బాలూ.. గాన కౌశలం గురించి మాట్లాడగల, కనీసం స్తుతించగల అర్హత నాకు లేదు. కానీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కేవలం ఒక గాయకుడు కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యశీలి, ప్రతిభామూర్తి. పాటలు వింటూ పరవశించిపోవడమూ, నటనను చూసి మైమరచిపోవడమూ, భాష మీద ఆయనకున్న ప్రేమను చూసి ఆరాధించడమూ ఇలాంటివి అనేకం మామూలుగా జరుగుతుంటాయి.
‘ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన.. అంతమాత్రమే నీవు..’ అంటూ భగవత్ తత్వాన్ని వేంకటేశ్వరునిలో చూసుకుంటూ అన్నమయ్య స్తుతించిన మాట నాకు చాలా ఇష్టమైనది. భగవంతుని సంగతి తర్వాత.. ప్రతి మనిషిలోనూ భగవంతుణ్ని చూడమంటుంది వేదాంతం. అంతటి పారమార్థిక చింతన నాకు లేదు గానీ.. ‘ఎంత మాత్రమున తలచితే.. అంత గ్రోలడానికి..’ ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత ఉంటుందనే విశ్వాసం నాకుంది. పెద్దా చిన్నలతో నిమిత్తం లేకుండా.. అనేక మందిని కలిసినప్పుడు, వారిలో అసూచ్యంగా ఉన్నా, కొన్ని విషయాలు మనల్ని పట్టుకుంటాయి. ఇలా కదా బతకాలి, ఇలా కదా మనల్ని మనం తీర్చుకోవాలి అనిపిస్తుంది. తీర్చుకోగలిగితే పరవశం కలుగుతుంది. బాలు విషయంలో కూడా అలాంటి ఒక అవకాశం నాకు వచ్చింది.
ఎస్పీ బాలును నేను ఒకేసారి చూశాను. కలిశాను. చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లాను. ఆ ఒక్క సంఘటన మాత్రం చెప్తాను. ఆయన గుణగణాల గురించి పెద్దలు చాలా మంది చాలా చెప్పారు. నేను అంత తాహతున్న వాడిని కాదు గనుక, నా స్వానుభవాన్ని మాత్రం నివేదిస్తాను.
==
వాసు అలియాస్ విజయభాస్కర్ అంటే మా మిత్రబృందానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటివాడు. ఇప్పుడు టీచరు. ఆయనకు వీరాభిమాని. ఆయన వాడికి దేవుడు. అంతగానూ ఆరాధిస్తాడు. జర్నలిస్టులంటే ఎంత పెద్దవాళ్లయినా సరే.. చిటికె వేస్తే పలుకుతారని భ్రమల్లో ఉండే అనేకమందిలో వీడూ ఒకడు. ‘ఓసారి బాలూ గారి దగ్గరకు తీసుకెళ్లు’ అంటుండేవాడు. నేను ఒకటిరెండు ప్రయత్నాలు చేశాను గానీ.. అప్పట్లో ఫలించలేదు.
ఈలోగా మా వాసూకు సుస్తీ చేసింది. రెండు కిడ్నీలు పని ఆపేశాయి. డయాలసిస్ ఒక్కటే ప్రాణాధారం అయింది. మనిషి శుష్కించిపోయాడు. మా బ్యాచ్ అందరిలో బొద్దుగా ఉండే వాడు కాస్తా.. శల్యావశిష్టుడిగా మిగిలాడు. ఆ సమయంలో కలిసినప్పుడు.. ‘‘ఓసారి బాలూ గారిని కలిపించు పిళ్లే.. ఒక్కసారి ఆయన కాళ్లు మొక్కి చచ్చిపోతా’’ అన్నాడు.
మళ్లీ ప్రయత్నించాను. వట్టికూటి చక్రవర్తిని అడిగితే.. బాలూ అభిమాన కోటిలో ఆయనకు ఆప్తుడైన షణ్ముఖాచారిని సంప్రదించాడు. ఆయన విషయం బాలూ దృష్టికి తీసుకెళ్లాడు. అదృష్ట వశాత్తూ ఆ సమయానికి బాలూ కార్యక్రమాలు, షూటింగుల మధ్య విరామంలో చెన్నై నివాసంలో ఉన్నారు.
