కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ అధికార ప్రతినిధి, న్యాయవాది నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పేదలకు ఇచ్చిన సెంటు భూమి కొనుగోళ్లలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడంటూ నందం సుబ్బయ్య విమర్శలు చేసిన రెండు రోజులకే దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది. ప్రొద్దుటూరులో పేదలకు పంచిన సెంటు ఇళ్ల స్థలాల వెంచర్‌లోనే నందం సుబ్బయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు.
హత్యకు కారణం అదేనా…
టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య వెనుక కేవలం అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా వైసీపీని వీడి టీడీపీలో చేరడం కూడా కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి, అధికార పార్టీ నేతల అవినీతిపై విమర్శలు చేయడం కూడా నందం సుబ్బయ్య హత్యకు దారితీసి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రొద్దుటూరు సమీపంలోని చిన్నశెట్టిపల్లెలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఎకరా రూ. 5లక్షలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రూ.40 లక్షలకు అమ్మారని నందం సుబ్బయ్య ప్రధానంగా ఆరోపణలు చేశారు. ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Must Read ;- వైసీపీ నేత దౌర్జన్యం.. కౌలు రైతు సలీం ఆత్మహత్యాయత్నం