విలక్షణ నటుడిగా పేరు పొందిన వ్యక్తి ప్రకాష్ రాజ్. కేవలం నటుడిగానే కాక , దర్శకుడిగా , నిర్మాతగా పలు చిత్రాలకు సారధ్యం వహీనహీన ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించారు ప్రకాష్ రాజ్. ఇక రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్ లో ప్రకాష్ రాజ్ కు ఉహించని ఎదురుదెబ్బ తగిలింది. ఊహించిన విదంగా ప్రకాష్ రాజ్ ను ప్రజలు ఆదరించలేదు.
మొదటి నుంచి బీజేపీపైనా, ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన అవకాశం చిక్కిన ప్రతిసారీ తనదైన శైలిలో సెటైర్లు సంధిస్తూ వస్తున్నారు. కాగా తాజాగా మోడీ పై ఆయన ఓ సెటైరికల్ ట్వీట్ సంధించారు. ప్రధాని నరేంద్ర మోదీని సుప్రీం యాక్టర్, డైరెక్టర్‌గా అభివర్ణిస్తూ ఆయన ట్వీట్‌ను పోస్ట్ చేశారు. కెమెరాల ముందుకు వచ్చినప్పుడు మన సుప్రీం యాక్టర్, డైరెక్టర్‌ను ఎవరైనా బీట్ చేయగలరా? అంటూ ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తన ట్వీట్‌కు తానే మొదలుపెట్టిన జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్‌ను కూడా ఆయన జత చేయడం విశేషం.
అంతేకాకుండా తన ట్వీట్ కు మోదీకి చెందిన ఓ వీడియో క్లిప్పింగ్‌ను కూడా ప్రకాష్ రాజ్ జత చేశారు. టీవీ9కు చెందిన 22 సెకన్ల ఉన్న ఆ వీడియోలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న మోదీని తమ కెమెరాల్లో బంధించేందుకు అప్పటికే కెమెరామెన్లు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉండగా… ఆ కెమెరాల ముందుకు ఓ వ్యక్తి వచ్చి మోదీకి అభివాదం చేసేందుకు యత్నించారు. అయితే ఆ వ్యక్తిని వెనక్కు వెళ్లాలని సూచించిన మోదీ… కెమెరాలకు అతడు దూరంగా జరిగిన తర్వాత ఆ వ్యక్తికి అభివాదం చేస్తూ మోదీ సాగారు.
ఆ వీడియో ను ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్విటర్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రకాష్ రాజ్ పోస్టు పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.