తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరెస్టుకు రంగం సిద్దం అవుతోందా? అంటే అవుననే చెప్పాలి. సీబీఐ కదలికలు పరిశీలిస్తే త్వరలో యరపతినేని అరెస్టు తధ్యమని తెలుస్తోంది. 2011 నుంచి 2018 మధ్య కాలంలో పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లో జరిగిన సున్నపురాయి అక్రమ తవ్వకాలపై వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి ఆరు నెలలు గడుస్తున్నా కేసులో పెద్దగా పురోగతి లేదు. తాజాగా సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై సొంత పార్టీ నేతలే అక్రమ మైనింగ్ కేసు పెట్టడంతో సున్నపురాయి మైనింగ్ వ్యవహారాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఒకవైపు అంబటి కేసు ఉండగా, సీబీఐ యరపతినేని అక్రమ మైనింగ్ కేసులో కొత్తగా కదలిక వచ్చింది.
వైసీపీకి చెందిన ఒక సీనియర్ నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ఢిల్లీలోని సీబీఐ ఉన్నత అధికారులను నేరులో కలిసి ప్రత్యేకంగా యరపతినేని కేసులో కదలిక తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. సీబీఐకి కేసు అప్పగించి ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ యరపతినేనిని కనీసం విచారణకు కూడా పిలవని సీబీఐ అధికారులు, అంబటి కేసును మరుగున పడేసేందుకు వెంటనే కేసు ఫైల్ దుమ్ముదులిపారని సమాచారం. విశాఖలోని సీబీఐ ఉన్నతాధికారులు గుంటూరు చేరుకుని గనులశాఖ వద్ద నుంచి పాత ఫైల్స్ తీసుకుని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
అసలు కేసు ఏమిటి?
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం సున్నపురాయి నిక్షేపాలకు ప్రసిద్ధి. ఒక్క పిడుగురాళ్ల పట్టణ సమీపంలోనే 200 సున్నపు బట్టీలు నడుస్తున్నాయి. ఆ బట్టీలకు కావాల్సిన ముడి ఖనిజం అనుమతులు పొందిన కొందరు మైనింగ్ వ్యాపారులు సరఫరా చేస్తూ ఉంటారు. పిడుగురాళ్ల సమీపంలో మైనింగ్ చేసే వారికి అనుమతులు ఉంటాయి. కాని అనుమతి పొందేది గోరంత తవ్వేది కొండంత. అసలు మైనింగ్ లో అనుమతులు లేకుండా తవ్వుకోవడం ఒక ఎత్తయితే, 6 ఎకరాల్లో అనుమతి తీసుకుని 60 ఎకరాల్లో మైనింగ్ చేయడం మరో మోసం. గుంటూరు జిల్లా పల్నాడులో జరుగుతోంది. అదే. మరి యరపతినేని అరెస్టు విషయానికి వస్తే అనుమతి పొందిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువ మైనింగ్ చేసినట్టు సీబీఐ నిరూపించడం ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది.
త్వరలో యరపతినేని అరెస్టు తప్పదా?
సీబీఐ కదలికలు గమనించిన వారు మాత్రం అవుననే అంటున్నారు. ఇప్పటి వరకూ కేసును ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అని తలపట్టుకు కూర్చున్న సీబీఐ అధికారులకు సమాచారం అందించేందుకు గనుల శాఖలో రిటైర్డ్ అయిన ఓ అధికారి బాధ్యత తీసుకున్నట్ట్లుగా తెలుస్తోంది. మైనింగ్ లో ఆరితేరిన ఆ అధికారి అనుమతి పొందింది ఎంత తవ్వుకుంది ఎంత అని నిరూపించాల్సి ఉంది.
సుమారు 7 సంవత్సరాల్లో తవ్వకాలపై సీబీఐ విచారణ సాగుతోంది. అంటే ఆ సంవత్సరాల్లో తవ్వాల్సింది ఎంత. అక్రమార్కులు తవ్వుకుంది ఎంత అనేది తేలితే, ఆ తరువాయి అరెస్టులు ప్రారంభం అవుతాయని వినికిడి. దీన్ని నిరూపించేందుకే సీబీఐకి సమాచారం ఇచ్చేందుకు ఓ విశ్రాంత అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇదే గనుక జరిగితే రాబోయే కొద్ది రోజుల్లోనే మరో టీడీపీ నేత అరెస్టు తప్పదని గుంటూరు జిల్లాలో టాక్ వినిపిస్తోంది.
సైలెంట్ అయిపోయిన యరపతినేని?
వైసీపీ నేతలపై ఎప్పుడూ ఒంటి కాలుపై లేచే యరపతినేని కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. ఒక వేళ ప్రెస్ మీట్లు పెట్టినా, అమరావతి రాజధాని గురించి, లేదా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంధ్ర అరెస్టులపైనే మాట్లాడారు. అంబటి రాంబాబు పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేస్తున్నా గుంటూరు టీడీపీ నేతలు నోరు మెదపడలేదు. ఎవరు గట్టిగా మాట్లాడితే వారికి జైలు తప్పదని భయపడటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా యరపతినేని అరెస్టుకు రంగం సిద్దమైందనే ప్రజలు అనుకుంటున్నారు.