ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, వాటిని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం హోదాలో జనసేనాని పవన్ కల్యాణ్ గొంతెత్తి అరిచినా… శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఖాకీల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా సాటి రాని వైసీపీ నేతలు చెబుతున్నట్లుగానే ఇంకా చాలా మంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. పవన్ వ్యాఖ్యలపై ఓ వైపు కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరుగుతుంటే… కూటమికి చెందిన అగ్ర నేతలు, వారి కుటుంబ సభ్యులపై సభ్యసమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ నేత, జగన్ సతీమణి భారతి రెడ్డి పీఏ వర్రా రవీంద్రా రెడ్డి ఇలా అరెస్ట్ చేసిన కడప పోలీసులు అలా వదిలేశారు. ఈ పరిణామం చంద్రబాబును తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. అంతే క్షణాల మీద డీజీపీని పిలిపించిన చంద్రబాబు… కడప జిల్లా ఎస్పీగా కొనసాగుతున్న హర్షవర్ధన్ రాజుపై అప్పటికప్పుడే బదిలీ వేటు వేశారు.
ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాకుండా వారం రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై లెక్కలేనన్ని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటిని పరిశీలిస్తున్న ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. సదరు పోస్టుల ప్రభావాన్ని ఆధారం చేసుకుని ఆయా పోస్టులను పెట్టిన యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ తంతు గడచిన రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే వర్రా రవీంద్రా రెడ్డి… చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత తదితరులతో పాటు వారి కుటుంబ సభ్యులపై ఏ రీతిలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అతడిపైనా ఫిర్యాదు రాగా… కడప పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్ట్ చేశారు. సభ్యసమాజం తలదించుకునే రీతిలో పోస్టులు పెట్టే రవీంద్రా రెడ్డికి శిక్ష పడేలా చేయాల్సిన కడప పోలీసులు ఒక్క రోజు తిరక్కుండానే వదిలి పెట్టేశారు.
ఇలా వర్రా రవీంద్రారెడ్డి రిలీజ్ అయిపోయారన్న వార్త తెలిసే సమయానికి కేబినెట్ భేటీలో అదే అంశంపై కీలక చర్చ నడుస్తోంది. అలాంటి వేడి వాతావరణంలో వర్రా రిలీజ్ అయ్యాడన్న మాట వినగానే చంద్రబాబు ఓ రేంజిలో ఫైరూపోయారు. వెనువెంటనే డీజీపీని పిలిపించిన చంద్రబాబు… ఈ వ్యవహారంపై వివరణ కోరారు. చంద్రబాబు ఆగ్రహాన్ని గుర్తించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు… జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లుగా ప్రభుత్వం ముందు పెట్టారు. రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో కడప నగరంలోని చిన్న చౌక్ పోలీసులు వర్రాను రిలీజ్ చేశారని డీజీపీ చెప్పగా… మరి సోషల్ మీడియాపై ఇంత రాద్దాంతం జరుగుతూ ఉంటే… కడప జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. ఇందులో ప్రత్యక్ష్యంగా ఎస్పీ తప్పులేకున్నా… ఆయన అదే సీటులో ుంటే…ఇలాంటి కిలక కేసులు వచ్చినప్పుడు వాటి ప్రబావాన్ని గుర్తించడంలో విఫలం అయ్యే అవకాశాలున్నాయని, తక్షణమే ఆయనను ఆ పోస్టు నుంచి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కడప ఎస్పీని తక్షణమే హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని కోరిన డీజీపీ… వర్రాను వదిలేసినందుకు చిన్న చౌక్ సీఐని సస్పెండ్ చేశారు.
చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర పోలీసు శాఖలో పెను చర్చకే తెర లేపింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే పోలీసులుగా ఎలా పనిచేస్తామన్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహనతో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా పోలీసులు ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నారు. ఓ జిల్లా… అది కూడా జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాఎ ఎస్పీగా ఉంటూ… జగన్ సతీమణి భారతి రెడ్డి పీఏ అరెస్ట్ కావడం, అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు పడిన కష్టం, పోలీసుల నుంచి అతడు తప్పించుకునేందుకు చేసిన కుటిల యత్నాలు… ఆపై అతడు అక్కడికక్కడే రిలీజ్ అయిపోవడం వంటి కీలక విషయాలు తనకేమీ పట్టనట్టే వ్యవహరిస్తే ఎలా అని కూడా కొందరు ఖాకీలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఇకపై శాంతి భద్రతల విషయంలో ఏమాత్రం అలసత్వంగా ఉన్నా సహించేది లేదంటూ కడప ఎస్పీ బదిలీ వేటుతో చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని వారు చర్చించుకుంటున్నారు.