుతున్నాయి.
ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే..
ఈ భూ వివాదానికి సంబంధించి వైసీపీకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ కూడా మొదలైపోయిందట. ఈ భూములను దక్కించుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే ముందుగానే ప్లాన్ రచించగా.. తనకు తెలియకుండా ఇంత పెద్ద భాగోతాన్ని ఎలా నడుపుతారంటూ ఎంపీ ఫైరైపోయారట. వాస్తవానికి రాజధాని ప్రాంతానికి చెందిన సదరు ఎంపీ.. వైసీపీకి సంబంధించి రాజధాని అమరావతిపై ఏ మాట వినిపించినా.. ఆ ఎంపీనే స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆది నుంచి రాజధాని పరిధి తన ఆధీనంలో ఉందని, తనకు తెలియకుండా ఏకంగా 50 ఎకరాలు ఎలా లాగించేస్తారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అదే సమయంలో తనదీ రాజధాని పరిధేనని, తన నియోజకవర్గ పరిధిలోని వ్యవహారాల్లో ఎంపీ అయినంత మాత్రాన ఎలా తలదూరుస్తారంటూ సదరు ఎమ్మెల్యే కూడా ఎదురు తిరిగారట. ఇలా ఈ 50 ఎకరాల కైంకర్యానికి సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య రాజుకున్న వివాదం కారణంగానే ఈ భూ దందా బయటకు వచ్చిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. వైసీపీ సర్కారు వ్యతిరేకిస్తున్న రాజధాని అమరావతిలోని భూములను మాత్రం వైసీపీ నేతలు ఎలా ఆక్రమిస్తారన్న సెటైర్లు మాత్రం పడిపోతున్నాయి.
Must Read ;- అమరావతికి ప్రత్యామ్నాయం లేదబ్బా