ఏపీలో సంచలనం రేపిన సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేసేందుకు నకిలీ చెక్కులు తయారు చేసిన కేసులో ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఏపీలో తీగలాగితే బీహార్, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో డొంక కదిలింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు నకిలీవి తయారు చేసి రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన ప్రయత్నం చివరి క్షణాల్లో రివర్స్ అయింది. దీంతో సచివాలయ అధికారులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసును అవినీతి నిరోధక శాఖకు అప్పగించడంతో అధికారుల రంగంలోకి దిగారు. నాలుగు రాష్ట్రాల్లో 9 మంది అనిమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనుక అసలు సూత్రదారులు ఎవరనే దానిపై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఏపీ అధికారుల హస్తం ఉందా?
సచివాలయంలో సీఎంఆర్ఎఫ్ వ్యవహారాలు చూడటానికి ప్రత్యేక విభాగం ఉంది. సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేయగానే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాలకు సమాచారం వెళుతుంది. సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకే విడుదల చేస్తారు. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక వారిచేతుల మీదగానే బాధితులకు అందిస్తూ ఉంటారు. వాటి వివరాలు ప్రజాప్రతినిధుల కార్యాలయ సిబ్బందికి, లేదా లబ్దిదారులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. వారి ద్వారానే చెక్కుల వివరాలను అక్రమార్కులు సేకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగానూ విచారణ కొనసాగిస్తున్నారు.
దీని వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఉన్నారా?
ఇంత భారీ స్కెచ్ వెనుక ఎవరైనా పెద్దలు ఉన్నారా? అనే దానిపై అనిశా అధికారులు దృష్టి సారించారు. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు ఏమైనా చేసి,ప్రభుత్వ నిధులు కొల్లగొట్టారా అనే యాంగిల్ లోనూ విచారణ సాగిస్తున్నారు. పాత్రదారులు దొరకడంతో ఇక అసలు సూత్రధారి ఎవరు అనే దానిపై అనిశా అధికారులు ఫోకస్ పెట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అధికార పార్టీ నేత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే అతని వద్ద పనిచేసే సిబ్బంది పైనా అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా సీఎంఆర్ఎఫ్ నిధుల కుంభకోణంలో అనిశా అధికారులు మంచి పురోగతి సాధించారనే చెప్పవచ్చు. అసలు సూత్రదారులను కూడా పట్టుకుంటే ఈ కేసు కొలిక్కి వచ్చినట్టే.
ఉత్తరాది ముఠాలతో లింకులా?
ఏపీలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల బాగోతం బయటకు లాగితే పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో అక్రమార్కులు కలుగుల్లోంచి బయటకు రావడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తం ఏపీలోని బ్యాంకుల్లో డ్రా చేస్తే నిందితులు వెంటనే దొరికిపోయే అవకావం ఉంది. అందుకే అక్రమార్కులు ఉత్తరాది ముఠాలను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఆ ముఠాలకు కమీషన్ ముట్టచెప్పి, ఢిల్లీ, బెంగళూరు బ్యాంకుల్లో నిధులు డ్రా చేసి సదరు సూత్రదారికి అందించేందుకు ప్యాకేజీ మాట్లాడుకున్నారని అవినీతి శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అసలు సూత్రదారుడు చేతికి మట్టి అంటకుండా వ్యవహారం నడిపినట్టు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా అసలు సూత్రదారులు బయటకు వస్తే వారి నిజ స్వరూపం బయటపడే అవకాశం ఉంది. ఇందులో అధికార పక్షం వారు ఉన్నారా? విపక్షాల వారు ఉన్నారా? అనేది పక్కన పెడితే ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా కాపాడిన బ్యాంకు అధికారులను మాత్రం ప్రశంసించవలసిందే!!