అతనో ఆటో డ్రైవర్. ఓ జర్నలిస్టును కొంతమంది అంతమొందించడం కళ్లారా చూస్తాడు. వాళ్లను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాడు. దాంతో విలన్ కన్ను ఆటో డ్రైవర్ పై పడుతుంది. ఆ తర్వాత ఆటో డ్రైవర్ పై విలన్ దాడిచేస్తాడు. అతను మరణిస్తాడు. అతని భార్య తీవ్రంగా గాయపడుతుంది. కుమారుడు తప్పించుకుంటాడు. తల్లిని బతికించడానికి డబ్బు కావాలి కాబట్టి ఓ నేరాన్ని తన మీద వేసుకుని జైలుకు వెళతాడు.. టూకీగా ఇదీ కథ. అదేనండీ ఇది ‘చిరుత’ సినిమా కథ. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు ఇది తొలిసినిమా. రేపటితో ఈ సినిమా విడుదలై 13 ఏళ్లు అవుతుంది.2007 సెప్టెంబరు 28న ఈ సినిమా విడుదలైంది. ఈ కథ వెనకాల మరో కథ కూడా ఉంది. అదేంటో చూద్దాం.
కథ వెనుక కథేంటో చూద్దామా?
దర్శకుడు పూరి జగన్నాథ్ కి సాయి రామ్ శంకర్ అనే తమ్ముడున్న సంగతి తెలిసిందే! తన తమ్ముడిని హీరోగా నిలబెట్టడానికి పూరి జగన్నాథ్ చేయని ప్రయత్నం లేదు.143, హలో ప్రేమిస్తారా, బంపర్ ఆఫర్, రోమియో.. ఇలా చాలా సినిమాలు చేశారు పూరి జగన్నాథ్. ఆ దశలో దర్శకుడు మెహెర్ రమేష్ డైరెక్షన్ లో సాయి రామ్ శంకర్ హీరోగా ఓ సినిమా తీద్దామనుకున్నారు పూరి జగన్నాథ్. పూరి – మెహెర్ రమేష్ ఇద్దరూ కలిసి ఓ చిన్న లవ్ స్టోరీ రాశారు. 2004లో ఆ సినిమాని ప్రారంభించారు. సాంగ్ రికార్డింగ్ కూడా అయింది.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆపేశారు పూరి. పూరి జగన్నాథ్ ‘పోకిరి’, ‘దేశముదురు’ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాక మెగాస్టార్ చిరంజీవి దృష్టి పూరి మీద పడింది. తన కుమారుడు రామ్ చరణ్ తేజని హీరోగా లాంచ్ చేయడానికి పూరీయే సరైన దర్శకుడు అని ఫీల్ అయ్యారాయన. నిర్మాత అశ్వనీదత్ తో కలిసి చిరంజీవి స్వయంగా పూరి జగన్నాథ్ ఆఫీస్ కి వెళ్లి రామ్ చరణ్ తొలి ప్రాజెక్ట్ చేయమని కోరారు. పూరి కూడా కాదనకుండా ఆ బాధ్యతను స్వీకరించారు. అయితే చిరంజీవి గారి అబ్బాయి కోసమని కష్టపడి కొత్త కథనో, ఫార్ములా కథనో రాయకుండా తన తమ్ముడు సాయిరామ్ శంకర్ కోసం రాసిన పాత కథను రామ్ చరణ్ తో తీసేశారు. ఆ సినిమాయే రామ్ చరణ్ మొదటి సినిమా ‘ చిరుత ‘.
ప్రేక్షకుల దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకున్న చిరుత చిరంజీవి కుమారుడి మొదటి సినిమాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయింది. చిరుత సినిమా విడుదలై ఈ సెప్టెంబరు 28 కి పదమూడేళ్ళ కావస్తోంది. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా నేహాశర్మ నటించింది. ప్రకాష్ రాజ్, అలీ, ఆశిష్ విద్యార్థి, సూర్య, ప్రగతి తదితరులు ఇతర తారాగణం. మణి శర్మ సంగీతం, శ్యామ్ కె. నాయుడి ఛాయాగ్రహణం ఈ సినిమాకి మరింత సొగుసులు తెచ్చాయి. ఈ చిరు కథ వెనుక సీక్రెట్ మాత్రం పూరి సన్నిహిత వర్గాలకు మాత్రమే తెలుసు. తమ్ముడి కథన త్యాగం చేయాల్సి వచ్చింది పూరీకి.











