సీపీఐ జాతీయ నేత నారాయణ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా నారాయణ ఏపీ సీఎం జగన్ బెయిల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కేసీఆర్, జగన్ నీళ్ల పంచాయితీ, రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల, రఘరామరాజు బెయిల్ పిటిషన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా ఉన్నంతకాలం..
త్వరలోనే జగన్ బెయిల్ రద్దవుతుంది? జగన్ జైలుకెళ్లడం ఖాయమే? అనే వార్తలు గతకొన్నిరోజులుగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే సీపీఐ నేత నారాయణ మాత్రం.. ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ బెయిల్ రద్దు కాదని జోస్యం చెప్పారు. జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ఓ డ్రామా అని, బెయిల్ రద్దయితే జగన్ కు ఏమవుతుందని నారాయణ ప్రశ్నించారు. జగన్ జైలుకు వెళ్లడం కొత్తేమీ కాదని, గతంలో జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. ఒకవేళ జగన్ బెయిల్ రద్దయితే.. జగన్ కు సానుభూతి పెరిగి, ఆయనకే లాభం చేకూరుతుందని ఆరోపించారు. అయినా అమిత్ షా అండదండలు ఉన్నంతకాలం .. జగన్ బెయిల్ ఎలా రద్దవుతుందని ప్రశ్నించారు. రఘురామ దేశద్రోహి అయితే.. అతనికి బీఫారం ఇచ్చిన జగన్ కూడా దేశద్రోహేనని, రఘురామరాజును జగన్ ఎందుకు బహిష్కరించడం లేదో తనకు అర్థం కావడం లేదని నారాయణ అన్నారు.
షర్మిల పార్టీకి కేసీఆర్ డైరెక్టర్
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలపై నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీకి జగన్ నిర్మాత అయితే.. కేసీఆర్ డైరెక్టర్ అని ఆరోపించారు. తెలంగాణలో ఓట్లు చీల్చేందుకే కేసీఆర్ మొదలుపెట్టిన డ్రామా అని, జగన్ సాయంతో ఈ తతంగం నడుస్తోందని అన్నారు. విజయవాడలో పొగొట్టుకున్న సూదిని షర్మిల హైదరాబాద్ లో వెతుక్కుంటోందని విమర్శించారు. ఇక నీళ్ల పంచాయితీ గురించి మాట్లాడుతూ.. జగన్-కేసీఆర్ ది గుద్దులాట-ముద్దులాట అని, వాళ్లది నిజమైన కొట్లాటే కాదని నారాయణ అన్నారు.
విశాఖ ఉక్కును వెంకయ్య కాపాడాల్సిందే..
సీపీఐ జాతీయ నేత నారాయణ తన ప్రసంగంలో భాగంగా విశాఖ ఉక్కు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో విశాఖ ఉక్కు పై పోరాడిన వెంకయ్య.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని నారాయణ ప్రశ్నించారు. వెంకయ్య ఒక్కమాట చెబితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని, అయినా ఆయన ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను వెంకయ్య కాపాడాల్సిందేనని, కాపాడలేకపోతే ఆయన ఉత్సవ విగ్రహమే అవుతారని నారాయణ విమర్శించారు.
Must Read ;- జగన్.. జలం.. జగడం











