టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై ఇప్పుడు సెటైర్లు పడిపోతున్నాయి. ఇటీవలే మల్లారెడ్డి నియోజకవర్గం మేడ్చల్ లో కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో దీక్ష చేపట్టిన సందర్భంగా తన అక్రమాలపై తనదైన శైలిలో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడితే.. క్షణం ఆలస్యం చేయకుండానే మీడియా ముందుకు వచ్చిన మల్లారెడ్డి.. ఓ రేంజిలో రేవంత్ పై విరుచుకుపడుతూ కోపాన్ని ఆపుకోలేక ఏకంగా తొడగొట్టి మరీ సవాల్ చేశారు. మంత్రిగా ఉండి తొడగొట్టిన మల్లారెడ్డిపై అన్నివైపుల నుంచి విమర్శలు రేకెత్తాయి. టీఆర్ఎస్ నేతలు కూడా మల్లారెడ్డి తీరును సమర్థించుకోలేని పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం ఏం చెప్పిందో తెలియదు గానీ.. శనివారం నాడు మరోమారు మీడియా ముందుకు వచ్చిన మల్లారెడ్డి.. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆధారాలు చూపుతూ ఏకంగా ఏడుపు ముఖం పెట్టేశారు. రోజుల వ్యవధిలోనే ఆయనలో వచ్చిన మార్పుపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడిపోతున్నాయి.
అంత కోపమెందుకొచ్చిందంటే..?
సాధారణంగా రాజకీయాలన్నాక.. వైరి వర్గం నుంచి నిత్యం విమర్శలు వచ్చి పడుతూనే ఉంటాయి. ఇది అందరికీ ఎదురయ్యేదే. ఇక మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో, కేంద్ర మంత్రిగానో ఉన్నవారిపై అయితే విపక్షాలు నిత్యం వేయి కళ్లతో స్కాన్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వారిని టార్గెట్ చేస్తూ విపక్షాలు ఆధార రహిత ఆరోపణలు చేస్తూ వారిని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేలా చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మేడ్చల్ నియోజకవర్గంలో దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి.. అక్కడి స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి మల్లారెడ్డిపై విరుచుకుపడ్డారు. మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు చేస్తూ ఒకింత అనుచిత వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే ఎవరికైనా కాలిపోవడం ఖాయమే. మల్లారెడ్డి కూడా అలాగే కోపోద్రిక్తుడయ్యారు. వెంటనే మీడియా సమావేశం పెట్టి.. తాను అక్రమాలకు పాల్పడలేదని.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేస్తూ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక రేవంత్ పైకి తొడగొట్టేశారు. వాస్తవానికి మల్లారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు లేకపోలేదు. తన నియోజకవర్గ పరిధిలో ఏ పని చేయాలన్నా తనకు కప్పం కట్టాల్సిందేనంటూ ఓ కాంట్రాక్టర్ ను బెదిరిస్తున్న మల్లారెడ్డి వీడియో ఇటీవలే వైరల్ గా మారింది కూడా. వీటన్నింటినీ ప్రస్తావిస్తూనే మల్లారెడ్డిపై రేవంత్ సంచలన ఆరోపణలు చేశారన్న వాదన వినిపిస్తోంది.
ఏడుపు ముఖం ఎందుకు?
మల్లారెడ్డి విసిరిన రాజీనామా సవాల్ కు రేవంత్ రెడ్డి నేరుగా స్పందించలేదు గానీ.. ఇదిగో మల్లారెడ్డి అక్రమాలు అంటూ మీడియామ ముందు కొన్ని పత్రాలను చూపారు. దీనిపై కౌంటర్ ఇచ్చేందుకు కొన్ని పత్రాలు చేతబట్టుకుని శనివారం నాడు మీడియా ముందుకు వచ్చిన మల్లారెడ్డి.. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని వివరించారు. ఈ సందర్భంగా తనపై రేవంత్ రెడ్డి అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని, తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రేవంత్ ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయంటూ మల్లారెడ్డి ఏడుపు ముఖం పెట్టేశారు. మీడియా సమావేశంలో తనలోని బాధనంతా బయటపెట్టుకున్న మల్లారెడ్డి.. ఏడవలేదు గానీ.. ఏడ్చినంత పనిచేశారు. ఈ మీడియా సమావేశం చూసినంతనే.. అప్పుడేమో తొడగొడితిరి.. ఇప్పుడేమో ఏడుపు ముఖం పెడితిరి.. అంటూ మల్లారెడ్డిపై సెటైర్లు మొదలైపోయాయి.
Must Read ;- డ్రగ్స్ కేసులోకి కేటీఆర్‌ను లాగుతున్నారే











