ఇదేంటి? మద్యం ధరలు పెరిగితే వ్యవసాయరంగంపై పెనుభారం పడటం ఏమిటి అనే అనుమానం రావచ్చు. అవును మీరు చదువుతోంది నిజమే. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక సాధారణ మద్యం ధరలు కూడా 200 శాతం పెంచారు. దీంతో కూలీలు ఎక్కువగా తాగే చీప్ మద్యం ధరలు క్వార్టర్ రూ.250కు ఎగబాకింది. ప్రతి రోజూ కూలీ పని అయిపోయాక క్వార్టర్ పుచ్చుకునే మద్యపాన ప్రియులు టీడీపీ పాలనలో రూ.90 ఖర్చుచేసేవారు. నేడు అదే క్వార్టర్ మందుకు రూ.250 ఖర్చు చేయాల్సి వస్తోంది.
దీంతో పలు జిల్లాలో కూలీ రేట్లు పెంచారు. గతంలో కాకినాడలో పురుషులు రోజుకు రూ.600 తీసుకునేవారు. నేడు రోజుకు రూ.750 కూలీ డిమాండ్ చేస్తున్నారు. ఏమిటని ప్రశ్నిస్తే మద్యం ధరలు పెరిగిపోయాయి. గతంలో రోజుకు వంద ఖర్చు పెట్టేవాళ్లం. నేడు రూ.250 ఖర్చు చేయాల్సి వస్తోంది. మేం ఏం చేయాలి. ఇంట్లో కనీసం రూ.400 ఇవ్వాలి కదా అని కూలీలు సరదాగా రైతులను ప్రశ్నిస్తున్నారు. దీంతో రైతులకు విషయం అర్థం అయిపోతోందట. వ్యవసాయ కూలీ ధరలు అమాంతం పెరగడంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న వ్యవసాయరంగం మరింత సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఏపీ అంతటా ఇదే పరిస్థితి…
వ్యవసాయ పనులకు పలు జిల్లాల్లో కూలీలు దొరకడం లేదు. మహిళా కూలీల కొరత లేదు కానీ, కొన్ని పనులు పురుషులు మాత్రమే చేయగలరు. పొలాలకు మందులు పిచికారీ లాంటి పనులకు పురుషులు దొరకడం లేదు. ఇక ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెంచిన తరవాత, ఆ భారం కూడా రైతులపైనే పడింది. కొన్ని ప్రాంతాల్లో కూలీలు మద్యం క్వార్టర్ తో పాటు, కూలీ డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ పనులన్నీ ఒకేసారి వస్తూ ఉంటాయి.
కొన్ని సమయాల్లో కూలీలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇది జిల్లాలను బట్టి మారుతూ ఉండవచ్చు కానీ పెద్దగా మార్పు ఉండదు. కొన్ని వ్యవసాయ పనులు వాయిదా వేయడానికి అవకాశం ఉంది. అదును పదును అంటారుగా… పదును చూసి పంటలు వేసుకోవాలి. పురుగుమందులు సమయానికి పిచికారీ చేసుకోవాలి. లేదంటే పంటలపై ఆశ వదిలేసుకోవాల్సిందే. అందుకే కూలీలు డిమాండ్ చేస్తున్న మద్యం బాటిల్స్ కూడా రైతులే కొనుగోలు చేసి పొలాల వద్ద ఇస్తున్నారు. దీంతో వ్యవసాయం చేసే రైతులకు పొలాలకు పిచికారి చేసే పురుగు మందులతోపాటు, కూలీలకు కూడా మందు కొనాల్సి వస్తోందని వాపోతున్నారు.
నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి ఇంకో రకంగా ఉంది. అక్కడి రైతు వరి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నాట్ల దగ్గరినుంచి కూలీల అవసరం చాలా ఎక్కువ. పోసిన నార్లతో ఒక ఎకరం మాత్రం నాటారు. కూలీల రేట్లు ఎక్కువగా ఉన్నాయి.. అనేది అతని బాధ.. నవంబరు తర్వాత.. కూలీలు తగ్గుతాయి… అప్పుడు నాటుకోవచ్చులే అని.. ఐదెకరాలు పొలం ప్రస్తుతానికి బీడుగానే పెట్టుకున్నారు.
పత్తి పంటకు కాలం చెల్లినట్టే…
గత మూడు సంవత్సరాలుగా పత్తి పంటపై గులాబీ పురుగు దాడి చేస్తోంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించడం లేదు. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 3 క్వింటాళ్లు కూడా రావడం లేదు. ఈ సంవత్సరం అప్పుడే గులాబీ పురుగు దాడి ప్రారంభమైంది. దీనికి తోడు కూలీ ధరలు కూడా పెరగడంతో పత్తి పంట వేసిన రైతులకు నష్టాలు తప్పడం లేదు.
పత్తి పంటకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. పెరిగిన కూలీల ధరలతో పత్తి పంట సాగుకు స్వస్తి పలికే రోజులు ఎక్కువ దూరంలో లేవని అర్ధం అవుతోంది. గత ఏడాది చివర్లో కూలీ రేట్లు చెల్లించలేక, ఖమ్మం, గుంటూరు జిల్లాల రైతులు పత్తి తీయకుండా పొలాల్లోనే వదిలేశారు. కూలీలు దొరకకపోవడం, ఒకవేళ దొరికినా ఎక్కువ కూలీ డిమాండ్ చేయడం వల్ల వ్యవసాయంలో తక్కువ ఆదాయం వచ్చే పంటలు కనుమరుగు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే తెల్లబంగారం మాయం కానుంది అనడంలో అతిశయోక్తి లేదు.
కూలీల ఆధారిత పంటలు సాగు కష్టమే…
కొన్ని పంటలకు కూలీల అవసరం చాలా ఎక్కువ. మద్యం రేట్లు పెరిగి కూలీ ధరలు కూడా 30 శాతం దాకా పెరగడంతో రైతులు కూలీల అవసరం తక్కువగా ఉండే పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న, జొన్న, వరి పంటలకు కూలీల అవసరం చాలా తక్కువ. అందుబాటులోకి వచ్చిన హార్వెస్టర్లతో వరిలో, మొక్కజొన్నలో, జొన్నలో కూలీల అవసరం 90 శాతం తగ్గిపోయింది. అందుకే రైతులు ఆ పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. పత్తి, మిరప పంటలకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే కూలీ రేట్లు భరించలేక ఆ పంటలకు స్వస్తి పలుకుతున్నారు.











