ఏపీలో అధికార వైసీపీలో పరిస్థితి అంతకంతకూ తీసికట్టుగా మారుతోంది. పార్టీ విపక్షంలో ఉండగా… అంతర్గత కుమ్ములాటలు అంతగా బయటకు రాకున్నా… పార్టీ అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడ అంతర్గత వైషమ్యాలు బయటపడుతున్నాయి. ఈ తరహా ఘర్షణలు ఏదో వేరే జిల్లాల్లో జరుగుతున్నాయనుకోవడానికి వీల్లేదు. పార్టీ అధినేత, ఏపీ సీఎంగా కొనసాగుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఈ ఘర్షణలు ఓ రేంజిలో జరుగుతున్నాయి. ఈ ఘర్షణలు ఎంతదాకా వెళుతున్నాయంటే… ఏకంగా ఒకరిని ఒకరు చంపుకునేంతగా. సీఎం సొంత జిల్లాలోనే అధికార పార్టీలో ఈ రేంజిలో గొడవలు జరుగుతుంటే.. ఇక మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఏ తీరున ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పులివెందులలోనే..
జగన్ సొంత జిల్లా కడపకు చెందిన వైసీపీలో నేతలు తమలో తామే కీచులాడుకుంటున్న వైనం ఇటీవలి కాలంలో బాగానే పెరిగిపోయింది. ఈ గొడవలు ఏకంగా సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోనూ చోటుచేసుకోవడం గమనార్హం. నియోజవర్గంలోని వేంపల్లి మండలం ఇడుపులపాయలో ఇటీవల వైసీసీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీసీ శ్రేణులు ఇంటింటికీ పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఓ రోజు రాత్రి 10 గంటల సమయంలో రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడికి పాల్పడ్డారు. వీరన్నగట్టుపల్లెకు చెందిన పుల్లయ్య వర్గానికి చెందిన నలుగురిని ఇడుపులపాయకు చెందిన చలపతి వర్గం వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్లు వెనువెంటనే రంగంలోకి దిగిపోయి… విషయం పెద్దది కాకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాకుండా ఈ గొడవలు పాతకక్షల నేపథ్యంలోనే జరిగాయని, పార్టీలో అసంతృప్తి కారణంగా జరగలేదంటూ కవర్ చేశారు.
Must Read ;- వైసీపీ నేత బెదిరింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం..
జమ్మలమడుగు నియోజకవర్గంలో..
ఇదిలా ఉంటే… జిల్లాలో పులివెందుల తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీ అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఏకంగా పార్టీకి చెందిన ఓ కార్యకర్త మరణించాడు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వర్గీయుల చేతిలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అనుచరుడు గురునాథ్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కడప జిల్లాలోనే కాకుండా యావత్తు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. రామసుబ్బారెడ్డి ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరగా… ఆయన చేరికను ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సుధీర్‌రెడ్డి… రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేసేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గండికోట నిర్వాసితుల పరిహారం పంపిణీలో సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలో మారిపోయి… ఘర్షణకు దారి తీయగా… రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన గురునాథ్‌రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఏమాత్రం స్పందించని జగన్.. ఇప్పటి దాకా హంతకులపై ఎలాంటి చర్యలకు ఆదేశాలు జారీ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజంపేట, ప్రొద్దుటూరుల్లో..
ఇటు జమ్మలమడుగు, అటు పులివెందుల నియోజకవర్గాల్లోనే కాకుండా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ వైసీపీ నేతల మధ్య సఖ్యత లేని వైనం బహాటంగానే కనిపిస్తోంది. రాజంపేటలో పార్టీకి ఆది నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డిని మొన్నటి ఎన్నికల్లో పక్కనపెట్టేసిన జగన్… కొత్తగా పార్టీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో అక్కడ గ్రూపు రాజకీయాలకు జగనే బీజం వేశారన్న వాదనలు లేకపోలేదు. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వైఖరిపై పార్టీ కేడర్ అసంతృప్తితో ఉంది. తనదైన శైలి నిర్ణయాలతో సాగుతున్న రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కారణంగా తామంతా ఇబ్బంది పడుతున్నామని ఎప్పటికప్పుడు పార్టీ నేతలు బహాటంగానే చెబుతున్నారు. ఇక పార్టీ చీఫ్ విప్‌గా కొనసాగుతున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గంలోనూ అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లాలో వైసీపీ అంతర్గత కుమ్ములాటతో సతమతమవుతోంది.
Also Read ;- చంద్రబాబుకు సవాల్.. పెద్దిరెడ్డికి ఆ సత్తా ఉందా?