కమెడియన్ టర్నడ్ కథానాయకుడు సునీల్ ప్రస్తుతం వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే… కమెడియన్ గా కెరీర్ స్టార్ చేసిన సునీల్.. ఆతర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా సునీల్ కి హీరోగా విజయాన్ని అందించింది. ఆతర్వాత నటించిన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించిన మర్యాద రామన్న సినిమా కూడా సునీల్ కి విజయాన్ని అందించింది.
ఆతర్వాత నుంచి సునీల్ హీరోగా చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని అందివ్వలేదు. దీంతో కెరీర్ లో కాస్త వెనకబడిన సునీల్ విలన్ వేషాలు వేయడానికి కూడా ఓకే చెప్పాడు. రవితేజ నటించిన ‘డిస్కోరాజా’ సినిమాలో విలన్ గా నటించినా.. పెద్దగా పేరు రాలేదు. అయితే.. రీసెంట్ గా కలర్ ఫోటో సినిమాలో విలన్ నటించిన సునీల్ కి మంచి పేరు వచ్చింది. దీంతో ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా కూడా నటించేందుకు ఓకే చెబుతున్నాడు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పుష్ప మూవీలో కూడా విలన్ నటించేందుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు సునీల్ డైరెక్టర్ గా మారబోతున్నాడట. ఓ మరాఠి మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు రైట్స్ తీసుకున్నారని.. ఈ చిత్రం ద్వారా సునీల్ దర్శకుడిగా మారనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇందులో హీరో కూడా సునీలే. ఈ సినిమాకి నిర్మాత ఎవరు..? ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారు..? ఈ మూవీ కథాంశం ఏంటి..? అనేది తెలియాల్సివుంది. మరి.. కమెడియన్ గా కథానాయకుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న సునీల్ దర్శకుడిగా కూడా మెప్పించి విజయం సాధిస్తాడేమో చూడాలి.