నిజమేనబ్బా.. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి టైమేమీ బాలేనట్టే ఉంది. ఏ అంశం తీసుకున్నా.. ఇట్టే వివాదంలోకి ఇరుక్కుపోతున్న మల్లారెడ్డి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా తాను చేసిన ప్రసంగంతోనే మల్లారెడ్డి వివాదంలో చిక్కుకుపోయారు. ఎవరి దగ్గరకైతే వెళ్లి తనదైన శైలి ప్రసంగం చేశారో.. వారే ఇప్పుడు మల్లారెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. మంత్రి చేసిన వాసన వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయని, తక్షణమే మంత్రి సారీ చెప్పాలంటూ.. డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట సమితి ఇప్పుడు మల్లారెడ్డి వార్నింగ్ ఇచ్చింది.
అసలేం జరిగిందంటే..?
గత ఆదివారం హైదరాబాద్ లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్మిక శాఖ మంత్రి హోదాలో ఈ వేడుకకు హాజరైన మల్లారెడ్డి తనదైన స్టైల్లో ప్రసంగించి జనాలను నవ్వించేశారు. విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన మల్లారెడ్డి.. ‘‘మీకు అన్ని వసతులు కల్పిస్తాను. ఇంకో అదృష్టమేంటంటే డంపింగ్ యార్డ్ వాసన జవహర్ నగర్ వైపు లేదిప్పుడు. దమ్మాయిగూడ దిక్కు వెళ్లింది’’ అంటూ ఆయన తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మల్లారెడ్డి నవ్వుతూనే కనిపించారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు జనం కూడా నవ్వేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి మాత్రం కన్నెర్రజేసింది.
సమితి వాదన ఇదే
దమ్మాయిగూడ ప్రజలను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలున్నాయని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. దమ్మాయిగూడ ప్రజలకు కంపు వాసన వస్తే మంత్రిగారికి అదృష్టమా? అంటూ సమితి కో కన్వీనర్ కేతేపల్లి పద్మాచారి నిలదీశారు. వాసన ఎటు గాలి ఉంటే అటు పోతుందని ఆయన తెలిపారు. ఎక్కడికిపోతే అక్కడ ఆ పాట పాడుతున్నారని, జనాలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మంత్రిపై విరుచుకుపడ్డారు. ఒకరిని ప్రశంసించి.. మరొకరిని కించపరచడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. వెంటనే మంత్రి మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలని, వెంటనే డంపింగ్ యార్డ్ ను మూసేయాలని డిమాండ్ చేశారు. మరి మల్లారెడ్డి ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో చూడాలి.
Must Read ;- రేవంత్‌కు కేసీఆర్ ఇలా బ్రేకులేస్తారట











