బెజవాడ దుర్గగుడిలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం సెక్యూరిటీ టెండర్లలోనే కాదు….శానిటరీ టెండర్లలోనూ భారీ అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 2019 నుంచి ఒకే సంస్థకు శానిటరీ టెండర్లు కట్టబెట్టడంతో పాటు, దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి లేకుండానే ఈవో టెండర్లను ఫైనల్ చేసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కెఎల్ టెక్నికల్ సర్వీసెస్‌కు ఇచ్చిన శానిటరీ టెండర్లు రద్దు చేయాలని అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ ఇచ్చిన ఆదేశాలను కూడా ఈవో పట్టించుకోలేదని తనిఖీల్లో తేలింది. సికింద్రాబాద్‌కు చెందిన కేఎల్ టెక్నికల్ సర్వీసెస్ సంస్థ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బినామీ కంపెనీగా ప్రచారంలో ఉంది.
ఏటా రూ.4 కోట్ల దోపిడీ..
కేఎల్ టెక్నికల్ సర్వీసెస్‌కు ఇచ్చిన టెండర్లు రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఈవో పట్టించుకోలేదు. ఈనెల 31తో సంస్థకు ఇచ్చిన టెండర్ల గడవు ముగిసినా, కరోనా బూచి చూపి వారినే కొనసాగిస్తున్నారు. శానిటరీ టెండర్లు రద్దు చేసి, నిబంధనల ప్రకారం మరల కొత్తగా టెండర్లు పిలిచి తక్కువకు కోట్ చేసిన వారికి ఇవ్వాలని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశించారు. అయినా ఈవో పట్టించుకోలేదు. మరో ఆరు నెలలు కేఎల్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థను కొనసాగించేందుకు అనుమతించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఈవో సురేష్ బాబు లేఖ రాశారు. అయితే ఇందుకు దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించారు. రెండు రోజుల పాటు విజిలెన్స్ అధికారులు దుర్గగుడి కార్యాలయాల్లో జరిపిన దాడుల్లో ఈ అవినీతి బాగోతం బయటపడింది.
Also Read : https://www.theleonews.com/vigilence-inspection-in-durga-temple/