‘‘అయ్యయ్యో.. ఆ పరిస్థితుల్లో ఆయన రావడం ఎందుకు? పెద్ద దూరం కాదు కదా.. నేనే శ్రీకాళహస్తి వెళ్లి ఆయనను కలుస్తాను’’ అన్నారట బాలూ. పరమానందం చెందాం. కానీ.. కార్యక్రమాల ఒత్తిడిలో ఆ తడవ తప్పితే.. ఇక ఎప్పటికో.. అనే శంక నిలవనీయలేదు. ‘‘వద్దొద్దు మేమే వెళ్తాం.. కాస్త సమయం ఇస్తే చాలు’’ అని అడిగాను. అలా 2019 మే 6 వ తేదీ సాయంత్రం 5.30కు రమ్మన్నారు. వాసూకు విషయం చెప్పి సిద్ధంగా ఉండమన్నాను. ఈలోగా నా ఏర్పాట్లు చేసుకున్నాను. శ్రీకాళహస్తీశ్వరుడు, తిరుమలేశుని ప్రసాదాలు, జ్ఞాపికలుగా ఆలయాల శాలువాలు తీసుకున్నాను. అంతా సిద్ధం చేసుకుని వాసు- రాజేశ్వరి దంపతులు, అన్నపూర్ణ, కిస్సులుతో కలిసి బయల్దేరాను. జాప్యం కాకూడదని జాగ్రత్త పడ్డాం గానీ, 4.30కే ఆయన ఇంటి వద్దకు చేరుకున్నాం. ప్రహరీ గేటు వద్ద ఉన్న కుర్రాడికి సంగతి చెబితే.. వెంటనే లోపలికి రమ్మని కబురొచ్చింది.
==
మేం లోపలికి వెళ్లేసరికి ఇద్దరు అతిథులున్నారు. బాలూ కూర్చునే వారితో తల పంకించారు. వాళ్లిద్దరూ లేచి, చేతులు జోడించి సెలవు తీసుకున్నారు. ఆయనకు దగ్గరగా వాసు దంపతులు, ఎదురుగా మేం కూర్చున్నాం. వాసుని ఆయన చాలా ప్రేమగా పలకరించారు. పరామర్శించారు. ఆరోగ్యం గురించి చాలా విపులంగా గుచ్చి గుచ్చి అడిగి వివరాలు తెలుసుకున్నారు. అప్పుడప్పుడూ వైద్య పరీక్షలకు మదరాసు కూడా వస్తుంటాడని విని, ‘‘ఈసారి వచ్చినప్పుడు హోటళ్లలో దిగొద్దు. మా ఇంట్లోనే ఉండు.. కావలిస్తే నీకు పూర్తిగా నయం అయ్యేవరకు మా ఇంట్లోనే ఉండు.. చికిత్స చేయించుకో..’’ అంటూ వాత్సల్యం చూపించారు. ‘‘నువ్వు అధైర్య పడొద్దు.. ఏం కాదు.. మనం అందరం ప్రార్థించే శ్రీకాళహస్తీశ్వరుడున్నాడు.. నీకు పూర్తిగా నయమౌతుంది.. నీకు పూర్తిగా నయమైన తర్వాత మళ్లీ నా దగ్గరకు రావాలి.. ఈసారి నువ్వు పరుగెత్తుకుని రావాలి..’’ అన్నారు. ఒక గాన గంధర్వుడికి, ఒక గానాభిలాషికి మధ్య.. నన్ను అంగుష్టమాత్రుడిగా మార్చేసిన, రసపుష్టి గల చర్చ సుదీర్ఘంగానే సాగింది. ఆ చర్చ నాకు సంబంధించింది కాదు గానీ, నేను ఎవరి సముఖంలో కూర్చుని ఉన్నానో, ఆ స్పృహతో, ఆ పారవశ్యంలోనే ఉండిపోయాను.
