అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనా రోగులకు ఆక్సిజన్ అందక 8 మంది మృత్యువాత పడ్డారు. అర్థరాత్రి అకస్మాత్తుగా ఆక్సిజన్ కొరత రావడంతో, ప్రాణవాయువు సరఫరా నిలిపోయి 8 మంది కరోనా రోగులు చనిపోయారు.ఆక్సిజన్ బెడ్లపై చికిత్స పొందుతున్న మరికొందరిని పలు ఆసుపత్రులకు తరలించారు.రోగుల బంధువులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసు బలగాలను మోహరించారు.
ఆక్సిజన్ లీక్
ఏపీలో ఆక్సిజన్ సరఫరా సరిగా లేక కరోనా రోగులు చనిపోతూ ఉంటే మరోవైపు కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ నిల్వ ట్యాంకరు నుంచి పెద్ద ఎత్తున ఆక్సిజన్ లీకయింది. దీంతో రోగులు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, టెక్నీషియన్లు ఆక్సిజన్ లీకును అదుపులోకి తీసుకువచ్చారు.ఎలాంటి ప్రాణాపాయం లేదని గుడివాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిర వెల్లడించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.











