మార్కండేయుడు.. మృకండు మహర్షి ,మరుద్వతి దంపతుల ఏకైక సంతానం..మహా శివభక్తుడు,అనునిత్యం పరమశివుడిని పూజించేవాడు.ఆ స్వామి సేవలో.. ఆ స్వామి నామ స్మరణలో మునిగితేలిపోయేవాడు.అల్పాయుష్కుడుగా జన్మించి శివుని ఆశీస్సులు పొంది యమ పాశాన్నే జయించిన చిరంజీవిగా అయ్యే మహా వరప్రసాదం పొందిన వాడు.
నిజంగా మార్కండేయుడు అల్పాయుష్కుడా అంటే.. మన పురాణాలు కాదని చెబుతున్నాయి. మృకండు మహర్షి, మరుద్వతి దంపతులకు చాలాకాలం సంతానం కలగలేదు. దీంతో సంతానం లేకపోవడం వారికి పెద్ద లోతుగా తయారయ్యింది. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించిన మృకండు మహర్షి, వారణాశిలో తపస్సు ఆచరిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతారని సతీసమేతంగా అక్కడికి బయలు దేరుతాడు. మృకండు తపస్సుకి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం ప్రసాదించే ముందు మరోమారు పరీక్షించాలని భావించి.. సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా, మృకండు మహర్షి సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు.మహర్షి సమాధానానికి సంతసించిన మహదేవుడు పుత్రుడ్ని ఇచ్చాను అని పల్కి అదృశ్యమౌతాడు.
మహాదేవుని మాట ప్రకారం మరుద్వతి గర్భవతి అయి 9 నెలలునిండాక దివ్యతేజస్సు కలిగిన పుత్రుడ్ని ప్రసవించింది. మృకండు మహర్షి కొడుకు కావడం వల్ల వానికి ‘మార్కండేయుడు’ అని నామకరణం చేశారు.సప్త ఋషులు , బ్రహ్మ ఆశీర్వాదం పొందిన మార్కండేయుడు..నిరంతర శివారాధన చెయ్యమని బ్రహ్మ చేసిన ఉపదేశంతో శివభక్తునిగా మారాడు. అప్పటి నుంచి నిత్యం స్వామి సేవలో, స్వామి నామస్మరణతో తన జీవితాన్ని కొనసాగించసాగాడు.
ఇంతలో మార్కండేయుడికి 16 సంవత్సరాలు నిండుతాయి. యముడు తనకింకర్లుని మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. కానీ ప్రయాణం తీసే సమయంలో తనపైకి మహాశివుడు కాలరూపుడై రావడంతో ఆ పని చేయకనే వెనుదిరుగుతాడు.
అయితే మార్కండేయుడు మృత్వువు నుంచి బయటపడటానికి ‘ మృత్యు వినాశిని’ అనే తీర్థంలో స్నానమాచరించడం కూడా ఒక కారణమని ‘తిరుప్పేర్ నగర్’ స్థలపురాణం చెబుతోంది.108 దివ్య తిరుపతులలో ఒకటైన ఈ క్షేత్రాన్ని ‘బృహత్పురి’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ‘అప్పకుడత్తాన్’ పేరుతోను.. అమ్మవారు కమలవల్లీ తాయారు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటున్నారు. స్వామివారికి ‘అప్పాలు’ అంటే చాలా ఇష్టమట.. అందువల్లనే ఆయనకి ఆ పేరు వచ్చిందని అంటారు.
మార్కండేయుడికి 16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తన ప్రాణాలు తీసుకుపోయేందుకు వచ్చే ముందు శివారాధన చేసేందుకు సిద్ధమైన మార్కండేయుడు ఈ మృత్యువినాశిని తీర్థంలోనే స్నానమాచరించాడని, దీర్ఘాయువును పొందడానికి అదీ ఒక కారణమని చెబుతారు. ఇదే క్షేత్రంలో స్వామివారు పరాశర మహర్షికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చారనేది ప్రాచుర్యంలో ఉంది.