యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఓం రౌత్ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో సీత పాత్రలో నటించే హీరోయిన్ గురించి కొద్దిరోజులుగా అనేక పుకార్లు వస్తూ ఉన్నాయి. కీర్తి సురేష్, కియారా అద్వానీ, ప్రియాంకా చోప్రా, అనుష్క శర్మ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క పేరు ప్రముఖంగా వినిపించింది. బాహుబలి సినిమాలో అలరించిన ఈ జంట ‘ఆదిపురుష్’తో మళ్లీ జతకట్టనుందన్న వార్తతో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు.
టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్లలో ప్రభాస్, అనుష్కది అగ్రస్థానం. వీరిద్దరు కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్లో నటించగా.. అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఈ జంటను వెండితెరపై మరోసారి చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అనుష్క తాజా సినిమా ‘నిశ్శబ్దం’ అక్టోబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్లాట్‌పామ్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా అనుష్క ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి వస్తున్న రూమర్‌పై ఆమె స్పందించారు. ‘
”నాకు అలాంటి ఆఫర్ ఏమీ రాలేదు. నేను ‘ఆదిపురుష్’ చిత్రంలో నటించడం లేదు. ఆ వార్తల్లో నిజం లేదు” అని అనుష్క తెలిపారు. దీంతో ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు అనుష్క చెక్ పెట్టేసింది. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సౌత్ ఇండియా సినిమాలపైనే ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని, తనతో ఎప్పుడు నటించాలన్న నేను సిద్దమే అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. బాలీవుడ్ లో అవకాశం వస్తే చేస్తారా అని రిపోర్టర్ ప్రశించగా, అవకాశం వస్తే తప్పకుండ చేస్తానని తన మనసులోని మాట బయటపెట్టింది అనుష్క. ‘ఆదిపురుష్’లో రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా ఎన్ని రికార్డులను బద్దలుకొడుతుందో చూడాలి మరి.











