తిరుమలలో వచ్చే నెలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి నిర్ణయించింది. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఈసారి శ్రీవారి ఆలయంలోనే ఉత్సవ మూర్తులకు ఏకాంతంగా నిర్వహిస్తామని తి.తి.దే చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు. శుక్రవారం నాడు ధర్మకర్తల మండలి సమావేశాన్ని కూడా వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించారు.
పాలకమండలి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు ఉన్నాయని అన్నారు. సెప్టెంబర్ లో 18వ తేదీ నుంచి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తామని చెప్పారు.
అక్టోబర్లో నిర్వహించే బ్రహ్మోత్సవాలను అప్పటికి కరోనా వ్యాప్తి తగ్గితే ఎప్పటిలాగే మాడ వీధులలో నిర్వహించే విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొంతకాలంగా నిలిపివేసిన సర్వదర్శనం టోకెన్లు శనివారం నుంచి మళ్లీ ప్రారంభిస్తారు. అలాగే బర్డ్ ఆస్పత్రి వద్ద చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి తి.తి.దే నిర్ణయించింది.