సుమారు అరగంట గడిచింది. ముక్తాయింపు మాటలు కూడా అయిపోయాయి.
మీకోసం ఇవి తెచ్చాం సార్ అంటూ లేచి నిల్చున్నాం. ఆయనకు శ్రీకాళహస్తీశుని శాలువా వాసు కప్పి ప్రసాదాలు అందజేశాడు. తిరుమలేశుని శాలువా నేను కప్పి, ప్రసాదాలు అందించాను. ఎంతో ప్రసిద్ధి అయిన శ్రీకాళహస్తి పాలకోవా కూడా ఇచ్చాను.. మురిసిపాటు దాచుకోని చిన్న నవ్వుతో.. ‘నాకు ఏమేం ఇష్టమో అన్నీ తెలుసుకుని తెచ్చారు మీరు’ అన్నారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగాం. తిరిగి యథాస్థానాల్లో కూర్చున్నాం. ఇక నిష్క్రమించడమే తరువాయి!
అప్పటిదాకా ఆయన ఎదురుగా నేనున్నానే తప్ప, ఆయన స్పృహలో లేను. ఎవరో తనను కలవడానికి వచ్చిన అభిమానికి తోడుగా వచ్చిన వ్యక్తిగానే భావించారు.
‘మీకు థాంక్స్ చెబుతూ ఒక లెటరు తెెచ్చాను సార్’ అంటూ రెండు పేజీల ఉత్తరం ఇచ్చాను. అందుకుని, ప్లాస్టిక్ ఫోల్డర్ పైనుంచే అందులోకి చూశారు. నాలుగు వాక్యాలు దాటిన తర్వాత.. ఫోల్డర్ మడత తెరిచి చదివారు.. రెండో పేజీలోకి వెళ్లారు. తిరిగి మొదటి పేజీలోకి వచ్చారు.. చదివారు. అంతా అయ్యాక దాన్ని చేతిలోనే పట్టుకుని.. నాతో మాట్లాడారు. ఆ సంభాషణ ఇలా సాగింది.
అభిమాన లేఖ : ‘అంతా అత్యుక్తులే’ అన్న బాలు!
‘ఏంచేస్తుంటారు మీరు’
‘జర్నలిస్టుని సార్’
‘అది కాదు.. ఇంకేం చేస్తుంటారు’
‘ఎపుడైనా కథలు, అవీ రాస్తుంటాను సార్’
‘అది కాదు. భాష మీద ఇంత పట్టు, అభినివేశం మీకెలా వచ్చింది?’
‘మా నాన్న కూడా జర్నలిస్టే సార్. నాకు అది తప్ప ఇంకేం తెలీదు’ (అన్నాను తప్పుచేసినట్టు!)
‘నాకు చాలా మంది జర్నలిస్టులు తెలుసు. వాళ్లకు ఎంత భాష వచ్చో కూడా తెలుసు. మీకిది ఎలా వచ్చింది’
‘పుస్తకాలు చదువుతుంటాను సార్’
‘ఆ.. అలా చెప్పు..’ అంటూ ఉపక్రమించారు. ఆయన మాటల్లోకి ఆవేదన వచ్చింది. సంభాషణ అంశం పూర్తిగా తెలుగు భాష మీదికి మళ్లిపోయింది. ఈరోజుల్లో ఎవ్వరికీ తెలుగు సరిగ్గా రాయడం లేదనే బాధ వ్యక్తమైంది. కొత్తతరం గీత రచయితలకు అక్షరాలు కూడా తెలియడం లేదన్నారు. తప్పులు రాసేస్తున్నారని, వాటిని సరిదిద్ది పాడితే సహించలేకపోతున్నారని కూడా అన్నారు. తెలుగు పాటల్లోనే భాష పరంగా ఎంత వక్రత చోటు చేసుకుంటున్నదో, ఎలా భ్రష్టుపట్టిపోతున్నదో.. అనేకానేక ఉదాహరణలు కలిపి సావకాశంగా తన బాధనంతా వెళ్ల గక్కారు. మధ్యలో హఠాత్తుగా పాట అందుకున్నారు..
