మొత్తానికైతే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వం నిద్రలేచింది. కాస్త ఆలస్యమే అయినా.. మేమూ కూడా ఉన్నామంటూ ఎన్నికల బరిలో నిలిచేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి పొత్తులు లేకుండా సింగిల్‌గా బరిలో నిలుస్తున్నామని టిటిడిపి తెలిపింది. గ్రేటర్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించిన విషయం కార్యకర్తల్లో, నేతల్లో ఉత్సాహం నింపిందనుకోవచ్చు. కానీ ఎన్నికల్లో టిడిపి పోటీ.. విజయం కోసమా? ఉనికి కోసమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే తెరాస పార్టీ గ్రేటర్ ఎన్నికలకు సన్నద్ధమై, పార్టీ నేతలకు టాస్కులను కూడా ఇచ్చింది. నియోజకవర్గాల వారిగా ఎన్నికల బాధ్యతలను పార్టీ నేతలకు కెటిఆర్ అప్పగిస్తున్నారు. సర్వేలను చేపడుతూ క్షేత్రస్థాయిలో తమ పార్టీ గెలిచేందుకు ఉన్న విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రక్రియలో టిడిపి కంటే నాలుగు అడుగులు ముందుగానే ఉంది. అటు దుబ్బాక ఎలక్షన్ల ప్రచారం, ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రక్రియను చేపడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మాణికం ఠాగూర్ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే తలమునకలై హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాల పోటీలో నిలిచే అభ్యర్థులను వడపోసే కార్యక్రమంలో ఉన్నారు.
అలాగే జనసమితి, జనసేన పార్టీలు కూడా గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు కమిటీలు, సమావేశాలు జరుపుకుంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 50 డివిజన్ల కమిటీలను ప్రకటించారు. కోదండరామ్ అయితే ఏకంగా ఎన్నికల ప్రచారం ఎప్పుడో ప్రారంభించేశారు కూడా. ఇందులో భాగంగానే విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు కూడా జరిపేస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్సీ ప్రచారం, మరోవైపు గ్రేటర్ ఎన్నికల పోరులో పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడూ సమావేశాలను జరుపుతున్నారు. అలాగే బిజెపీ పార్టీ కూడా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ ను నాలుగు భాగాలుగా విభజించి నలుగురు అధ్యక్షులను నియమించి ఎన్నికల బాధ్యతను పార్టీ నాయకత్వం అప్పగించింది. మరోపక్క కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు బండిసంజయ్ ఎన్నికలకు తాము ఎప్పుడో రెడీ అని చెప్పాశారు.
ఇలా ఎన్నికల ప్రక్రియలో ప్రధాన పార్టీలన్నీ తలమునకలవుతుంటే టిడిపి మాత్రం ఎందుకు వెనుకబడి ఉందో తెలుగు తమ్ముళ్లకు అర్ధం కావటం లేదట. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఇంత వెనుకబాటు వైఖరీని అవలంభిస్తున్నారనే ప్రశ్నను తెలుగు తమ్ముళ్లు లేవనెత్తుతుతన్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ నాయకత్వం సరిగా శ్రమించట్లేదని బాధపడుతున్నారట. నవంబర్‌లో 20 తరువాత గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రక్రియపై అన్ని పార్టీలు నాలుగు అడుగులు ముందుంటే.. టిడిపి మాత్రం ఎన్నికల విషయంలో నాలుగు అడుగులు వెనుకకు ఎందుకు నడుస్తోందో తమకు అర్ధం కావట్లేదని క్యాడర్ ఆందోళన చెందుతున్నారట.
ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అనేది పక్కనబెట్టి ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టి ఓట్లు, సీట్లు రాబట్టుకునే ప్రయత్నం తెలంగాణ నాయకత్వం చేయాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి.