దేశవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియకు కొన్న చోట్ల అవరోధాలు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల కోవిన్ యాప్స్ ఓపెన్ కాకపోవడంతో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన డేటా అందుబాటులోకి రాలేదు. అందువల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. విజయవాడ రెండో కేంద్రమైన క్రీస్తురాజపురంలోని ఒక పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కోవిన్ యాప్‌కు సంబంధించిన సర్వర్లు పూర్తిగా పనిచేయకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదు. సిబ్బందికి వాటిని సరిచేయడం రాకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టలేదు.
ప్రధాని మొదలుపెట్టిన మీదట, సిఎం జగన్ ఆధ్వర్యంలో విజయవాడ జనరల్ ఆసుపత్రి కేంద్రంలో తొలి టీకాను ఇచ్చారు. కానీ, అదే నగరంలో ఉన్న క్రీస్తురాజపురంలోని కేంద్రంలో కొన్ని గంటలుగా యాప్ పనిచేయకపోయినా కూడా అధికారులు నుంచి స్పందన కరువైందని సిబ్బంది చెప్తున్నారు. సాయంత్రం 5 గంటలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుకాకపోవడం పట్ల అధికారుల నుండి స్పందన కరువైంది. కాగా, మొదటి రోజు కనుక ఇటువంటి సమస్యలు మామూలని అధికారులు సమాధానం చెప్తున్నారు. యాప్ సాంకేతిక లోపాన్ని సరిచేసి చేయించే దిశగా ఎటువంటి చర్యలు కూడా చేపట్టకపోవడం చూస్తుంటే ఈ కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.











