రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది.అధికార ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరంటూ కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరడిగింది. ఈ మేరకు అధికార, విపక్షాల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. కాగా, ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలని ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూతమిని ఎలాగైనా దెబ్బతీయాలని విపక్షాలు తమదైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికలు హాట్ హాట్ గా మారాయి.
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ అగ్రనేతలు ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ముర్ము అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. ఝార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన ముర్ము సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైదపోసి గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే ఆదివాసీ తెగ కుటుంబంలో ముర్ము జన్మించారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె సుధీర్గ కాలంగా బిజెపిలో కొనసాగుతున్నారు. ముర్ము 2000 మార్చిలో ఒడిశాలో కొలువుదీరిన బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వాణిజ్య, రవాణా, మత్స్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2015లో ఝార్ఖండ్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ముర్ము… ఆ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఐదేళ్ల పాటు గవర్నర్‌గా కొనసాగిన తొలి గవర్నర్‌గా చరిత్ర సృష్టించారు. తాజాగా ఆమె ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
ఇక , రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలన్నింటి తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్ సిన్హా ఎంపికయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో రెండో దఫా భేటీ అయిన విపక్షాలు సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాయి. ఈ క్రమంలో విపక్షాల భేటీకి నేతృత్వం వహించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఓ కీలక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ మద్దతు కూడా యశ్వంత్ సిన్హాకేనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు భేటీలో భాగంగా తాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడానని పవార్ చెప్పారు. సిన్హా అభ్యర్థిత్వానికి తాను మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పారని ఆయన తెలిపారు.