‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అన్నది వాస్తవమని స్వామి అగ్నివేష్ తన ప్రవర్తన ద్వారా రూఢీ చేశారు. ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లోని గంజాం జిల్లా బరంపురానికి చేరువలో ఉంటుంది ఆయన స్వగ్రామం. శ్రీకాకుళం జిల్లా జలంతరకోట సమీపంలోని ఒక కుగ్రామం అది. అక్కడి సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యాప శ్యామ్ రావ్ తన తండ్రి ఆకస్మిక మృతితో నాలుగో ఏటనే స్వగ్రామం విడిచి ఛత్తీస్ ఘడ్ లోని తాత గారింటికి వెళ్లిపోయారు.
అక్కడ నుండి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే గా , విద్యాశాఖ మంత్రిగా, సంఘసేవకునిగా కొనసాగుతూ, ఆర్యసమాజంలో ప్రముఖపాత్ర పోషించారు. ఐక్యరాజ్య సమితి సేవాదళం ఛైర్మెన్‌గా వెట్టిచాకిరి నిర్మూలనకు కృషి చేశారు. దేశంలోని అనేక ఉద్యమాలకు , సంఘసేవా కార్యక్రమాలకు ప్రత్యక్షంగా , పరోక్షంగా తోడ్పాటు అందించారు. తెలంగాణ ఉద్యామానికి ఊతమందించారు.
సిక్కోలు పోరాటాలకు అండగా..
స్వాామి అగ్నివేశ్.. ఎంతటి పోరాటనాయకుడో తలియజెప్పడానికి దేశవ్యాప్తంగా అనేక దృష్టాంతాలు ఉంటాయి. కానీ.. తను పుట్టిన ప్రాంతం కోసం కూడా ఆయనఅనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా కన్నవూరు రుణం తీర్చుకునేందుకు 2010 -11 మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా సోంపేట, కాకరాపల్లి ప్రాంతాల్లో జరిగిన ధర్మల్ విద్యుత్ కేంద్ర వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు.
1939లో జన్మించిన అగ్నివేష్ 1942లోనే ఈ ప్రాంతాన్ని విడిచివెళ్లారు. అయినప్పటికీ 68 సంవత్సరాల తరువాత తన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు మళ్లీ వచ్చారు. వస్తూనే ఉద్యమానికి ఊపునిచ్చారు. సోంపేట పరిధిలోని బీల పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు.
ఆ ప్రాంతవాసుల్లో చైతన్యం నింపారు. జన్మభూమిపై మమకారంతోనే ఇక్కడకు వచ్చానని బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ స్థానికులలో స్ఫూర్తి నింపారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు దోహదపడ్డారు. వేరొకవైపు అప్పటి రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేశారు.
బీల ప్రాంతంలోని చిత్తడి నేలలు సహజసిద్ధమైనవని, వాటిని నాశనం చేసేందుకు ప్రయత్నించవద్దని హితవు పలికారు. ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు ద్వారా దశాబ్దాలుగా శ్రమించినా రూపొందించలేని జీవవైవిధ్య ప్రాంతం ధ్వంసం అవుతుందని ప్రభుత్వానికి తెలియచేయగలిగారు. ధర్మల్ విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా సోంపేటలో నిర్వహించిన నిరసన శిబిరంలో పాల్గొని స్థానికుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆకస్మిక మృతి సిక్కోలు వాసులకు తీవ్ర విషాదం కలిగించింది.











