తెలంగాణ రాష్ట్రంలోని శ్రీశైలం ఎడమ పాతాళగంగ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా? కుట్రా!? అంటూ ఆయన ప్రశ్నించారు. జగన్ జలదోపిడీకి కేసీఆర్ సహకరించి,విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని తాము ముందునుంచి చెప్పామని ఆయన అన్నారు. జరిగిన పరిణామం అనుమానాలకు తావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమోననిపిస్తోందని విమర్శించారు. ఈ ప్రమాదంపై నిగ్గు తేల్చాలంటే స్వతంత్ర సంస్థ సీబీఐతో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాతాళగంగలో ఉన్న ఎడమగట్టు భూగర్భ విద్యుత్ జల కేంద్రంలో గురువారం రాత్రి 10:30 గంటలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందగానే మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 17 మంది టన్నెల్ లో ఉన్నారు. వీరిలో 8 మంది ఎగ్జిట్ ద్వారానికి దగ్గరగా ఉండటంతో బయటికి పరుగులు తీశారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో మిగతా వారి జాడ తెలియరాలేదు. ఈ ప్రమాదంలో నాలుగు టన్నెళ్లు ధ్వంసం అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
పోతిరెడ్డి పాడు సామర్ధ్యాన్ని పెంపుకు తెలంగాణ అడ్డుకోవడానికి గల కారణాలపై ఏపీ సీఎం జగన్ శ్రీశైల ప్రాజెక్టు అధికారులతో ఇవాళ భేటీ కావలసి ఉంది. ఈ ప్రమాదం జరగడంతో జగన్ శ్రీశైలం పర్యటన రద్దు చేసుకున్నారు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని తెలంగాణ అధికారులు కృష్ణా వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు కృష్ణా వాటర్ బోర్డు చైర్మన్ పరమేశం ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించారు. కానీ సమస్య జటిలం కావడంతో కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారు. ఈ నెల 25న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్ లో భేటీ కానున్నారు. ఆ సమావేశంలో ప్రాజెక్టులపై చర్చించనున్నారు.











