విధి వక్రిస్తే మనిషి కూడా వక్రంగానే ఆలోచిస్తాడేమో. అలాంటి ఆలోచన కూడా విధి రాతేనేమో. మరణం అనేది చెప్పిరాదు.. అది వచ్చాక అతను ఉండడు. బాలు స్వరానికి వాహ్వా అన్న హీరోలు కేవలం ఆయన నామస్మరణకే పరిమితం కావడంపై సామాజిక మాధ్యమాలు గుర్రుగా ఉన్నాయి. అలాంటి హీరోలపై బురద జల్లుడు కార్యక్రమానికి తెరతీసింది. బాలు చనిపోతే ఆయనకు అత్యంత ఆత్మీయుడు కమల్ హాసన్ విదేశాల్లో ఉన్నా హుటాహుటిన వచ్చేశారు. బాలును అభిమానించే ఎంతో మంది హీరోలు కనీసం బాలు పార్ధికవ దేహాన్ని చూడటానికైనా రకపోవడంతో దాన్ని పట్టుకుని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోంది.
సినిమా సెలబ్రిటీలు ఎవరైనా చనిపోతే సాధారణంగా ప్రముఖులంతా వెళుతుంటారు. ఒకే ఊరిలో ఉంటే మాత్రం సాధ్యమైనంత వరకు హాజరవడానికే ప్రయత్నిస్తారు. మహానటి సావిత్రి చనిపోయినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు కనీసం ఆమెను చూడటానికైనా వెళ్లలేదని ఆరోపణలు ఉన్నాయి. అనేక హిట్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. చూడటానికి వెళ్లకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంతమాత్రాన ఆ హీరోల వ్యక్తిత్వాన్ని కించపర్చాల్సిన అవసరం లేదు. బాలు మరణించిన సందర్భం ప్రత్యేకమైనది. బయటికి వెళితే కరోనా వస్తుందనే భయంతో సినిమా సెలబ్రిటీలంతా ఇంటికి పరిమితమయ్యారు. పైగా షూటింగుల్లోనే పాల్గొనడం లేదు.
సినిమా రంగానికి రాకముందు నుంచి పరిచయమున్న మోహన్ బాబు రాకపోవడానికి కారణమేమిటి? మెగాస్టార్ చిరంజీవి నీకు తమ్ముడినని చెప్పుకునేవారట కదా, వెంకటేష్, బన్నీ అందరూ నువ్వుంటే గౌరవమట కదా.. ఎందుకు రాలేదు అనే విధంగా ఈ సెలబ్రిటీల మీద నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రులు పిలిస్తే చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని మరీ వాలిపోయే ఈ ‘తెర హీరో’లు నీ కడసారి చూపు సమయంలో తెరచాటుకు వెళ్లిపోయారేంటంటూ ప్రశ్నిస్తున్నారు. కమల్ హాసన్ లాంటి వారు ఆసుపత్రికే వచ్చి ఉన్నారు. అంతకుమించి అశేష జనవాహిని బాలూను చివరిసారి చూసిపోవడానికి వచ్చారని గుర్తు చేస్తున్నారు. పైగా హీరోలను జీరోలని కించ పరిచేలా వ్యాఖ్యానించి వైరల్ చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో వైరల్ చేయాల్సిన అంశమైతే ఇది కాదు.
ఎందరో నిర్మాతను బాలు తన గొంతుతో బతికించినంత మాత్రాన అలా జనంలోకి వచ్చి వారి గొంతు కోసుకోలేరు కదా. ఘంటసాల మాస్టారు ఇలానే కన్ను మూసినప్పుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వెళ్లకపోవడానికి కారణాలను వారే ప్రస్తావించారు. ఎన్టీరామారావు ‘తాతమ్మకల’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదేమో. అక్కినేని నాగేశ్వరరావు ‘ ఘంటసాలను ఆ పరిస్థితుల్లో చూడలేక వెళ్లకపోయి ఉండవచ్చు కదా. అందుకే అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చి ఉంటారు. కడసారి చూపునకు వెళ్లడం వెళ్లకపోవడం అన్నది వారి వ్యక్తిగత అంశం. తెలుగు హీరోలను క్షమించమంటూ ఓ కొసమెరుపొకటి.











