కరోనా చిత్ర పరిశ్రమపై గట్టి దెబ్బ కొట్టింది. షూటింగులు ఆగిపోవడంతో డైలీ లేబర్ తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. వీరి కోసం టాలీవుడ్ పెద్దలు చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు పలువురు సినీ ప్రముఖులు తమ వంతు విరాళాన్ని ప్రకటించారు. లాక్ డౌన్-1లోనే సినీ కార్మికులకు ఇంటివద్దనే సరుకులు సీసీసీ అందచేసింది. లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చినా ఇంకా షూటింగులు మొదలు కాలేదు. దీంతో కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా రెండో విడతలో కూడా సరుకులు అందచేసిన సీసీసీ తాజాగా మూడో విడతను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మా ఛాంబర్ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు శంకర్, మెహర్ రమేష్, సీనియర్ నటుడు బెనర్జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కాని మెగాస్టార్ చిరంజీవి తన సందేశాన్ని పంపారు.
” నిత్యావసర వస్తువులను తిరిగి పంపిణీ చేయాల్సిన పరిస్థితులున్నాయి. ఇంకా షూటింగులు మొదలుకాలేదు. అందువల్ల ఎవరికీ పనిలేదు. ఇంకా లాక్‌డౌన్ పరిస్థితులే కొనసాగుతున్నాయి. అందుకే అందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వాలని సీసీసీ కమిటీలో నిర్ణయించాం. అందుకే సీసీసీ తరపున 3 వ సారి కూడా అందరి కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చెయ్యాలని నిర్ణయిం తీసుకొని ఆల్రెడి డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టాము. ఇక్కడున్న అన్ని అసోసియేషన్లు , యూనియన్ లు, సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో వున్న సినీ వర్కర్స్ కి ఎప్పటిలాగా ఇస్తూనే , ఈసారి రెండు రాష్ట్రాల్లోవున్న డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లోని రిప్రజంటేటివ్ లకు , పోస్టర్ అతికించే కార్మికులకు కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకొన్నాము, దాదాపుగా పదివేల మందికి అందివ్వడం జరుగుతుంది.
ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదు. తాత్కాలిక కష్టమే, మహా అయితే మరికొద్ది రోజులపాటు ఎదుర్కొని ధైర్యంగా నిలబడదాం. పని చేసుకొంటూ సంతోషంగా గడిపే రోజులు అతిదగ్గర్లోనే ఉన్నాయి. మీ కుటుంబానికి ముఖ్యంగా ఇప్పుడు కావలిసింది మీ అందరి ఆరోగ్యం. మనకేం కాదులే మనకేం రాదులే అనే నిర్లక్ష్యం అస్సలు పనికి రాదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుక్షణం అప్రమత్తతో వుంటూ ..మిమ్మల్ని మీరు రక్షించుకొంటూ మీ కుటుంబానికి రక్షణగా వుండండి ప్లీజ్. ఈ వినాయకచవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకొంటూ … ఈ క్లిష్ట పరిస్థితులనించి గట్టెక్కాలని మామూలు పరిస్థితులు నెలకొనాలని ఆ వినాయకుడికి మొక్కు కొందాం” అంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేశారు.
తమ్మారెడ్డి మాట్లాడుతూ “షూటింగ్‌లు లేని కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సినిమా కార్మికులకు అండగా ఉండాలనే గొప్ప సంకల్పంతో చిరంజీవి ‘సీసీసీ మనకోసం’ ప్రారంభించారు. చిరంజీవి ఆలోచనకు బలాన్నిస్తూ హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ వంతు విరాళాలిచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఆయా సంఘాలిచ్చిన జాబితాల ప్రకారం అవసరమున్న ప్రతి ఒక్కరికీ నిత్యావసరాలు అందించాలని ఆ కార్మిక నాయకులకు పూర్తి బాధ్యతను అప్పగించాం. ఈసారి అదనంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న సినిమా రిప్రజెంటేటివ్స్‌కు, పోస్టర్స్ పేస్టింగ్ చేసే కార్మికులకు నిత్యావసరాలు ఇస్తున్నాం’’ అని వెల్లడించారు.












