ఇప్పటికే భారీ వర్షాలు హైదరాబాద్‌ను పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజులు కూడా హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది. దీంతో గ్రేటర్ జిహెచ్ఎంసి పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ ప్రతీ శాసన సభ్యుడు హైదరాబాద్‌లోనే ఉండాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హుకూం జారీ చేశారు. భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయక చర్యలు చేపడుతూ పర్యవేక్షణకు ఆయా ప్రాంతాల్లో ఉండాలని తెలిపినట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలోని శాసన సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులతో మంత్రి కేటిఆర్ సమీక్ష నిర్వహించారు. వరదలతో నష్టపోయిన బాధితులందరికీ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సాయం అందేలా చూడాలి సూచించారు.
ఎంపీ, ఎమ్మెల్యేల ఆర్థిక సాయం..
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గ్రేటర్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ రెండు నెలల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చినట్లు తెలిసింది. వరదలకు నష్టపోయి, ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చేలా క్షేత్రస్థాయిలోనే ఎమ్మెల్యేలు ఉండాలని మంత్రి ఆదేశించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో బల్దియా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సేవలను పర్యవేక్షించాలని సూచించారు. శానిటేషన్, రోడ్లు, డ్రైనేజీల మరమ్మతుల పనులు త్వరతగతిన చేపట్టాలని ఆయన కోరారు.
పరీక్షలు వాయిదా!..
తెలంగాణలో జరగాల్సిన అన్ని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దసరా వరకు పరీక్షలన్నింటినీ పోస్ట్‌పోన్ చేసింది. దసరా పండుగ తరువాత మళ్లీ కొత్త తేదీలు ప్రకటించనుంది. పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 27 నుంచి నిర్వహించనుంది. ఈనెల 27 నుంచి నవంబర్ 1 వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ను ప్రకటించనుంది. అలాగే పీజీ ప్రవేశ పరీక్ష, సిపిజిఈటికి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించే గడువు ఈనెల 23 వరకు పొడిగించింది.











