ఇటీవలివరకు ఎన్డీటీవీలో పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్ హార్డర్డ్ యూనివర్సిటీ ఉద్యోగం పేరుతో సైబర్ మోసానికి గురైనట్టు జమ్మూకశ్మీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు యునైటెడ్ స్టేట్స్ లోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో “జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్” గా ఉద్యోగం లభించినట్టు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 2020 జూన్ లో ఆమెకు హార్వర్ఢ్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చినట్టు మెయిల్ రావడం, పక్కాగా యూనివర్సిటీ అసలు మెయిల్ ఐడీలు, డాక్యుమెంట్ల తరహాలోనే ఆ లేఖలు ఉండడంతో అధికారికంగా ఎన్డీటీవీనుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో ఆమె ప్రకటించారు. దాదాపు 21 సంవత్సరాలపాటు ఆమె ఎన్డీటీవీలో సేవలందించారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ లో అవకాశం రావడంతో ఎన్డీటీవీ కూడా ప్రోత్సహించినట్టు ఆమె గతంలో పేర్కొన్నారు.
సెప్టెంబరులో చేరతాననని..
అప్పట్లో రజ్దాన్ సెప్టెంబరు 2020నుంచి తరగతులు మొదలవుతాయని తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో తరగతులు జనవరికి వాయిదా పడినట్టు సమాచారం అందుకున్నారు. ఇటీవల ఆమె అక్కడికి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఆమెకు వచ్చిన మెయిల్స్ సమాచారంతో కొంత గందరగోళం ఉండడంతో అనుమానం వచ్చింది. దీంతో ఆమె యూనివర్సిటీ సీనియర్ అధికారులతో డైరక్ట్ గా మాట్లాడారు. దీంతో ఆమెకు అసలు విషయం అర్థమైంది.
లేని డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు..
వాస్తవానికి ఆమెకు వచ్చిన మెయిల్ లో చెప్పినట్లు.. ఆర్ట్ అండ్ సైన్స్ విభాగంలో జర్నలిజం డిపార్ట్ మెంట్ లేదు. ఇదే విషయాన్ని అక్కడి సీనియర్ జర్నలిస్ట్, యూనివర్సిటీల కార్యకలాపాల పరిశీలకుడు జోశ్వాబెనిటెన్ మాట్లడుతూ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగంగాని, జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగం కాని లేదని వ్యాఖ్యానించారు. హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆధ్వర్యంలో @shorensteian center పేరుతో రీసెర్చ్, లెర్నింగ్ సెంటర్ ఉందని, @nieman Foundation పేరుతో ఫెలోషిప్ ప్రోగ్రాం ఉందని, హార్వర్డ్ యూనివర్సిటీలో డైరెక్ట్ గా జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగం లేదని ట్వీట్ చేశారు.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన నిధి రజ్దాన్ శ్రీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన విషయంలో ఇన్నాళ్లు సహకరించిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. తన వ్యక్తిగత వివరాలు, బ్యాకింగ్ వివరాలు, గోప్యతకు సంబంధించిన విషయాలను ఈ ఫిషింగ్ ద్వారా తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు “ఇలాంటి నీచమైన సైబర్ దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్టు ట్వీట్ చేశారు నిధి రజ్దాన్.
కాగా నిధి రజ్దాన్ ని హార్వార్డ్ యూనివర్సిటీలో ఉద్యోగం పేరుతో మోసం చేసిన ఘటనపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. ఎలాంటివారైనా.. ఎంత మేథావి అయినా.. కొన్నిసార్లు.. మోసపోవడం సహజమని కొందరు కామెంట్లు చేస్తుండగా, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఉద్యోగం పేరు చెప్పగానే.. ప్రాథమిక స్థాయిలోనే నిజనిజాలు తెలుసుకుని ఉండాల్సిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. అదే సమయంలో మళ్లీ పూర్వ ఉద్యోగానికి వస్తారా అనే చర్చకూడా సోషల్ మీడియాలో మొదలైంది. కాగా ఈ వ్యవహారంపై మీడియావర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.











