చంద్రబాబునాయుడు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలను ప్రకటించడంతో ఇప్పటివరకు స్తబ్దతగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులలో చలనం వచ్చింది. ఎన్నికల్లో ఓటమి అనంతరం నియోజకవర్గ సమస్యల పైన, ఇతర ప్రజాసమస్యల పైన ప్రజల వద్దకు వెళ్లకుండా తమ సొంత కార్యకలపాలకు, వ్యాపారాలకు మాత్రమే పరిమితమైన నాయకులు ఒక్కసారిగా తమ పైన అధిష్టానం మోపిన బాధ్యతలను స్వీకరించి మళ్ళి ప్రజలలోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న మాజీ ఎం.పి. కొనకళ్ళ నారాయణరావు కొత్తగా సారథ్య బాధ్యతలు రాగానే కాస్త యాక్టివేట్ అయ్యారు. ఇప్పటివరకు రెండు సార్లు ఎం.పి.గా ఉన్న కొనకళ్ళ మొన్నటి ఎన్నికలలో ఓటమి చెందడంతో ఆనాటినుండి పార్టీ కార్యకలాపాల పట్ల దూరంగా ఉంటూ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఒకానొక దశలో కొనకళ్ళ తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నట్లు వార్తలు జోరుగా వచ్చినప్పటికీ వాటిని ఏనాడు ఆయన ఖండించిన పాపానపోలేదు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ కు చెందిన మంత్రి కొడాలి నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబును నానా మాటలు అంటున్నప్పుడు కానీ, అలాగే తన నియోజకవర్గ పరిధిలోని గన్నవరం ఎం.ఎల్.ఎ. వల్లభనేని వంశీ పార్టీ మారి వైసీపీలో కి వెళ్లి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును విమర్శించినప్పుడు కానీ ఆవ్యాఖ్యలను ఖండించకుండా తనస్వంత వ్యహారాల పేరుతో నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు.
అంతేకాక మచిలీపట్నం కు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్య కేసులో ఇరికించి జైలుకు పంపినప్పుడుకుడా ఏదో మొక్కుబడిగా రవీంద్ర కుంటుంబీకులను పరామర్శించి తిరిగి తన స్వంత పనులకు మాత్రమే కొనకళ్ళ పరిమితమైపోయారు.
కాగా ఇపుడు చంద్రబాబు తనకు నియోజకవర్గ అధ్యక్షుడు పదవి ఇచ్చేసరకి తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి నాయకులతో సమావేశమై తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసేందుకు కృషిచేయాలని ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. అంతేగాక జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందిదంటూ తీవ్రంగా విమర్శించారు.
దాదాపు 16 మాసాలు పాటు తన నియోజకవర్గ పరిధిలో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా, ప్రజాసమస్యలను పట్టించుకోకుండా ఉన్న వ్యక్తికి పదవి వచ్చేసరికి పార్టీ, ప్రజలు, వారి సమస్యలు పట్ల ప్రేమ చూపిస్తూ తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారం లోకి తీసుకువచ్చేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పటం చేస్తుంటే రాజకీయనాయకులు పదవిఉన్నపుడు ఏవిధంగావ్యవహరిస్తారో లేనప్పుడు ఏవిధంగా ఉంటారో అనేది సుస్పష్టంగా తెలుస్తోంది.