‘‘సుమం ప్రతి సుమం సుమం..’’ అంటూ..!
ఎందుకు పాడుతున్నారో తెలియదు. పల్లవి అయింది. ఒకచరణం కూడా పాడారని గుర్తు. ఆపారు.
సన్నిధిలో అయిదుగురు శ్రోతలు, గానగంధర్వుడి గీతాలాపన. ఏదో యథాలాపంగా మాట ప్రస్తావించడానికి అన్నట్టుగా పాడలేదు. రికార్డింగులో పాడుతున్నట్టు, వేదికమీదనుంచి కచ్చేరీ చేస్తున్నట్టు పూర్తిగా పాటలో మమేకమై, తన్మయమై పాటే తానుగా అనుభూతితో పాడారు. సముఖంలో, ప్రత్యక్షంలో ఆ గానామృతాన్ని మేం మాత్రమే ఆస్వాదించి పులకించిపోయాం. పరవశించిపోయాం. ఆపారు!
‘ఇందులో తప్పెక్కడుంది చెప్పు’ అన్నారు హఠాత్తుగా. కంగారు పడ్డాను. ఏదో ఆయన చదువుకున్న ఊరినుంచి వచ్చాం కదా.. మాకోసం పాడారని అనుకున్నాను గానీ.. నాకు పరీక్ష పెట్టడం కోసం అని గ్రహించలేదు. చౌడేపల్లె పెద్దాయన నాయని కృష్ణమూర్తి రాసిన పాట అది. ఆయనకు సినీరంగంలో అదే తొలిపాట. తప్పెక్కడుందని చెప్పను?
‘భానోదయాన అనేది తప్పుసార్.. భానూదయాన అని ఉండాలి’ అన్నాను సంకోచంగా.
‘ఆ.. నువ్వొక్కడివి కరెక్టుగా చెప్పావ్.. ఇది ఇప్పటిదాకా ఎంతమందిని అడిగానో. ఇది సవర్ణ దీర్ఘ సంధి, రచయిత గుణ సంధి లాగా రాసేశారు. నాకూ ఆ తప్పు తెలీలేదు. అలాగే పాడేశాను. ప్రతి కచ్చేరీలోనూ అలాగే పాడేస్తుండేవాడిని. ఆ తర్వాత ఎప్పుడో సిరివెన్నెల చెప్పారు.. అది తప్పు అని సరి చేశారు. అసలు ఈ రోజుల్లో తప్పు వస్తే మాత్రం పట్టించుకునే వాళ్లెవరున్నారు.’ అంటూ భాష గురించి నాతో చర్చ కొనసాగించారు.
నా పేరు చూసి, శ్రీకాళహస్తి అని తెలిసి.. మా డ్రాయింగ్ మాస్టర్ తాత గురప్ప పిళ్లెని గుర్తు చేసుకున్నారు. ఆయన తనతో బుర్రకథలు చెప్పించి, నాటకాలు వేయించి తీర్చిన వైనం చెప్పారు. ఆయన కుటుంబం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఆ భేటీ ముగిసింది. సెలవు తీసుకున్నాం.
==
ఎస్పీ బాలసుబ్రమణ్యం, మేం బయల్దేరగానే.. లేచి నిల్చున్నారు. మాతో పాటు పోర్టికోలోకి వచ్చారు. అక్కడ మాతో ఓ పదినిమిషాలు నిల్చునే ముచ్చట పెట్టారు. ఈలోగా ఓ కుర్రాడిని పురమాయించి, ఆ ముందురోజు తిరునల్వేలి కచ్చేరీలో తనకు కానుకగా ఇచ్చిన ఒక పెద్ద పెయింటింగ్ ను తెప్పించి మా ఫ్రెండ్ వాసుకు కానుకగా ఇచ్చారు. ‘నేనంటే నీకు ఇష్టం కదా.. మీ ఇంట్లో ఉంచుకో’ అన్నారు. ఆ ముచ్చట్ల వ్యవధిలో వాసు నిల్చుకోలేడేమో అని భావించి.. తన కారు డోరు తనే తెరచి పట్టుకుని ‘నీకు ఇబ్బందిగా ఉంటే కార్లో కూర్చో’ అన్నారు. వాడు కూర్చోలేదు. ఈలోగా ముచ్చట్లు పూర్తయ్యాయి. మేం మళ్లీ నమస్కారం పెట్టి కదిలాం.. మాతో తనూ కదిలారు.
