అమరావతి రాజధాని గ్రామం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవలు సర్ధుమణిగాయి. ఎస్సీ కాలనీ ఆర్చీకి పేరు పెట్టే విషయంలో ఎస్సీల్లోని రెండు కులాల మధ్య చెలరేగిన అల్లర్లలో మరియమ్మ అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. మరయమ్మ మరణంతో వెలగపూడిలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సోమవారం మరియమ్మ మృతదేహంతో బాధితులు ఆందోళన చేశారు. రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టింది బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అంటూ బాధితులు ఆరోపించారు. శవంతో ధర్నా విరమించాలని హోం మంత్రి సుచరిత నచ్చచెప్పినా బాధితులు మెత్త పడలేదు. ఎఫ్ఐఆర్‌లో ఎంపీ నందిగం సురేష్‌ను ఏ వన్ గా చేరిస్తేనే మరియమ్మకు అంత్యక్రియలు నిర్వహిస్తామని బాధితులు పట్టుపట్టారు. పది లక్షల పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా బాధితులు దిగి రాలేదు. చివరకు ఎంపీ నందిగం సురేష్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేరుస్తామని హోం మంత్రి సుచరిత హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. మరియమ్మ మృతదేహానికి అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో వెలగపూడిలో 24 గంటల పాటు నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత తగ్గింది.
ఏ వన్ గా ఎంపీ నందిగం సురేష్ పేరు?
వెలగపూడిలో ఓ వర్గంపై రాళ్ల దాడిపై 29 మందిపై కేసు పెట్టాలని బాధితులు ఫిర్యాదు ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పేరు మొదటగా పేర్కొన్నారు. హోం మంత్రి హామీ మేరకు ఎంపీ నందిగం సురేష్‌పై కేసు పెట్టడంతోపాటు, అతన్ని ఈ కేసులో ఏ వన్‌గా చేర్చాల్సి ఉంది. ఎంపీ నందిగం సురేష్ పేరుతో కూడిన ఫిర్యాదును తుళ్లూరు పోలీసులు బాధితుల నుంచి స్వీకరించారు. అయితే, ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. వెలగపూడి ఘటనపై బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన తుళ్లూరు సీఐ ధర్మేంద్ర బాబును వీఆర్‌కు బదిలీ చేశారు. దీంతో బాధితులు కొంత శాంతించారు.
రోజంతా డ్రామా
వెలగపూడిలో ఇరు వర్గాలకు సర్ధిచెప్పేందుకు హోం మంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఘటనా ప్రాంతానికి చేరుకున్న సమయంలో బాధితులు తిరగబడ్డారు. ఒక సమయంలో ఎంపీ నందిగం సురేష్‌ను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీని అక్కడ నుంచి దూరంగా తరలించారు. దీంతో బాధితులు శాంతించారు. వెలగపూడి ఎస్సీల మధ్య గొడవ పెట్టింది ఎంపీ నందిగం సురేషేనని బాధితులు బలంగా నమ్ముతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవడాలని వారు డిమాండ్ చేశారు. ఓ సమయంలో మరియమ్మ శవాన్ని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముందుకు తరలించేందుకు బాధితులంతా ఒక్కసారిగా కదిలారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇలా రోజంతా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అర్థరాత్రి మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంతో ఉద్రిక్తతలు ప్రస్తుతానికి తగ్గాయి.
Must Read ;- ఎంపీ నందిగం సురేష్‌తో ప్రాణహాని.. సీఎం రక్షణ కోరిన బాధితుడు