ఇంతకూ ఈ వరదలు ఎందుకు వచ్చాయి? దానికి కారణం ఏమిటి? డల్లాస్.. న్యూయార్క్ సిటీల్ని తలపించేలా హైదరాబాద్ మహానగరాన్ని నిర్మిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాటల వీడియోలు.. అందులోనే తాజా వర్షాలు.. వరదలతో ఆగమాగం అవుతున్న భాగ్యనగరిని చూపిస్తూ.. చెప్పాల్సిన విషయాన్ని చెప్పేయటం కనిపిస్తుంది. ఇలాంటి వైరల్ వీడియోల వేడి తెలంగాణ పాలకులకు నేరుగా తాకిన వైనం.. మంత్రి కేటీఆర్ మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇంత వర్షం కురిస్తే.. డల్లాస్.. న్యూయార్కుల్లోనూ ఇలాంటి సీన్లే ఉంటాయని చెప్పటం చూస్తే.. ప్రభుత్వ వైఫల్యాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంగా చెప్పక తప్పదు. ఒకవేళ కేటీఆర్ చెప్పిందే నిజమని అనుకుందాం. టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిన ఇప్పటి రోజుల్లో భారీ ఈదురుగాలులు లేకుండా భారీ వర్షం కురిసిన దానికే.. ఒక మహానగరంలో 33 మంది మరణిస్తారా? అన్నది ప్రశ్న.
తాజాగా కేటీఆర్ ప్రెస్ మీట్ చూసినప్పుడు కనిపించే ప్రధాన అంశం ఒక్కటే. జరిగిన విపత్తును వందేళ్లకోసారి వచ్చేదిగా చెప్పి.. కాలం ఖాతాలో వేసేయటమే కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ లాంటి అతి పెద్ద వ్యవస్థ ఏం చేసింది? అన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. వేల కొద్దీ సిబ్బందితో పాటు.. వందలాది కోట్ల బడ్జెట్ చేతిలో ఉన్న సంస్థ.. ఒక విపత్తు విరుచుకుపడటానికి ముందు సరైన రీతిలో మేల్కొనలేకపోవటానికి మించిన వైఫల్యం ఏముంటుంది? విమర్శలు విరుచుకుపడటానికి ముందే.. దీన్నో అరుదైన విపత్తుగా చెప్పటం ద్వారా తెలంగాణ పాలకులు తెలివిని ప్రదర్శించారని చెప్పక తప్పదు.
అరుదైన విపత్తులు విరుచుకుపడటాన్ని ఎవరూ ఆపలేరు. అది మానవులకు అసాధ్యం. అదే సమయంలో జరిగే నష్టాన్ని నివారించటం మాత్రం కచ్ఛితంగా మన చేతిలోనే ఉందన్న సత్యాన్ని మర్చిపోకూడదు. దిల్ సుఖ్ నగర్ లాంటి ప్రాంతంలో ప్రధాన రహదారి వారానికి పైనే వారం నిలబడిపోవటం.. వెనక్కి వెళ్లకపోవటం దేనికి నిదర్శనం. ఇలాంటి వాటిని కూడా వందేళ్ల విపత్తులో వేసేద్దామా? అరుదైనవన్న పేరుగా చెప్పే మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. వాటిని అనుభవిస్తున్న వారికి.. అసలు దోషులు ఎవరన్న విషయంపై స్పష్టత ఉంది. అలాంటి వారు.. తమ మాటల్ని వింటారన్న విషయం గుర్తుంటుందంటారా?