ఆయన ఇక లోనికి వెళ్తాడని మేం తలుపు దగ్గర ఆగాం. కానీ మాతో బయటకు రోడ్డు మీదకు వచ్చారు. మేం వెళ్లి కార్లో కూర్చుని.. కారు కదిలి.. ఆయన కనుమరుగయ్యే వరకు..
ఎస్పీ బాలసుబ్రమణ్యం- మాకు చేయెత్తి టాటా చెబుతూ రోడ్లోనే నిల్చుని ఉన్నారు.
అలా.. 15 నుంచి 30 నిమిషాలు ఉంటుందని అనుకున్న భేటీ, 1.40 గంటల పాటు సాగింది.
.. ఇదీ జరిగింది.
==
మేం చెన్నై నగరం దాటేలోగా మాకు బాలూ అపాయింట్మెంట్ ఇప్పించిన షణ్ముఖాచారి నుంచి ఫోనొచ్చింది. అప్పటికే బాలూ ఆయనకు ఓ వాయిస్ మెసేజీ పంపారు. మేం కలిసి వెళ్లిన సంగతి చెప్పారు. నేను ఇచ్చిన థాంక్స్ లెటర్ గురించి ప్రస్తావించారు. అందులో బాలు గురించి నేను రాసినవన్నీ అత్యుక్తులు, అతిశయోక్తులు అని పేర్కొన్నారు. వాటికోసం కాకుండా.. అందులో ఉన్న అక్షరప్రజ్ఞ గురించి పటిమ గురించి దాన్ని చదవాలని ఆయనతో చెప్పారు.
నాకున్న లేశమాత్రమైన అక్షర ఆసక్తికి ఆయన మాట ఓ పురస్కారం. ఆయన స్వరంలో నాగురించి చెప్పిన మాటలు.. నా బతుకుకు అతి పెద్ద కితాబులు. అలా ధన్యత పొందాను.
ఎస్పీ బాలసుబ్రమణ్యం స్పందన :
==
ఆయన మరణవార్త విన్నాక.
లక్షల మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఘనతలను అద్భుతంగా కీర్తించారు.
కొందరు నిందలు వేశారు. ఆయన బ్రాహ్మణ్యాన్ని ప్రస్తావించారు. ఇజంను జత చేశారు. తొక్కేశాడని అన్నారు. జేసుదాస్ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్న వ్యక్తికి కులం, అహంకారం, అభిజాత్యం పులిమిన వాళ్లు ఎలాంటి ఆనందాన్ని పొంది ఉంటారు? ఈ ప్రశ్న ఎప్పటికీ తొలిచేస్తూనే ఉంటుంది!
బాలూకు భక్తి పాటలు పాడడం రాదనే వారున్నారు. ఓర్వలేని వారి ఇంకో మాట ఇది. దీన్ని ఆక్షేపించడానికి ఎన్నో తార్కాణాలుండవచ్చు. కానీ.. ఘంటసాలకు భగవద్గీత, జేసుదాసుకు హరివరాసనం ఎలాగో.. బాలుకు లింగాష్టకమ్ అలాంటిది. రాష్ట్రంలోని ఏ శివాలయంలోనైనా.. లింగాష్టకమ్‌తో జరిగే శివార్చనలో బాలు గళమే వినిపిస్తూ ఉంటుందంటే అతిశయోక్తి ఏముంది.
