కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కాన్నుంచి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై సందు దొరికితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్‌పైనే తన విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు.
హిందూ ధర్మానికి అడ్డం వస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. బీజేపీ పార్టీ హిందువుల పార్టీ అని సంజయ్ కుండ బద్దలు కొట్టారు. అలాగే టీఆర్ఎస్ నాయకులపై కూడా ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతల బాక్సులు బద్దలు కొడతామని విరుచుకుపడ్డారు. తెలంగాణకు అన్నీ కేంద్రమే ఇస్తే ఇక కేసీఆర్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఇచ్చే బియ్యానికి, రోడ్లకి, డబుల్ బెడ్‌రూం ఇళ్లకు, లైట్లు, టాయిలెట్లకు డబ్బులన్నీ కేంద్రమే ఇస్తుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. హిందువుల మనోభావాలను అవమానపరిచే ఎంఐఎంతో కేసీఆర్ అంటకాగుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రగతిలో కేంద్రం వాటా ఉందన్నారు. వరద నష్టంపై ఇంటింటికీ సర్వే చేసి వరద సాయం చేయాలని కోరారు.
మనవడికి తప్ప అందరికీ ఉద్యోగాలు..
బీజేపీ నేత లక్ష్మణ్ సీఎం కుటుంబంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలపై ఆయన మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుంటుంబంలో మనవడు హిమాన్షుకు తప్ప అందరికీ ఉద్యోగాలొచ్చాయని విమర్శించారు. పరీక్షల్లో తప్పిన కవితకు కూడా ఆఖరికి ఉద్యోగం వచ్చిందని చురకలంటించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంటే మీ ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలొచ్చాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు సముద్రం లేదన్న బెంగను కూడా తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇటీవల తీరిందని విమర్శించారు. గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గ్రేటర్‌లో టీఆర్ఎస్ గెలిచిందని లక్ష్మణ్ ఆరోపించారు.
ఎన్నికలు ఇంకా కన్ఫామ్ కాకముందే అధికార, విపక్ష పార్టీలు తమ విమర్శలకు ఇలా పదును పెడుతున్నాయి. ఇక నోటిఫికేషన్ వచ్చా ఎలా ఉంటుందో మరి.