మనుషుల్ని తూకం వేయడం చాలా మందికి ఇష్టం. కానీ, మన దగ్గర ఒకరకం తూకం రాళ్లు ఉంటే అనేకరకాల మనుషుల్ని ఎలా తూకం వేయగలం? తరాజు పట్టి పైకి లేపగలిగిన దమ్మున్న వాళ్లే బేరీజు వేయాలి! మన దగ్గర ఒకటే రకం తూకం రాళ్లు పెట్టుకుని.. అందరినీ తూకం వేయాలనుకోవడం అజ్ఞానం.
నూటికి నూరు మార్కులు తెచ్చుకునేంత సులక్షణ సంపన్నుడిని మనుషుల్లో కాదు, స్వయంభువులైన దేవుళ్లలో గానీ.. పురాణ పాత్రలుగా మనుషులు పుట్టించిన దేవుళ్లలో గానీ.. ఒక్కడినీ విని ఎరగను నేను.
బాలూ కూడా మనిషే. ఒక మనిషి ఒక రంగంలో శిఖరంగా ఎదిగినప్పుడు, శిఖరం మీద నిలిచినప్పుడు.. ఆ రంగంలో ఉంటూ.. తాము ఎదగలేకపోయామని అసూయపడే వాళ్లలోని జ్వలనాన్ని అర్థం చేసుకోవచ్చు. క్షమించవచ్చు. కానీ.. అకారణంగా.. ఒకరి ఉన్నతిని ‘ఓర్వలేక’.. శతసహస్రాంశం ఎదగలేని వాళ్లు, సహస్రాంశమైనా ఎగరలేని రీతిలో కిందినుంచి రాళ్లు విసురుతూ.. పొందే ఆనందాన్ని ఏమనాలి? వారి మాటలకు విలువ ఇవ్వడం కూడా బాలూ గాన మధురిమ స్మరణవేళ- వృథా చేసుకోవడం కాదా…?
నేను ఒక స్వానుభవాన్ని ప్రస్తావించాను. అందులోంచి సంస్కారమో, సౌశీల్యమో, భాషాభిమానమో, ఉదాత్తతో, మంచితనమో, ప్రవర్తనో, ప్రేమో.. నాకు కనిపించిన దానిని నా శక్తి, ఆసక్తి అనుమతించిన మేర నేను గ్రహించాను. ఎవరెవరి ఆసక్తులను బట్టి, ఎవరికి కనిపించినవి వాళ్లు గ్రహించవచ్చు.
==
ఇక సెలవు..
‘అవకాశం ఉంటే మరణమే వ’ద్దని కోరుకున్న వ్యక్తి బాలు.
‘మరణం అంటూ వస్తే.. ఆ స్పృహ తనకు కలగకుండానే.. అది తనను కబళిం’చేయాలని కోరుకున్న వ్యక్తి బాలు.
ఆ కోరిక తీరలేదు. ఏకంగా యాభైరోజుల ‘మరణస్పృహ’ ఆయనతో ఉండి, ప్రపంచాన్ని వేదనలో మిగిల్చి, ఆయనను తన వెంట తీసుకువెళ్లింది.
మరణం ఒక విముక్తి.
కానీ.. ఆయనకు దక్కిన విముక్తి మనకు విషాదాన్ని మిగిల్చింది.
ఈ విషాదంలోంచి తేరుకోడానికి ఆయన నలభైవేల నిత్యమైన జ్ఞాపకాలను మనకు వదిలివెళ్లారు.
భువనానికి వరమై దిగి వచ్చిన గంధర్వుడు..
జ్ఞాపకమై, సుస్వరమై పుట్టింటికి వెళ్లిపోయాడు..
థాంక్యూ బాలూ..
జీవితంలో.. మళ్లీ ఒక్కసారైనా మీ కాళ్లు మొక్కగల భాగ్యం వస్తుందనుకున్నాను.
ఇక రాదు. కన్నీళ్లొస్తున్నాయి!
ప్రేమతో.
కె.ఎ. మునిసురేష్ పిళ్లె
99594 88088